టెక్సాస్: అమెరికాలోని టెక్సాస్‌లో అత్యున్నత విద్యా పురస్కారం భారతీయ సంతతికి చెందిన ఒక కంప్యూటర్ ఇంజనీరింగ్ ప్రొఫెసరర్ అశోక్ వీరరాఘవన్‌కు లభించింది. ఎడిత్ అండ్ పీటర్ ఓడోనెల్ అవార్డు ఇన్ ఇంజనీరింగ్ అశోక్ వీరరాఘవన్‌కు దక్కింది. టెక్సాస్ రాష్ట్రంలో ప్రతిభావంతులైన పరిశోధకులకు టెక్సాస్ అకాడమీ ఆఫ్ మెడిసిన్, ఇంజనీరింగ్, సైన్స్ అండ్ టెక్నాలజీ(టిఎఎంఇఎస్‌టి) ఈ అవార్డులను ప్రదానం చేస్తుంది. కనిపించని వస్తువులను కనిపించే విధంగా చేయగల ఇమేజింగ్ టెక్నాలజీలో విప్లవాత్మకమైన ఆవిష్కరణలు చేసి విశేష ప్రతిభను కనబరిచారు వీరరాఘవన్.
రైస్ యూనివర్సిటీలో జార్జి ఆర్ బ్రౌన్ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్‌లో ఎలెక్ట్రికల్, కంప్యూటర్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న వీరరాఘవన్‌కు ఈ ఏడాది ఈ అవార్డుకు ఎంపికయ్యారు. మెడిసిన్, ఇంజనీరింగ్, బయోలాజికల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్, టెక్నాలజీ ఇన్నోవేషన్‌లో వినూత్న ఆవిష్కరణలు చేసిన పరిశోధకులకు ఏటా ఈ అవార్డులను అందచేస్తారు.ఈ ఏడాది ఇంజనీరింగ్‌లో అవార్డు అశోక్ వీరరాఘవన్‌కు ప్రకటిస్తున్నట్లు టిఎఎంఇఎస్‌టి ఒక ప్రకటనలో తెలిపింది.