రాజ్యాంగంలో అక్షర రూపంలో ఉన్నదేమి టనేది ఒక కోణమైతే, ఆ గ్రంథంలోని స్ఫూర్తి ఏమిటనేది మరొక కోణం. ఈ రెండింటినీ కలిపి సమగ్రంగా చూసినపుడే అందుకు తగిన అర్ధం వస్తుంది. అంతే ముఖ్యమైనది మరొకటి ఉంది. అది, రాజ్యాంగం చెప్తున్న దానిని, ఆ మేరకు చేసే చట్టాలను అమలు పరచటం. అరకొరగా కాకుండా సమగ్రంగా. అట్లా, రాజ్యాంగపు అక్షర పాఠాన్నీ, స్ఫూర్తినీ అర్థ్ధం చేసుకుని చిత్తశుద్ధితో అమలు చేయ జూసే వారికి మాత్రమే ఆ గ్రంథం గురించి మాట్లాడేందుకు, ఇతరులను విమర్శించేం దుకు నైతికమైన వాక్కు ఉంటుంది. ఈ విషయాలను సాధారణ ప్రజలు వివరంగా మాట్లాడలేకపోవచ్చు. కాని వారి మాటలలో మనకు కనిపించే సారాంశం ఇదే. దేశానికి స్వాతంత్య్రం లభించిన 75 సంవత్సరాలుగా అన్ని పార్టీలను గమనించిన అనుభవం మీద ప్రజలకు కలిగే అభిప్రాయం ఇది.
వివిధ పార్టీల రాజకీయ క్రీడలను చూస్తుంటే విసుగు, నవ్వు, జుగుప్స వంటి భావాలన్నీ ఒకేసారి కలుగుతున్నాయి. ఇటీవల రాజ్యాంగం గురించి, అంబేద్కర్ గురించి అందరూ చాలా చర్చిస్తున్నారు. ఆ బొమ్మలను పట్టుకుని ప్రదర్శనలు చేస్తున్నారు. రాజ్యాంగం పట్ల, అంబేద్కర్ పట్ల తమ నిబద్ధత గురించి గొంతు చించుకుని మాట్లాడుతూ, ఎదుటి వారికి అదే విధమైన నిబద్ధత లేకపోవటంపై అంతే గొంతు చించుకుని విమర్శలు చేస్తున్నారు. కాని ఈ పార్టీలన్నింటిని, అవి అధికారానికి వచ్చినపుడల్లా చూపిన ఆచరణలను గమనిస్తూ వస్తున్న సాధారణ ప్రజల అభిప్రాయమేమిటి?
రాజ్యాంగంలో అక్షర రూపంలో ఉన్నదేమిటనేది ఒక కోణమైతే, ఆ గ్రంథంలోని స్ఫూర్తి ఏమిటనేది మరొక కోణం. ఈ రెండింటినీ కలిపి సమగ్రంగా చూసినపుడే అందుకు తగిన అర్ధం వస్తుంది. అంతే ముఖ్యమైనది మరొకటి ఉంది. అది, రాజ్యాంగం చెప్తున్నదానిని, ఆ మేరకు చేసే చట్టాలను అమలు పరచటం. అరకొరగా కాకుండా సమగ్రంగా. అట్లా, రాజ్యాంగపు అక్షర పాఠాన్నీ, స్ఫూర్తినీ అర్థ్ధం చేసుకుని చిత్తశుద్ధితో అమలు చేయజూసే వారికి మాత్రమే ఆ గ్రంథం గురించి మాట్లాడేందుకు, ఇతరులను విమర్శించేందుకు నైతికమైన వాక్కు ఉంటుంది. ఈ విషయాలను సాధారణ ప్రజలు వివరంగా మాట్లాడలేకపోవచ్చు. కాని వారి మాటలలో మనకు కనిపించే సారాంశం ఇదే. దేశానికి స్వాతంత్య్రం లభించిన 75 సంవత్సరాలుగా అన్ని పార్టీలను గమనించిన అనుభవం మీద ప్రజలకు కలిగే అభిప్రాయం ఇది.
