బెంగళూరు: ఎయిర్‌ఫోర్స్ క్యాడెట్ ఆత్మహత్య సంఘటనకు సంబంధించి మృతుడి సోదరుడు అమన్ ఝా ఫిర్యాదుతో ఆరుగురు ఎయిర్ ఫోర్స్ అధికారులపై పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. బెంగళూరు జలహళ్లి లోని ఎయిర్‌ఫోర్స్ టెక్నికల్ కాలేజీ (ఎఎఫ్‌టిసి)లో క్యాడెట్‌గా శిక్షణ పొందుతున్న 27 ఏళ్ల అంకిత్ కుమార్ ఝా పై శనివారం క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. శిక్షణ నుంచి కూడా తొలగించి న్యాయవిచారణకు ఎయిర్‌ఫోర్స్ అధికారులు ఆదేశించారు. అంకిత్ క్యాంపస్ లోని గదిలో ఉరేసుకుని వేలాడుతూ కనిపించినట్టు పోలీసులు చెప్పారు. ఎయిర్ కమోడోర్, వింగ్ కమాండర్, గ్రూప్ కెప్టెన్ హోదాలో ఉన్న ఐఎఎఫ్ అధికారులు తనను వేధించి ఆత్మహత్యకు పురిగొల్పినట్టు సూసైడ్ లేఖ రాసినట్టు తెలుస్తోంది. అమన్ ఝా తన ఫిర్యాదులో సాక్షాలను తారుమారు చేయడానికి ప్రయత్నాలు జరిగాయని ఆరోపించారు.
శనివారం తెల్లవారు జామున 4.30 గంటల ప్రాంతంలో తాను పోలీస్ స్టేషన్‌కు ఒక సాక్షం ఇవ్వడానికి వెళ్లగా అప్పటికే ఎఫ్‌టిసికి చెందిన కొందరికి ఈ విషయం తెలియడం, వారు అక్కడకు రావడం తనకు ఆశ్చర్యం కలిగించిందని అమన్ ఝా ఆరోపించారు. ఈ మరణానికి కారణమేమిటో ఇంకా నిర్ధారించవలసి ఉందని, తాము దర్యాప్తు చేస్తున్నామని సీనియర్ పోలీస్ ఆఫీసర్ చెప్పారు. అయితే ఫిర్యాదుపై కేసు నమోదైన వారిని ఇంకా అరెస్టు చేయలేదని, కానీ ఈ కేసు విషయంలో తాము సహకరిస్తామని ఇండియన్ ఎయిర్ ఫోర్సు హామీ ఇచ్చిందని తెలిపారు. తదుపరి విచారణ కోసం తాము పోస్ట్‌మార్టమ్ నివేదిక కోసం నిరీక్షిస్తున్నామని చెప్పారు.
Indian Air Force Cadet found dead