Monday, December 23, 2024

ఆల్‌టైమ్ కనిష్టానికి రూపాయి

- Advertisement -
- Advertisement -

Indian currency fell to 80.47 against the dollar

డాలర్‌తో పోలిస్తే 80.47 కి పడిపోయిన కరెన్సీ
ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు ప్రభావం

న్యూఢిల్లీ: ఆమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి భారీగా పతనమైంది. గురువారం రూపాయి 51 పైసలు నష్టపోయి జీవితకాల కనిష్ట స్థాయి రూ.80.47కి పడిపోయింది. ఓ దశలో 8.50 పైసలు దాటింది. ఈ ఏడాది ఫిబ్రవరి 24 తర్వాత ఇంతలా పతనం కావడం ఇదే. అంతకుముందు డాలర్‌తో పోలిస్తే 79.97 వద్ద ముగిసింది. అమెరికా ఫెడరల్ రిజర్వు బుధవారం వడ్డీ రేట్లను పెంచడంతో దేశీయ కరెన్సీపై ప్రబావం పడింది.

ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ వడ్డీ రేట్లను 0.75 శాతం పెంచారు. దీంతో వడ్డీ రేట్లు 3- 3.25 శాతం వరకు పెరిగాయి. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు వరుసగా మూడోసారి వడ్డీరేట్లను పెంచారు. అమెరికాలో వడ్డీ రేట్లు పెరగడం వల్ల అక్కడి కరెన్సీ అంటే డాలర్ విలువ పెరుగుతోంది. డాలర్ మరింత బలపడటం వల్ల డాలర్‌తో పోలిస్తే రూపాయి వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల కరెన్సీల విలువ తగ్గుతోంది. రానున్న రోజుల్లో భారత్ నుంచి విదేశీ పెట్టుబడిదారులు నిధులను ఉపసంహరించుకుంటే రూపాయి ఇంకా బలహీనపడే అవకాశముంది.

81.50 స్థాయికి పడిపోవచ్చు

డాలర్‌తో పోలిస్తే రూపాయి అత్యధిక పతనాన్ని చవిచూసింది. అమెరికా డాలర్ ఇండెక్స్ రెండు దశాబ్దాల గరిష్ట స్థాయి 111.72కి చేరుకుంది. డాలర్‌తో రూపాయి 81 లేదా 81.50 స్థాయికి వెళ్లవచ్చని నిపుణుల అభిప్రాయపడుతున్నారు. డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి పతనాన్ని ఆపడానికి ఆర్‌బిఐ(రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) డాలర్లను విక్రయిస్తోంది. గ్లోబల్ మార్కెట్ పరిస్థితుల ఆధారంగా చూస్తే రూపాయి పతనంపై ప్రభుత్వం పెద్దగా ఆందోళన చెందడం లేదని ప్రభుత్వ అధికారి తెలిపినట్టు వార్తా సంస్థ రాయిటర్స్ పేర్కొంది. రూపాయి పతనాన్ని అరికట్టేందుకు ఆర్‌బిఐ పెద్దగా దూకుడు ప్రదర్శించకపోవచ్చని కొందరు వ్యాపారులు అంటున్నారు. ఫెడరల్ రిజర్వ్ పాలసీ రేట్లను 75 బేసిస్ పాయింట్లు పెంచిన తర్వాత గురువారం ట్రేడింగ్ సెషన్‌లో రూపాయి ఒత్తిడిలో ఉంది. రాబోయే కొద్ది సెషన్లలో డాలర్‌తో రూపాయి మారకం విలువ క్రమంగా 81కి చేరుకుంటుందని సింగపూర్‌కు చెందిన ప్రైవేట్ వెల్త్ మేనేజ్‌మెంట్ ప్లాట్‌ఫామ్ క్రిస్టల్.ఐ ఫైనాన్షియల్ ప్రొడక్ట్ హెడ్ గౌతమ్ కుమార్ చెప్పినట్లు రాయిటర్స్ పేర్కొంది. మధ్యకాలానికి డాలర్‌తో రూపాయి మారకం విలువ 80-82 స్థాయిలోనే ఉంటుందని ఆయన అన్నరు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News