జకార్తా: ఇండోనేషియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత స్టార్ షట్లర్లు పి.వి.సింధు, లక్ష్యసేన్‌ల పోరాటం ముగిసింది. శుక్రవారం జరిగిన సింగిల్స్ క్వార్టర్ ఫైనల్ పోటీల్లో సింధు, లక్షసేన్ ఓటమి పాలయ్యారు. మహిళల విభాగంలో అగ్రశ్రేణి క్రీడాకారిణి సింధు చిరకాల ప్రత్యర్థి రచనోక్ ఇంటనాన్ (థాయిలాండ్) చేతిలో పరాజయం చవిచూసింది. ఏకపక్షంగా సాగిన పోరులో రచనోక్ పూర్తి ఆధిపత్యం చెలాయించింది. ఆరంభం నుంచే దూకుడుగా ఆడుతూ సింధును ఉక్కిరిబిక్కిరి చేసింది. రచనోక్ ధాటికి సింధు కనీస పోటీని కూడా ఇవ్వకుండానే చేతులెత్తేసింది. అద్భుత ఆటను కనబరిచిన రచనోక్ 2112, 2110 తేడాతో సింధును ఓడించి సెమీస్ బెర్త్‌ను దక్కించుకుంది.
చెలరేగి ఆడిన రచనోక్ 33 నిమిషాల్లోనే మ్యాచ్‌ను ముగించడం విశేషం. మరోవైపు పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో లక్షసేన్ పరాజయం పాలయ్యాడు. చైనా షట్లర్ చౌ టిన్ చెన్‌తో జరిగిన పోరులో లక్షసేన్‌కు ఓటమి ఎదురైంది. గంటకు పైగా సాగిన హోరాహోరీ పోరులో చెన్ 2116, 1221, 2114 తేడాతో భారత ఆటగాడిని ఓడించాడు. ఆరంభ సెట్‌లో చెన్ దూకుడుగా ఆడాడు. తన మార్క్ షాట్లతో లక్షసేన్‌ను హడలెత్తించాడు. ఇదే క్రమంలో సెట్‌ను కూడా దక్కించుకున్నాడు. అయితే రెండో సెట్‌లో భారత ఆటగాడు లక్షసేన్ పుంజుకున్నాడు. అద్భుత పోరాట పటిమను కనబరుస్తూ 2112 తేడాతో సెట్‌ను దక్కించుకున్నాడు. కానీ కీలకమైన మూడో గేమ్‌లో మళ్లీ తడబడ్డాడు. ఒత్తిడిని తట్టుకోలేక వరుస తప్పిదాలకు పాల్పడ్డాడు. దీన్ని తనకు అనుకూలంగా మార్చుకోవడంలో సఫలమైన చెన్ సెట్‌తో పాటు మ్యాచ్‌ను గెలిచి సెమీస్‌కు చేరుకున్నాడు.