ఇంఫాల్ : మణిపూర్‌లో పరిస్థితి చేయిదాటి పోతోంది. గురువారం కూడా పలు చోట్ల ఘర్షణలు జరగడంతో సైన్యాన్ని రంగంలోకి దింపారు. తీవ్రస్థాయి ఘటనల్లో కఠినంగా వ్యవహరించాలని, కన్పిస్తే కాల్పుల ఉత్తర్వులు వెలువరించారు. అల్లర్లను అణచివేసేందుకు ఆర్మీ ఇప్పుడు వ్యవస్థను తన అదుపులోకి తీసుకుంది. ఇంఫాల్‌లో ఆర్మీ వీధులలో తిరుగుతోంది. పలు చోట్ల సైనిక కవాతు నిర్వహించారు. మణిపూర్‌లో ఇప్పుడు ముఖ్యమంత్రి నన్గ్‌థాంబమ్ బీరెన్ సింగ్ సారధ్యంలోని బిజెపి ప్రభుత్వం ఉంది. బుధవారం రాత్రి పలు ప్రాంతాలలో ఘర్షణలు జరగడంతో ఎనిమిది జిల్లాల్లో కర్ఫూ విధించారు. ఇప్పుడు శాంతిభద్రతల పరిస్థితి నిర్వహణ బాధ్యతను సైన్యం తన చేతుల్లోకి తీసుకుంది. ఇంఫాల్, ఛురఛంద్‌పూర్, కంగపోక్పిలో హింసాకాండ చెలరేగింది. ఘర్షణల ప్రాంతాలలో సైన్యం ఫ్లాగ్‌మార్చ్ జరిపింది.
మొయితీ కులాలకు ఎస్‌టి హోదాతో అగ్నిగుండం
ఇటీవల అత్యధిక శాతం జనాభా ఉన్న మెయితీ కులాన్ని ఎస్‌టి తెగలో చేర్చాలనే కోర్టు ఉత్తర్వులపై ఎస్‌టిలు నిరసన వ్యక్తం చేయడం, నిర్ణయం వివాదాస్పదం కావడం చివరికి రాష్ట్రమంతటా అగ్నిగుండం పరిస్థితి ఏర్పడింది. గిరిజన తెగలు పలు చోట్ల ఈ తీర్పుపై ఆగ్రహావేశాలకు దిగాయి. మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో మొబైల్ ఇంటర్నెట్ ప్రసారాలను నిలిపివేసింది. ఇంఫాల్‌లో కొన్ని ప్రాంతాలలో హింసాత్మక ఘటనలు జరిగాయి. ఆర్మీ, పారామిలిటరీ బలగాలను వెంటనే ఇక్కడికి రప్పించారు. అల్లర్లు జరుగుతున్న ప్రాంతాల నుంచి ఇప్పటికే దాదాపు 10వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వారిని ఆర్మీ క్యాంపులకు, ప్రభుత్వ కార్యాలయాల ఆవరణలకు చేర్చారు. భారతీయ సైన్యం, అస్సామ్ రైఫిల్స్ పలు చోట్ల సహాయక చర్యలు చేపట్టాయి.
Also Read: గ్యాంగ్‌స్టర్ ఎన్‌కౌంటర్..
రాత్రి అంతా వీరు ఓ వైపు పహారా కాస్తూనే మరో వైపు 7500 మందిని క్యాంప్‌లకు తీసుకువెళ్లారు. మణిపూర్ ప్రజల సంక్షేమం, వారి భద్రత పట్ల తాము విధి నిర్వహణలో మరింత అంకితభావంతో వ్యవహరిస్తామని సైన్యం ఓ ప్రకటన వెలువరించింది. మరో వైపు ఆల్ ట్రైబల్ స్టూడెంట్ యూనియన్ మణిపూర్ (ఎటిఎస్‌యుఎం) గిరిజన సంఘీభావ ప్రదర్శనకు పిలుపు నిచ్చింది. గిరిజనేతరులను ఎస్‌టి తెగల హోదా కల్పించడంపై పలు చోట్ల ప్రదర్శనలు జరిగాయి. రాష్ట్రంలో మెయితీ కులాలు మొత్తం జనాభాలో 53 శాతం వరకూ ఉన్నారు. వీరు ఎక్కువగా మణిపూర్ లోయ ప్రాంతంలో నివసిస్తున్నారు. తాము మయన్మారీలు, బంగ్లాదేశీల భారీ స్థాయి అక్రమ వలసలతో పలు ఇక్కట్లకు గురవుతున్నామని ఆవేదన చెందుతున్నారు. బుధవారం సిఎం ఎన్ బీరెన్ సింగ్ ప్రసంగించాల్సిన ఓ వేదికను నిరసనకారులు ముందుగానే ధ్వంసం చేశారు.
పరిస్థితిపై హోం మంత్రి అమిత్ షా సమీక్ష
అదనపు భద్రతా బలగాలను పలు ప్రాంతాలకు తరలించారు. మణిపూర్ పరిస్థితిపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ , ముఖ్యమంత్రితో మాట్లాడుతూ ఉన్నారు. కేంద్రం ఈ కీలక ఈశాన్య రాష్ట్రంలో పరిస్థితిని చక్కదిద్దేందుకు రాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ఆర్‌ఎఎఫ్) దళాలను పంపించింది. గిరిజనేతరులు ఎక్కువగా ఉండే ఇంఫాల్ వెస్ట్, కక్‌చింగ్, తౌబాల్, జిరిబామ్, బిష్ణుపూర్ జిల్లాలు, గిరిజనులు అత్యధికంగా ఉండే ఛురఛంద్‌పూర్, టెంగోపల్ ఇతర జిల్లాలో కూడా కర్ఫూ విధించారు. హింసాకాండను అదుపులో పెట్టెందుకు 55 కంపెనీల ఆర్మీ, అస్సాం రైఫిల్స్‌ను రంగంలోకి దింపారు.
మరో 14 బృందాలను సిద్ధంగా ఉంచినట్లు ఢిల్లీలో రక్షణశాఖ అధికార ప్రతినిధి తెలిపారు. మణిపూర్‌లో పరిస్థితిపై కేంద్రం ఎప్పటికప్పుడు జాగ్రత్తగా గమనిస్తోంది. గురువారం సాయింత్రానికి భారీ ఎత్తున భద్రతా బలగాలు చేరుకున్నాయి. అత్యధిక సంఖ్యలోని మొయితీలకు ఎస్‌టి కోటా కల్పనకు పలు రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించాయి. అయితే రాష్ట్రంలో బలీయ శక్తిగా ఉన్న నాగాలు, కుకీలు ఎస్‌టి జాబితాలోకి ఈ కులం రాకను తీవ్రంగా ప్రతిఘటించడం వీధుల్లో ఘర్షణలకు దారితీసింది.