అహ్మదాబాద్ : గుజరాత్ తీరం లోని అరేబియా సముద్రంలో బుధవారం ప్రమాదంలో చిక్కుకున్న విదేశీ రవాణా నౌక నుంచి 22 మంది సిబ్బందిని ఇండియన్ కోస్ట్ గార్డ్ బృందం రక్షించగలిగింది. వీరిలో 20 మంది భారతీయులు కాగా, మిగతా ఇద్దరిలో ఒకరు పాక్ జాతీయుడు, మరొకరు శ్రీలంకకు చెందిన వ్యక్తి. పనామా దేశానికి చెందిన ఎంటీ గ్లోబల్ కింగ్ 1, యూఏఈ లోని ఖోర్ ఫక్కస్ నుంచి కర్ణాటక లోని కార్వార్‌కు 6000 టన్నుల బిట్‌మెన్‌ను రవాణా చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గుజరాత్ లోని పోర్‌బందర్ తీరానికి 93 నాటికల్ మైళ్ల దూరంలో ఉన్న ఈ రవాణా నౌక వరద ప్రమాదంలో చిక్కుకుంది. ఆ నౌకలో అనుకోకుండా వరద నీరు అకస్మాత్తుగా ముంచెత్తడంతో నౌక లోని సిబ్బంది బుధవారం ఉదయం 8 గంటల సమయంలో భారత కోస్ట్‌గార్డ్‌కు ప్రమాద హెచ్చరికను అందించారు.
దీంతో తీరంలో ఉన్న భారత్ కోస్ట్ గార్డ్‌కు చెందిన ఐసిజి ఎస్ షూర్, సిజిఒపివి బృందాలు అప్రమత్తమై పోర్‌బందర్ ఐసిజి ఎయిర్ స్టేషన్ నుంచి వెంటనే హెలికాప్టర్ల ద్వారా ఆ నౌక వద్దకు చేరుకున్నాయి. నౌకలో వరద నీటిని నివారించలేకపోయారు. వెంటనే నౌక లోని సిబ్బందికి లైఫ్ బోటు అందించారు. అందులో ఉన్న 22 మంది సిబ్బందిని రక్షించి హెలికాప్టర్ ద్వారా పోర్‌బందర్‌కు చేర్చారు. ఈ రిస్కూకు సంబంధించిన వీడియోను ట్వీట్ చేశారు.