గగన్‌యాన్ మిషన్‌లో శిక్షణ పొందుతున్న నలుగురిలో ఒకరు నాసాతో సమన్వయం ప్రయత్నంలో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్)కు ప్రయాణిస్తారని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ లోక్‌సభకు శనివారం తెలియజేశారు. లిఖితపూర్వక సమాధానంలో మంత్రి ఈ వివరాలు తెలియజేశారు.ఈమేరకు ప్రైవేట్ సంస్థ ఏక్సియమ్ స్పేస్‌ను నాసా గుర్తించిందని, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వ్యోమగాములను పంపడానికి వీలుగా అమెరికా సంస్థ తో ఇస్రో ఒప్పందం కుదుర్చుకుందని వివరించారు. గత ఏడాది ప్రధాని మోడీ అమెరికాలో పర్యటించినప్పుడు భారత్ , అమెరికా పరస్పర సమన్వయంతో ఐఎస్‌ఎస్‌కు 2024లో వ్యోమగాములను పంపించడమౌతుందని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ ప్రకటించారు.
భారత వ్యోమగాముల ఎంపిక బోర్డు గగన్‌యాన్‌లోశిక్షణ పొందుతున్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్లులో నలుగురిని ఎంపిక చేసింది. భారత ప్రథమ మానవ అంతరిక్షయాత్ర వచ్చే ఏడాది జరుగుతుంది. “ నలుగురు భారత వ్యోమగాములు రష్యాలో వ్యోమనౌక బేసిక్ మాడ్యూల్‌లో శిక్షణ పొందారు. ప్రస్తుతం గగన్‌యాన్ మిషన్ కోసం బెంగళూరు లోని ఇస్రోకు చెందిన ఏస్ట్రోనాట్స్ ట్రైనింగ్ ఫెసిలిటీ (ఎటిఎఫ్)లో శిక్షణ పొందుతున్నారు” అని సింగ్ పేర్కొన్నారు. గగన్‌యాన్ మిషన్ తాజా సమాచారం వివరిస్తూ క్షేత్రస్థాయి పరీక్షలో సాలిడ్, లిక్విడ్, క్రియోజెనిక్ ఇంజిన్ తదితర పరీక్షలు పారాచ్యూట్ వ్యవస్థల పరీక్షలు పూర్తయ్యాయని చెప్పారు. అలాగే ఆర్బిటల్ మోడ్యూల్ ప్రిపరేషన్ ఫెసిలిటీ (ఒఎంపిఎఫ్) , ఏస్ట్రోనాట్ ట్రైనింగ్ ఫెసిలిటీ (ఎటిఎఫ్) ఆక్సిజన్ టెస్టింగ్ ఫెసిలిటీ ఆపరేషన్ , గ్రౌండ్ స్టేషన్ నెట్‌వర్క్ వ్యవస్థీకృతం, పూర్తి కావస్తున్నాయని వివరించారు.