Saturday, November 23, 2024

ఆమె ‘డ్రీమ్ గర్ల్’ ఎలా అయింది?

- Advertisement -
- Advertisement -

Dream Girl Hema Malini
ముంబయి: హిందీ నటి హేమా మాలిని పుట్టిన రోజు నేడు(శనివారం). ఆమె 16 అక్టోబర్ 1948లో పుట్టారు. ఆమె నటిగా, రచయిత్రి, దర్శకురాలిగా, నిర్మాతగా, రాజకీయనాయకురాలిగా జీవితంలో రాణించారు. కానీ చిత్ర రంగంలో ఆమెకంటూ ఓ ముద్రను నిలుపుకున్నారామె. హిందీ సినీ రంగంలో ఆమెను అంతా ‘డ్రీమ్ గర్ల్’ అంటారు. అసలామె డ్రీమ్ గర్ల్ ఎలా అయ్యారన్నది చాలా మందికి ఓ పజిల్ వంటి ప్రశ్న.

హేమా మాలిని అభిమానుల గుండెలు దోచుకున్న అందాల తార. చిత్రరంగంలోకి ఆమె 1968లో రాజ్‌కపూర్ నటించిన చిత్రం ‘సప్నో కా సౌదాగర్’ ద్వారా పరిచయం అయ్యారు. ఆ సినిమాతోనే ఆమె అందరికీ ‘డ్రీమ్ గర్ల్’గా పరిచయం అయ్యారు. ఆ సినిమాకి నిర్మాత సివి శ్రీధర్. కానీ ఆ సినిమాకు మరో నిర్మాత బి. అనంతస్వామి. రాజ్‌కపూర్‌తో తీసే కొత్త సినిమాకు హేమా మాలినే సరిపోతారని నాడు అనంతస్వామి భావించారు. అప్పుడు హేమామాలినికి కేవలం 16 ఏళ్లే. నాటి ప్రముఖ నటి వైజయంతిమాలాకు సరితూలగల నటి హేమామాలినేనని, ఆమెలా నాట్యం చేయడం కూడా హేమామాలినికి సాధ్యమని ఆయన భావించారు. హేమామాలిని కాస్టూమ్, యాస తదితరాలన్నింటిని ఆ కొత్త సినిమాలో సానబట్టారు. ఆల్ ఇండియా రేడియోలో ప్రసిద్ధ యాంకర్ అయిన లక్ష్మీ శర్మ ఆమెకు డైలాగులు ఎలా పలకాలో నేర్పించారు. నాడు హేమా మాలినికి నిర్మాత అనంతస్వామి ఓ గాడ్‌ఫాదర్‌గా మారారు. అప్పుడే ఆయన రాజ్‌కపూర్ ‘డ్రీమ్ గర్ల్’ అన్న ట్యాగ్ ఇచ్చారు. వారిద్దరి సినిమా ‘సప్నో కా సౌధాగర్’ విడుదలయ్యాక అందరూ ఆమెను ‘డ్రీమ్ గర్ల్’ అనడం మొదలెట్టారు. ఆ ట్యాగ్ తనకే ఆశ్చర్య కలిగించిందని హేమామాలిని అంటుంటారు. అయితే తానెప్పుడు అభిమానుల మనస్సు నొప్పించే పాత్రలు చేయలేదంటారు. ఇప్పటికీ చాలా మంది తనను ‘డ్రీమ్ గర్ల్’ అని పిలవడం తనకు ఇబ్బందికరంగా ఉంటుందని అంటారు హేమామాలిని. ‘ఇప్పుడు నేను ప్రౌఢనైపోయాను, డ్రీమ్‌గర్ల్‌గా ఏమి లేను’ అంటారు.

దర్శకుడు విజయానంద్- హేమామాలిని, దేవానంద్‌తో ‘జానీ మేరా నామ్’ సినిమా తీశాక ఆమె తార పథంలోకి దూసుకుపోయారన్నది యథార్థం. ఆమె నటించిన ‘షోలే’, ద్విపాత్రాభియం చేసిన ‘సీతా ఔర్ గీతా’ ఇప్పటికీ అభిమానుల గుండెల్లో నిలిచిపోయిన సినిమాలు. ఆమె ఇంకా త్రిశూల్, మీరా, క్రాంతి, సత్తే పే సత్తా, నసీబ్, రజియా సుల్తానా, బాఘ్‌బన్, వీర్ జార, ఆరక్షన్ వంటి సినిమాల్లో నటించింది. తాజాగా 2020లో విడుదలైన ‘షిమ్లా మిర్చీ’లో కూడా ఆమె నటించారు. ‘డ్రీమ్ గర్ల్’ అనే మాట హేమామాలినికి నేడు ఇబ్బంది కలిగించినప్పటికీ అది ఆమెకు చక్కగా సూట్ అవుతుందన్నది కాదనలేని సత్యం. హిందీ సినిమా వైభవం నిలిచినంత కాలం ఆమె హిందీ సినీ అభిమానులందరికీ ‘డ్రీమ్ గర్లే’!

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News