అంబేద్కర్ విషయం కూడా సరిగా ఇంతే. రాజ్యాంగం రూపంలో గాని, ఇతరత్రా గాని ఆయన రాసింది, మాట్లాడింది, ఉద్యమించింది ఏమిటి? రాజ్యాంగం ఆచరణ, తన ఉద్యమాలకు గల కారణాలు, ఆ పరిస్థితుల నుంచి విమోచన మార్గాల గురించి వ్యక్తపరచిన ఆలోచనలు ఏవిధంగా ఉన్నాయి? వీటన్నింటికి సంబంధించి తన జీవితకాలంలో, ఆ తర్వాత ఇన్నిన్ని దశాబ్దాలలో అన్నింటికి అన్ని పార్టీలూ మాట్లాడిందేమిటి, ఆచరించిందేమిటి? ఆ విధంగా, ఒకవైపు రాజ్యాంగ సంబంధమైన కొలమానాలను, మరొక వైపు అంబేద్కర్ సంబంధమైన కొలమానాలను తీసుకుని చూసినట్లయితే, ఇటీవలి రోజులలో రాజ్యాంగం గురించి, అంబేద్కర్ గురించి మొదటి అన్నట్లు విసుగు, నవ్వు, జుగుప్స కలిగించే విధంగా వ్యవహరిస్తున్న మన పార్టీల విషయమైన సాధారణ ప్రజలు ఏమనాలి?
ఇంకొంత విస్తృతంగా చూసినట్లయితే మనకు ఎదురయే ముఖ్యమైన కొలమానం మరొకటి ఉంది. అది మౌలిక ప్రజాస్వామికత, దాని విధివిధానాలు, ఆచరణ. వాస్తవానికి రాజ్యాంగం, అంబేద్కర్ అనే రెండు అంశాలు కూడా ప్రజాస్వామ్యం అనే మౌలికతలోకి ఒదిగి వచ్చేవే. వలస పాలనకు వ్యతిరేకంగా, అంతకన్నా ముందు నుంచి ఉండిన భూస్వామ్య, రాచరిక వ్యవస్థలకు వ్యతిరేకంగా ఈ సువిశాల దేశపు ప్రజానీకం లెక్కలేనన్ని త్యాగాలతో పోరాడుతూ వచ్చిందంతా, అంతిమార్థంలో ప్రజాస్వామికత కోసమే. వ్యవస్థాపరంగా, ఆర్థికంగా, రాజకీయంగా, సాంస్కృతికంగా, సామాజికంగా ప్రజాస్వామికత కోసమే. ఈ పరిస్థితులు, ఆకాంక్షలన్నీ సుదీర్ఘ స్వాతంత్య్రోద్యమంలో ప్రతిఫలించాయి. వీటన్నింటిని నుంచి ఉద్భవించి రూపదిద్దుకున్నదే భారత రాజ్యాంగం. అంబేద్కర్ కూడా వీటికి ప్రతిఫలనమే. అటువంటి స్థితిలో, వివిధ పార్టీలు ఈ రోజున రాజ్యాంగం గురించి, అంబేద్కర్ గురించి ఏమి మాట్లాడుతున్నా ఈ 75 సంవత్సరాల సుదీర్ఘ కాలంలో ఎవరి ఆచరణలు ఏమిటి? వీరందరూ భాగస్వాములే అయిన మన రాజకీయ వ్యవస్థ ఆచరించింది ఏమిటన్నది మాత్రమే గీటురాళ్లు అవుతాయి.
