డాలర్‌తో పోలిస్తే చారిత్రాత్మక పతనం
79.60 వద్ద భారతీయ కరెన్సీ
న్యూఢిల్లీ : అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజు రోజుకీ క్షీణిస్తూనే ఉంది. మంగళవారం కూడా కరెన్సీ మార్కెట్‌లో రూపాయి చారిత్రాత్మక పతనంతో ముగిసింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి 12 పైసలు పడిపోయింది. దీంతో తొలిసారిగా భారతీయ కరెన్సీ రూ.79.60 వద్ద ముగిసింది. విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు కొనసాగుతూనే ఉండడంతో రూపాయి భారీగా పడిపోయింది. మంగళవారం ఉదయం రూపాయి రూ.79.51 వద్ద ప్రారంభమైంది. ఓ దశలో రూ.79.66 స్థాయికి పడిపోయింది. కానీ కరెన్సీ మార్కెట్ ముగిసే సమయానికి రూ.79.60 వద్ద ముగిసింది. సోమవారం రూపాయి రికార్డు స్థాయి కనిష్టం 79.48 వద్ద ముగిసింది. విదేశీ ఇన్వెస్టర్లు భారత మార్కెట్లలో నిరంతరం విక్రయాలు జరుపుతున్నారు. 2022 ఫిబ్రవరి 23న రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం ప్రారంభం కావడానికి ముందు డాలర్‌తో పోలిస్తే రూపాయి 74.62 వద్ద ఉంది. ఇప్పుడు 80కి చేరువ అవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 80 రూపాయల స్థాయి కంటే దిగువకు పడిపోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. అమెరికా ఫెడ్ రిజర్వ్ జూలైలో మళ్లీ వడ్డీ రేట్లను పెంచే అవకాశముంది. ఈ భయం కారణంగా విదేశీ పెట్టుబడిదారులు భారతీయ మార్కెట్లో అమ్మకాలు జరుపుతూనే ఉన్నారు. సోమవారం విదేశీ ఇన్వెస్టర్లు రూ.170 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు.