న్యూఢిల్లీ: తమ దేశ ఎన్నికల్లో భారత్ జోక్యం చేసుకుంటోందన్న కెనడా ఆరోపణలను భారత్ తిప్పి కొట్టింది. ఈ ఆరోపణలపై భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ గురువారం స్పందిస్తూ ఇతర దేశాల ప్రజాస్వామ్య ప్రక్రియల్లో జోక్యం చేసుకోవడం భారత ప్రభుత్వ విధానం కాదని మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు. దీనికి విరుద్ధంగా కెనడాయే భారత అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటోందని ధ్వజమెత్తారు. కెనడా సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ సర్వీస్ (సిఎస్‌ఐఎస్) ఈమేరకు తయారు చేసిన డాక్యుమెంట్‌ను గ్లోబల్ న్యూస్ ఇటీవలనే ఉదహరించింది. ఇందులో విదేశీ కార్యకలాపాల్లో భారత్ జోక్యం అని పేర్కొంది.
దీనిపై వారం వారీ పత్రికా సమీక్షలో రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ విదేశీ జోక్యంపై కెనడా కమిషన్ దర్యాప్తు చేస్తోందన్న మీడియా కథనాలను తాము గమనించామని, ఇలాంటి నిరాధార ఆరోపణలను తాము గట్టిగా వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. కెనడా అధికార వర్గానికి దీనిపై తమ ఆందోళన తెలియజేశామని, ఇవి సమర్థంగా పరిష్కరించాలని పిలుపు నిచ్చినట్టు చెప్పారు. భారత్, కెనడా దేశాల మధ్య గత కొన్నాళ్లుగా వివిధ అంశాలపై ఉద్రిక్తతలు చెలరేగుతున్న సమయంలో భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ నుంచి ఈ ప్రకటన రావడం గమనార్హం.