ప్రస్తుతం అంబేద్కర్‌ను పురస్కరించుకుని కాంగ్రెస్, బిజెపి, వామపక్షాలు పలు ప్రాంతీయ పార్టీలు, కొన్ని దళిత సంఘాలు చాలా మాట్లాడుతున్నాయి. అదే విధంగా రాజ్యాంగం గురించి కూడా. ఇటీవలి లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ అదే చూశాం. కాంగ్రెస్ అయితే కొన్నిసార్లు రాజ్యాంగం ప్రతులను, కొన్నిసార్లు అంబేద్కర్ చిత్రపటాన్ని పట్టుకుని ప్రదర్శనలు జరిపింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా సభలో ఒక చర్చ సందర్భంగా అంబేద్కర్ గురించి కాకపోయినా ఆయన పేరును ప్రస్తావిస్తూ చేసిన వ్యాఖ్యలతో వాతావరణం మళ్లీ వేడెక్కింది. అందుకు నిరసనగా ప్రతిపక్షాల ఆందోళనలు మొదలయ్యాయి. ఇదంతా మనం ఎప్పుడూ చూస్తుండే షరా మామూలు రాజకీయమే తప్ప అందులో ఎవరికీ చిత్తశుద్ధి లేదన్నది అట్లుంచితే, ఇంతకూ పైన చెప్పుకున్న ఆచరణ సంబంధితమైన మూడు గీటురాళ్ల విషయంలో ఎవరి రికార్డు ఏమిటి? రాజ్యాంగపు గీటు రాయి, అంబేద్కర్ గీటురాయి, ప్రజాస్వామికత గీటురాయి అన్నవి పరస్పరం విభజించటానికి వీలులేని ఒక సమీకృతమైన, సమగ్రమైన గీటురాయి అవుతాయి. ఈ కొలమానం నుంచి కమ్యూనిస్టులకు సైతం మినహాయింపు లేదన్నది గుర్తించాలి.
ఇంతకూ ఎవరి రికార్డు ఏమిటి? ఈ ప్రశ్నకు జవాబుగా ఒక చిత్రమైన స్థితి కనిపిస్తుంది. అధికార, ప్రతిపక్షాలకు మధ్య ప్రతి పోటాపోటీ అంశంలోవలెనే ఈసారి కూడా. అందరూ ఎదుటి వారి లోపాల రికార్టును ఏకరవుపెట్టి, తమ లోపాలను దాచిపెడతారు. ఎదుటి వారి మంచి ఏమైనా ఉంటే మరుగుపరచి తమ అతి చిన్న మంచిని కూడా ఆకాశానికెత్తి చూపుతారు. ఎవరు కూడా తమ మంచిచెడులు రెండింటినీ ప్రజల ఎదుట నిజాయితీగా ఉంచే శ్వేత పత్రాలను ప్రకటించరు. అటువంటి పరిస్థితిలో ప్రజలు ఇరువురు చెప్పేవీ పరిశీలించినట్లయితే అపుడొక శ్వేతపత్రం తయారవుతుంది.
అందరికి సంబంధించి, అన్నింటికి సంబంధించి అసలు నిజాలేమిటో ప్రజలకు అనుభవపూర్వకంగా తెలుసు గనుక, సదరు శ్వేతపత్రానికి వారు తగు సవరణలతో తుది రూపం ఇవ్వగలరు. ఆ విధంగా తేలగలది, ఈ చివరి నుంచి ఆ చివరి వరకు అందరూ ఉల్లంఘనల ఘనులే అని. వారి ఆతురత అంతా, ఇప్పటికే పలువురు విజ్ఞులు గుర్తించినట్లు, ఓట్ల రాజకీయం మాత్రమే. ఇందుకు నిష్కృతి ఏమిటన్నది ప్రశ్న. ఇది ఇక్కడ కొత్తగా వేసుకుంటున్న ప్రశ్నేమీ కాదు. ప్రశ్నలు వేసి సమాధానాలు కూడా చెప్పిన విజ్ఞులు అనేకులు గతం నుంచీ ఉన్నారు. రెండు మాటలలో గుర్తు చేసుకోవాలంటే, ప్రజలు చైతన్యవంతులై రాజకీయ పార్టీలపై ఒత్తిడిని తీవ్రతరం చేస్తూ అవి మారేట్లు చేయటం. లేదా తమ ప్రత్యామ్నాయాలను తాము నిర్మించుకుని రాజ్యాంగాన్ని, అంబేద్కర్‌ను, ప్రజాస్వామ్యాన్ని తమ అధీనంలోకి తెచ్చుకోవటం.
టంకశాల అశోక్
దూరదృష్టి