పనాజీ : భారతీయ తీరరక్షక దళం సకాలంలో సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో ఎనమండుగురు ప్రఖ్యాత శాస్త్రజ్ఞులు సహా 36 మంది సురక్షితంగా బయటపడ్డారు. సముద్ర జలాలు, అంతర్భాగాల పరిశోధనలకు ఉద్ధేశించిన నౌక సింధూ సాధన సముద్రజలాలలో ఇంజిన్ ఆగిపోవడం, ఇంధనం లీక్ కావడంతో చిక్కుపడింది. ఇది కార్వార్ వైపు కొట్టుకుపోతున్న దశలో కోస్ట్‌గార్డు దళం గమనించి ఆదుకుంది. పుణేలోని సముద్ర ఉపరితల జాతీయ పరిశోధనా సంస్థ (సిఐఎస్‌ఆర్)కు చెందిన నౌక చలనం లేని స్థితిలో కల్లోలిత తీరం వెంబడి ప్రమాదకర స్థితిలో పడినప్పుడు దీనిని రక్షించారు.
నౌక నుంచి ప్రమాద సంకేతాలు వెలువడటంతో కోస్ట్‌గార్డ్ రంగంలోకి దిగాయి. నౌకలో అత్యంత విలువైన శాస్త్ర సాంకేతిక పరికరాలు ఉండటం, అత్యంత విలువైన పరిశోధనా సమాచారం ఉండటంతో పాటు పర్యావరణపరంగా అత్యంత సున్నితమైన కర్వార్ తీరం వెంబడి దుర్ఘటన జరిగి ఉంటే పలు పర్యావరణ సమస్యలు తలెత్తి ఉండేవి. సముద్ర తీర పర్యావరణానికి విఘాతం ఏర్పడేది. దీనిని తీసుకుని ఈ రెండు సహాయక నౌకలు గోవా తీరం వైపు దూసుకువచ్చాయి. సిఎస్‌ఐఆర్ నియో పరిశోధక నౌకలోని వారంతా సురక్షితంగా ఉన్నట్లు వెల్లడైంది.