న్యూఢిల్లీ: ఈస్టర్న్ లద్ధాఖ్‌లోని ఘర్షణాస్పద ప్రాంతం గోగ్రా నుంచి భారత్, చైనా సైనిక బలగాల ఉపసంహరణ ప్రక్రియ పూర్తయింది. ఈ విషయాన్ని భారత సైనిక వర్గాలు శుక్రవారం తెలిపాయి. ఈ ప్రాంతంలో ప్రతిష్టంభనకు ముందటి క్షేత్రస్థాయికి ఇప్పుడు తిరిగి పరిస్థితి చేరుకుందని వెల్లడించారు. రెండు దేశాల మధ్య సైనిక దళాధికారుల స్థాయి సంప్రదింపుల క్రమంలో కుదిరిన అంగీకారం ఫలితంగా ఇప్పుడు కార్యాచరణ దిశలో క్షేత్రస్థాయిలో నెలకొన్న ఫలితం ఇదేనని అధికారులు తెలిపారు. రెండురోజులుగా ఈ ప్రాంతం నుంచి సేనల ఉపసంహరణ జరుగుతూ వచ్చింది.
ఇప్పుడు రెండు దేశాల సేనలు తమతమ శాశ్వత సైనిక స్థావరాలకు చేరుకున్నాయని అధికారులు తెలిపారు. గోగ్రా ప్రాంతం భారత్ చైనా సరిహద్దులలో అత్యంత ప్రధాన ప్రాంతం. ఆధిపత్యం కోసం ఇరు పక్షాలూ ఎప్పటికప్పుడు ఎదురెదురు పడే దశలలో సంభవించే పరిణామాలు ఉద్రిక్తతలను రెచ్చగొడుతున్నాయి. ఈ గోగ్రా ప్రాంతాన్నిపెట్రోలింగ్ పాయింట్ 17 ఎ అని పిలుస్తారు. ఈ ప్రాంతంలో ఏర్పాటు అయిన తాత్కాలిక కట్టడాలన్నింటినీ పూర్తిగా తొలిగించారని, దీనిని పరస్పరం ఇరుపక్షాలూ నిర్థారించుకోవడం జరిగిందని సైనిక వర్గాలు తెలిపాయి.