గ్యాంగ్‌టక్ : హిమాలయ ప్రాంత రాష్ట్రమైన సిక్కింలో ప్రమాదంలో చిక్కుకున్న 500 మంది పర్యాటకులను భారత్ ఆర్మీ కాపాడగలిగింది. ఉత్తర సిక్కింలో ఎడతెరిపి లేని భారీ వర్షాలతో కొండచరియలు విరిగిపడి రోడ్లన్నీ దిగ్బంధం కావడంతో ప్రమాదంలో 500 మంది పర్యాటకులు చిక్కుకున్నారు. వీరిలో 218 మంది పురుషులు, 113 మంది మహిళలు, 54 మంది పిల్లలు ఉన్నారు.
లాచుంగ్ నుంచి లాచెన్ లోయకు వీరు వెళ్తుండగా లాచెన్, లాచుంగ్, చుంగ్‌తాంగ్ ప్రాంతాల్లో శుక్రవారం కుండపోత వర్షంతో కొండచరియలు విరిగిపడి రోడ్లన్నీ మూసుకుపోయాయని అధికారులు శనివారం తెలిపారు. ఎస్‌డిఎం చుంగ్‌తాంగ్ అభ్యర్థనపై త్రిశక్తి బలగాలు, భారత ఆర్మీ రంగం లోకి దిగి చిక్కుకున్న పర్యాటకులను సురక్షితంగా బయటకు తీసుకురాగలిగారు. వీరిని మూడు వేర్వేరు శిబిరాలకు తరలించి వేడి భోజనం, వెచ్చని దుస్తులు అందించామని రక్షణ యం త్రాంగ అధికార ప్రతినిధి తెలిపారు.