కేంద్రమంత్రి పీయూష్ గోయల్
తిరుప్పూర్ (తమిళనాడు) : వచ్చే 30 ఏళ్లలో భారతీయ ఆర్థిక వ్యవస్థ 30 ట్రిలియన్ డాలర్లు (రూ.2,347 లక్షల కోట్ల)కు చేరనుందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధిని సాధిస్తున్న దేశాల్లో భారతదేశం ఒకటి అని అన్నారు. కోయంబత్తూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, భారత్ ప్రతి ఏడాది 8 శాతం వృద్ధి రేటుతో వెళ్లినట్లయితే, 9 సంవత్సరాల్లో జిడిపి(స్థూల దేశీయోత్పత్తి) రెట్టింపు అవుతుందని ఆయన వివరించారు. భారతీయ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం 3.2 ట్రిలియన్ డాలర్ల (రూ.250.40 లక్షల కోట్లు) ఉంది, ఇప్పటి నుంచి తొమ్మిది సంవత్సరాల్లో ఇది 6.5 (రూ.508 లక్షల కోట్ల)కు చేరుతుంది. మరో 9 సంవత్సరాల తర్వాత అంటే ఇప్పటి నుంచి 18 సంవత్సరాల తర్వాత ప్రజలు 13 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను చూస్తారు. ఆ తర్వాత తొమ్మిది సంవత్సరాలకు అంటే 27 సంవత్సరాల తర్వాత 26 ట్రిలియన్ డాలర్లు అవుతుంది. అంటే ఇప్పటి నుంచి సుమారుగా 30 సంవత్సరాల్లో భారతీయ ఆర్థిక వ్యవస్థ 30 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని మంత్రి వివరించారు.