Thursday, December 19, 2024

ఓట్ల పండుగొస్తేనే ధరలు కొండ దిగుతాయా?

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఆడబిడ్డలకు రాఖీ కానుకగా రూ.200 వంట గ్యాస్ ధరలు తగ్గించామని చెబుతున్న కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అమాంతం పెంచింది మీరే.. ఇప్పుడు అవసరానికి తగ్గిస్తున్నది మీరేనంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. జనం ఓట్లతో అవసరం ఉంటేనే సాధారణ ప్రజలపై ప్రభుత్వం ప్రేమ ఒలకబోయడం పరిపాటిగా మారిందని విమర్శలు గుప్పిస్తున్నారు. కొద్ది నెలల క్రితం జరిగిన వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమయంలో తగ్గించిన పెట్రో, డీజిల్ ధరలను ఇప్పుడు గుర్తు చేస్తున్నారు. కొంత కాలంగా ఎల్‌పిజి ధరలు తగ్గించాలని దేశవ్యాప్తంగా డిమాండ్లు వెల్లువెత్తుతున్నా పట్టించుకోని కేంద్ర ప్రభుత్వం పెద్దలు అంతర్జాతీయ మార్కెట్ ప్రకారమే ధరల భారం వేస్తున్నామని ప్రకటనలు చేస్తూ వాటిని తిప్పి కొడుతూ వచ్చారు. మరి అలాంటప్పుడు ఇప్పుడు అంతర్జాతీయంగా ధరలు అమాంతం పడిపోతేనే ధరలు తగ్గించారా.. ఎంత మేరకు తగ్గాయో బయటపెట్టాలని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

ఇన్నాళ్లు దోపిడీ కొనసాగించి ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు(తెలంగాణ, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, రాజస్థాన్, మిజోరం) కనుచూపు మేరలో ఉండడంతోనే కేంద్రం దిగివస్తోందని, ఓట్ల వేట కొనసాగించే స్టంట్‌గా, పేదలను బుట్టలో వేసుకునే ఎత్తుగడగా ధరల తగ్గింపును అభివర్ణిస్తున్నారు. 2014లో మోడీ ప్రభుత్వం అధికారాన్ని హస్తగతం చేసుకున్నపుడు 14కేజీల వంట గ్యాస్ సిలిండర్ ధర రూ.410. అందులోనూ పేదలకు కొంత మొత్తంలో గ్యాస్ సబ్సిడీ లభించేది. ఇప్పుడు గ్యాస్ సిలిండర్ ధర రూ.1053కి చేరింది. అంతేకాకుండా మోడీ సర్కారు గ్యాస్ సబ్సిడీని భారీగా తగ్గించింది. కొందరికి ఆ సబ్సిడీ కూడా ఎత్తేశారు. ఇంకొందరైతే అతి త్వరలో పెట్రోల్, డీజిల్ ధరలు కూడా దిగివస్తాయని పోస్టులు పెడుతునారు. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధరలు భారీగా దిగొచ్చినా.. దేశవ్యాప్తంగా కొన్ని నెలలుగా స్థిరంగా ఉన్నప్పటికీ ఆ మేరకు చమురు ధరలు తగ్గించని బిజెపి ప్రభుత్వం త్వరలో వాటిని తగ్గించి అది తమ ఘనతగా ఎన్నికలున్న రాష్ట్రాల ప్రజల వద్దకు

వెళ్లబోతోందని ఆరోపణలు వస్తున్నాయి. కరోనా లాంటి విపత్తు తర్వాత ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోవడానికి, సామాన్యుల జీవితం భారంగా మారడానికి పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెరుగుదలే కారణం. ఒక దశలో లీటర్ పెట్రోల్ ధర రూ.120 వరకు వెళ్లింది. కానీ దేశంలో కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు రావడంతో ఆ సమయంలో లీటర్ పెట్రోల్‌పై కేంద్ర ప్రభుత్వం రూ.5 తగ్గించింది. ఇప్పుడు మరోసారి ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు సమీపిస్త్న్ను వేళ లీటర్ పెట్రోల్, డీజిల్‌పై మరో రూ.5 వరకు ఉపశమనం కలిగించే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News