పాటియాల: బెలారస్‌కు చెందిన భారత అథ్లెటిక్ కోచ్ నికోలాయ్ స్నెసరేవ్ శుక్రవారం పాటియాలలోని తన హాస్టల్ గదిలో చనిపోయి కనిపించారు. రెండేళ్ల క్రితం అథ్లెటిక్ కోచ్‌గా పని చేసిన నికోలాయ్ 2019లో ఆ పదవినుంచి వైదొలగి స్వదేశానికి తిరిగి వెళ్లాడు. అయితే టోక్యో ఒలింపిక్స్‌కు ఎంపికయిన అవినాష్ సాబ్లే, మరికొందరు ఆశావహులకు శిక్షణ ఇవ్వడం కోసం ఆయన మళ్లీ మన దేశానికి వచ్చాడు. ఈ నెల 2వ తేదీ భారత్‌కు వచ్చిన 72 ఏళ్ల నికోలాయ్ పాటియాలలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్‌లో శుక్రవారం జరిగిన ఇండియన్ గాడ్‌ప్రి పోటీల కోసం బెంగళూరునుంచి ఇక్కడికి వచ్చాడు.
అయితే ఈ రోజు ఆయన పోటీలు చూడడానికి రాకపోవడంతో కోచ్‌లు సాయంత్రం ఆయన హాస్టల్ రూమ్‌కు వెళ్లి చూడగా బెడ్‌పై అచేతనంగా కనిపించాడు. ఆయన మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపించారు. ఆయన మృతికి కారణాలను ఇప్పుడే చెప్పలేమని, పోస్టుమార్టం తర్వాతే తెలుస్తుందని ఆయన మరణాన్ని ధ్రువీకరించిన సాయ్ డాక్టర్ చెప్పారు. కాగా నికోలాయ్ మృతికి అథ్లెటిక్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు అదిల్లే సుమరివాలా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.