కోల్‌కతా: భారత ఆర్థిక వ్యవస్థ 2024- 2031 ఆర్థిక సంవత్సరాల మధ్య ఏడాదికి సగటున 6.7 శాతం వృద్ధిని నమోదు చేస్తుందని ‘క్రిసిల్’తన తాజా నివేదికలో పేర్కొంది. కొవిడ్ మహమ్మారికి ముందు సగటు వృద్ధి 6.6 శాతం కన్నా ఇది ఎక్కువే కావడం గమనార్హం. రాష్ట్రాలు తమ సొంత పెట్టుబడి ప్రయత్నాలను ప్రోత్సహించేందుకు వడ్డీరహిత రుణాలను అందించేందుకు కేంద్రం మూలధన వ్యయాన్ని గణనీయంగా పెంచిందని పేర్కొంది.ఈ ఆర్థిక సంవత్సరంలో 7.3 శాతం వృద్ధి సాధించిన తర్వాత ఆర్థిక వ్యవస్థ వచ్చే ఆర్థిక సంవత్సరంలో 6.4 శాతానికి పరిమితం కావచ్చని కూడా క్రిసిల్ అంచనా వేసింది.
కాగా పెట్రోలియం ఉత్పత్తులపై మధ్యప్రాచ్య ఘర్షణ ప్రభావాన్ని, రవాణా ఖర్చుల పెరుగుదల లాంటి వాటిని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాల్సిన అవసరం ఉందని కూడా ఆ నివేదిక పేర్కొంది. కాగా గత ఏడాది డిసెంబర్‌లో ద్రవ్యోల్బణం 5.7 శాతం స్థాయికి చేరుకోవడానికి కారణం కూరగాయలు, ఇతర ఆహార పదార్థాల ధరలు పెరగడమే ప్రధాన కారణమని క్రిసిల్ అభిప్రాయపడింది. కాగా అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఈ ఏడాది వడ్డీ రేట్లలో కోత విధించే అవకాశం ఉందని కూడా క్రిసిల్ పేర్కొంది. అయితే అది ఎప్పుడు, ఎంతమేరకు ఉంటుందనే దానిపై కొన్ని అనుమానాలున్నాయని తెలిపింది.