భారత విద్యార్థులకు ఎంబసీ తాజా హెచ్చరిక
కీవ్: రష్యాఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమవుతున్న వేళ భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. ఉక్రెయిన్‌లోని భారత విద్యార్థులు ఆన్‌లైన్ క్లాసులకోసం ఎదురు చూడకుండా తక్షణమే ఆ దేశాన్ని వీడాలని సూచించింది. మేరకు ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లోని భారత ఎంబసీ మంగళవారం అడ్వైజరీ జారీ చేసింది.‘ మెడికల్ యూనివర్సిటీల్లో ఆన్‌లైన్‌క్లాసుల గురించి తెలుసుకోవడానికి భారత రాయబార కార్యాలయానికి పెద్ద సంఖ్యలో ఫోన్లు వస్తున్నాయి. అయితే భారత విద్యార్థులు తమ విద్యాప్రక్రియను కొనసాగించడానికి వీలుగా ఆన్‌లైన్ క్లాసుల ఏర్పాటుకు సంబంధిత అధికారులతో చర్చలు కొనసాగుతున్నాయి. క్లాసుల విషయంలో యూనివర్సిటీలనుంచి అధికారిక ధ్రువీకరణ కోసం ఎదురు చూడకండి. మీ భద్రత దృష్టా తక్షణమే దేశాన్ని వీడాలని సూచిస్తున్నాం’ అని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. ఉక్రెయిన్ పరిణామాల నేపథ్యంలో భారత రాయబార కార్యాలయం ఇటీవల జారీ చేసిన మూడో అడ్వైజరీ ఇది. ఇటీవల అత్యవసరమైతే తప్ప ఉక్రెయిన్‌లో ఉండవద్దని హెచ్చరించిన ఎంబసీ తాజాగా విద్యార్థులంతా దేశాన్ని వదిలి వెళ్లాలని సూచించడం గమనార్హం. మరో వైపు రష్యాఉక్రెయిన్ ఉద్రికతలపై అత్యవసరంగా సమావేశమైన భద్రతా మండలిలో సైతం భారత్ మంగళవారం తాజాగా అక్కడ నెలకొన్న ఉద్రిక్తతలపై ఆందోళన వ్యక్తం చేసింది.