79.48కి పడిపోయిన భారతీయ కరెన్సీ
న్యూఢిల్లీ : అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ మళ్లీ చారిత్రాత్మక పతనంతో ముగిసింది. సోమవారం భారతీయ కరెన్సీ విలువ 22 పైసలు క్షీణించింది. దీంతో రూపాయి అత్యంత కనిష్ట స్థాయి 79.48కి పడిపోయింది. విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాలు కొనసాగించడంతో రూపాయి విలువ భారీగా పతనమైంది. సోమవారం రూపాయి ఉదయం రూ.79.30 వద్ద ప్రారంభమైంది. ట్రేడింగ్‌లో రూ.79.49 స్థాయికి పడిపోయింది. కానీ కరెన్సీ మార్కెట్ ముగిసే సమయానికి రూ.79.48 వద్ద ముగిసింది. విదేశీ ఇన్వెస్టర్లు భారత మార్కెట్లలో నిరంతరం విక్రయాలు జరుపుతున్నారు. జూలై నెలలో ఇప్పటి వరకు రూ.4,000 కోట్లను ఇన్వెస్టర్లు ఉపసంహరించుకోగా, శుక్రవారం రూ.109 కోట్లకు విక్రయించారు. అయితే మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం, ముడి చమురు ధరలలో తగ్గుదల లేకుంటే రూపాయి విలువ మరింత పడిపోయే అవకాశం ఉంది. ఫిబ్రవరి 23 రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం ప్రారంభమయ్యే ముందు డాలర్‌తో రూపాయి 74.62 వద్ద ఉంది. అయితే త్వరలో రూపాయి విలువ 80 రూపాయల స్థాయి కంటే దిగువకు పడిపోవచ్చని నిపుణులు భావిస్తున్నారు.
స్వల్ప నష్టాలు
దేశీయ ఈక్విటీ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. దీంతో మూడు రోజుల వరుస లాభాలకు బ్రేక్ పడింది. ప్రారంభంలో భారీ నష్టాలతో ప్రారంభమైన మార్కెట్లు ఆఖరి సమయంలో కోలుకుని కొంత పుంజుకున్నాయి. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 86 పాయింట్లు కోల్పోయి 54,395 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 4 పాయింట్లు కోల్పోయి 16,216 పాయింట్ల వద్ద స్థిరపడింది.