భిన్నత్వంలో ఏకత్వ సూత్రాన్ని అనుసరిస్తున్న అఖండ భారత దేశంలోని కోట్లాది ప్రజల పరిపాలన ప్రజాహిత గ్రంథం భారత రాజ్యాంగం. చారిత్రకంగా మానవ నిర్మిత అడ్డుగోడలై కుల, మత, లింగ, భాష , ప్రాంతం భేదాలను కూకటివేళ్లతో పెకలించి స్వేచ్ఛా, సమానత్వం, సోదర భావం అనే గొప్ప విలువలను ప్రసాదించిన అత్యున్నత గ్రంథం. ఈ మహోన్నతమైన గ్రంథ రూపశిల్పి, ప్రపంచ మేధావిగా పిలవబడుతున్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్. ఈయన దళితుల జాతిలో పుట్టిన ఆత్మగౌరవ ముద్దుబిడ్డ. తన మేధస్సుతో నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ కూల్చివేయడానికి సామాజిక పోరాటాలు చేశారు. సమానత్వ సాధనకు కృషి చేశారు. మడమతిప్పని యోధుడుగా 1946లో భారత రాజ్యాంగ రచన కమిటీ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు.
దాదాపు 60 దేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేసి అతిపెద్ద భారతదేశానికి రాజ్యాంగాన్ని రాశారు. పటిష్టమైన వ్యవస్థల సమాహారంతో అక్షరరూపం దాల్చిన ఈ గ్రంథం ద్వారా అట్టడుగు వర్గాల బానిస సంకెళ్లను నుంచి విముక్తి కల్పించారు. ఓటు హక్కు అనే ఆయుధం ద్వారా రాజ్యంలో పౌరులందరిని భాగస్వామ్యం చేశారు.ఇందులోని ప్రాథమిక హక్కులు, ఆదేశ సూత్రాలు పౌరుల సర్వతోముఖాభివృద్ధికి దోహదపడే అతిముఖ్యమైనవి. భారత రాజ్యాంగాన్ని 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల కాల వ్యవధిలో పూర్తి చేయడం జరిగినది. సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా నవంబర్ 26,1949 ఆమోదించబడింది. ఈ రోజునే ప్రతి యేటా భారత రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది. రాజ్యాంగం 1950 జనవరి 26న అమల్లోకి రావడం జరిగింది. ఇది దేశ ప్రజానీకానికి స్వాతంత్య్రం సిద్ధించిన రోజని చెప్పవచ్చు. కానీ ఇది ఏ మేరకు సఫలీకృతమైందనేది ప్రశ్నార్ధకమే.
ప్రజాస్వామ్య భారతంలో పార్లమెంట్‌తో సహా రాష్ట్ర శాసనసభలు ప్రజల సంక్షేమానికి ప్రజల హక్కుల సంరక్షణకు ఎన్నో చారిత్రక చట్టాలను రూపొందించాయి. అయినప్పటికీ ఇది నాణెనికి ఒక వైపు మాత్రమే. మరోవైపు రాజ్యాంగ హక్కులు ఉల్లంఘినకు గురికావడంతో సామాన్య ప్రజల జీవితాలలో మార్పులు అంతంత మాత్రమే జరిగాయి. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి 70 వసంతాలు పూర్తయినప్పటికీ నేటికీ ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనార్టీ వర్గాల ప్రజలు సామాజిక, ఆర్థిక, రాజకీయ సాధికారతకు దూరం కావడం విచారకరం. అంతేకాకుండా రాజ్యాంగంపై అనేక రూపాల్లో దాడులు కొనసాగుతున్నాయి. సామాన్య ప్రజల హక్కులు హరించుకుపోతున్నాయి. రాజ్యాంగం అనే రక్షణ వలయం ఉల్లంఘనకు గురువుతుంది. ఆడవాళ్లపై హత్యలు, అత్యాచారాలు, దళితుల పట్ల వివక్ష, ఊరు వెలివేత లాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అధికార వర్గం ప్రభుత్వాల కనుసన్నల్లో నడుస్తుంది.
రాజ్యాంగంలో పేర్కొనబడిన సంక్షేమ రాజ్య స్థాపన అనేది రోజురోజుకు కనుమరుగవుతుంది. ప్రభుత్వాల పరిపాలన కార్పొరేట్ కబంధ హస్తాల కింద నడిపిస్తుంది. సామాన్య ప్రజలు తమ హక్కుల రక్షణ కోసం రోడ్లు ఎక్కాల్సిన పరిస్థితి చోటు చేసుకుంటుంది. రాజకీయాలలో ఓటుకు నోటు పేరుతో రాజకీయ నేతలు ప్రజలను ప్రలోభపెడుతున్నారు. తద్వారా గెలిచిన ప్రజాప్రతినిధులు ప్రజల సంక్షేమంపై దృషి సారించడం లేదు. కుల, మత రాజకీయాలతో యువతను బలి చేస్తున్నారు. ఉద్యోగ అవకాశాలు లేక వీరంతా పక్కదారి పడుతున్నారు. ప్రశ్నించే వ్యక్తులపై దేశ ద్రోహులుగా ముద్ర వేస్తున్నారు. ప్రజల కోసం ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధులు చట్టసభల్లో ప్రజల సమస్యలు ప్రస్తావించడం లేదు. వ్యక్తిగత దూషణలతో సభా కాలాన్ని వృథా చేయడం జరుగుతున్నది.
ప్రజా వ్యతిరేక చట్టాలను రూపొందించడం ప్రభుత్వాల పరిపాటిగా మారింది. తీర ప్రజలు న్యాయం కోసం రోడ్ల మీద దీక్షలు, ధర్నాలు చేయడంతో వాటిని ప్రభుత్వాలు వెనక్కి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రైతులకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు చట్టాలను ఉపసంహరణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల చట్టాన్ని వెనక్కి తీసుకోవడమే దీనికి ఉదాహరణ. మరోవైపు కరోనా కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ప్రజాస్వామ్యం పెనుముప్పు ఎదుర్కొంటున్నదని తాజాగా 34 దేశాలతో కూడిన ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ డెమోక్రసీ అండ్ ఎలక్టోరల్ అసిస్టెన్స్(ఐడిఇఎ) సంస్థ నివేదికను విడుదల చేసింది. ముఖ్యంగా కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకట్ట వేసే క్రమంలో పలు దేశాల ప్రభుత్వాలు అప్రజాస్వామిక చర్యలకు ఉపక్రమిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.
అత్యధిక కాలం లాక్ డౌన్ లో ఉన్న భారత్‌లో పరిస్థితి పైనా అందులో ఆందోళన వ్యక్తం చేసింది. నిరంకుశత్వం, అణచివేత పెరిగిపోవడంతో ప్రజాస్వామ్యానికి ఆదరణ తగ్గుతున్న దేశాల సంఖ్య గత దశాబ్ద కాలంలో రెట్టింపుయిందని పేర్కొంది. అంతేకాకుండా కొన్ని దేశాలలో ప్రజాస్వామ్య అనుకూల ఉద్యమాలు అణచివేతకు గురయ్యాయి. ఇప్పటికైనా ప్రభుత్వాలు చిత్తశుద్ధితో రాజ్యాంగ ఫలాలు ప్రతి ఒక్కరికీ చేరే విధంగా కృషి చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా భారత్ లో ఎన్నికల విధానంలో మార్పులు తీసుకురావాలి. ధన రాజకీయాలకు స్వస్తి పలకాలి. లౌకిక భావాలకు బీజం వేయాలి. చట్టసభలు రూపొందించే చట్టాలు సామాన్య ప్రజల ఉన్నతికి దోహదపడే విధంగా ఉండాలి. యువతకు సరైన మార్గనిర్దేశం చేసి దేశాభివృద్ధిలో భాగస్వామ్యం చేయాలి. మహిళలకు సమాన అవకాశాలు కల్పించాలి. ఇది విద్య, ఉద్యోగ అవకాశాల కల్పనతోనే సాధ్యమవుతుంది. విద్య, వైద్యానికి బడ్జెట్‌లో అధిక నిధులు కేటాయించాలి. అప్పుడే ప్రజాస్వామ్య స్ఫూర్తి కొనసాగుతుంది.
Indian Constitution law approval on this day Nov 26th