Wednesday, January 22, 2025

పోలీసులను చితకబాదిన సైనికులు..

- Advertisement -
- Advertisement -

పోలీసు స్టేషన్‌లోకి చొరబడి మరీ నలుగురు పోలీసులను సైనిక సిబ్బంది చితకబాదిన ఘటన జమ్మూ కశ్మీరులోని కుప్వారా జిల్లాలో బుధవారం వెలుగుచూసింది. ఈ ఘటనపై పోలీసులు సైనిక సిబ్బందిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. అయితే పోలీసులకు, సైనిక సిబ్బందికి మధ్య చిన్నపాటి విభేదాలు తలెత్తాయని, వాటిని సామరస్యపూర్వకంగా పరిష్కరించామని రక్షణ శాఖ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. కుప్వారా పోలీసు స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారులు రయీస్ ఖాన్, ఇంతియాజ్ మలిక్, కానిస్టేబుల్స్ సీం ముష్తాక్, జహూర్ అహ్మద్ మంగళవారం రాత్రి గాయాలపాలై సౌరాలోని స్కిమ్స్ ఆసుపత్రిలో చేరారని, వారి పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు బుధవారం తెలిపారు. ఒక సైనికాధికారి నాయకత్వంలో సైనికుల బృందం పోలీసు స్టేషన్‌లోకి మంగళవారం రాత్రి చొరబడి పోలీసులను చితకబాదినట్లు అధికారులు తెలిపారు.

అయితే వారి మధ్య ఈ గొడవ ఎందుకు జరిగిందో అన్న విషయాన్ని పోలీసులు కాని సైనికులు కాని వివరించడం లేదు. కాగా..కుప్వారాలోని బట్పోరాలో నివసిస్తున్న ఒక స్థానిక సైనిక సిబ్బంది ఇంటిపై ఒక పోలీసు బృందం ఒక కేసు దర్యాప్తు కోసం దాడి చేసినట్లు తెలిసింది. ఈ విషయం తెలుసుకుని సైనిక సిబ్బంది ఆగ్రహంతో పోలీసు స్టేషన్‌పై దాడి చేసినట్లు వర్గాలు తెలిపాయి. పోలీసులు, సైనిక సిబ్బంది మధ్య గొడవ జరగడం, పోలీసులపై సైనిక సిబ్బంది చేయిచేసుకోవడం వంటి వార్తలన్నీ అసత్యాలని రక్షణ శాఖ ప్రతినిధి చెప్పారు. విధి నిర్వహణలో పోలీసు సిబ్బందికి, సైనిక సిబ్బందికి మధ్య చిన్నపాటి విభేదాలు తలెత్తాయని, వాటిని సామరస్యపూర్వకంగా పరిష్కరించామని ప్రతినిధి తెలిపారు. కాగా..తమపై దాడి చేసిన సైనిక సిబ్బందిపై కుప్వారా పోలీసులు హత్యాయత్నంతోసహా వివిధ సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News