అవార్డును స్వీకరించిన రవాణా శాఖ కమిషనర్ ఎం.ఆర్.ఎం.రావు
మన తెలంగాణ/హైదరాబాద్ : దరఖాస్తుదారులకు అందించే సేవల్లో పారదర్శకంగా వ్యవహరించడం జరుగుతుందని, కాంటాక్ట్, క్యాస్‌లెస్ విధానం ద్వారా ఆర్టీఏ కార్యాలయాలకు రాకుండా కొన్ని సేవలు ఏ టైం, ఏ రోజు అయినా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుని పొందడానికి వినియోగదారులకు మరింత సౌలభ్యం కల్పించినట్లు రవాణా శాఖ కమిషనర్ ఎం.ఆర్.ఎం.రావు చెప్పారు. రవాణా శాఖలో ఎనీ వేర్, ఎనీ టైం సేవలకు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ సంస్థ ఎక్సలెన్సీ పురస్కారాన్ని అందించింది. బుధవారం జరిగిన డిజిటల్ టెక్నాలజీ సభలో ఈ అవార్డును కమిషనర్ తన కార్యాలయంలో ఆన్‌లైన్ ద్వారా స్వీకరించారు. వినియోగదారులు, దరఖాస్తుదారుల సౌలభ్యం కోసం సాంకేతిక మేథాతో రెన్యువల్, డుప్లికేట్ లైసెన్సులు, అడ్రస్‌మార్పిడి, బ్యాడ్జ్, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్స్ తదితర వాటిని ఆన్‌లైన్ ద్వారా రవాణా శాఖ అందుబాటులోకి తెచ్చి ఆ సేవల్ని అందిస్తోంది.
ఈ మేరకు పురస్కారాన్ని అందుకున్న కమిషనర్ రవాణా కార్యాలయాలకు రాకుండానే దరఖాస్తుదారులు నేరుగా 17 పౌర సేవల్ని పొందే విధంగా ఆన్‌లైన్ సౌకర్యాన్ని మెరుగుపరిచిన విషయాన్ని గుర్తు చేస్తూ మిగతా సేవల్ని కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలిపారు. నియమ, నిబంధనలను అనుసరిస్తూ వాహనదారులు ఎప్పుడైనా ఎక్కడి నుంచి అయినా కంప్యూటర్ లేదా స్మార్ట్ ఫోన్‌లో వెబ్‌సైట్ ద్వారా కూడా ఈ సేవలను పొందవచ్చన్నారు. ఆన్‌లైన్ ద్వారా ఆయా సేవలకు సంబంధించిన ఫీజులు చెల్లించి, సరిపడా డాక్యుమెంట్స్ సమర్పిస్తే చాలని, దరఖాస్తుదారులు ఇతరులను ఆశ్రయించాల్సిన అవసరం ఉండదన్నారు.
వినియోగదారుల సౌలభ్యం కోసం అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ సేవల్ని మరింత మెరుగుపర్చినట్లు చెప్పారు. గంటల తరబడి క్యూలో నిలబడాల్సిన అవసరం లేకుండా నేరుగా ఎప్పుడైనా, ఎక్కడ నుంచైనా ఆన్‌లైన్‌లో ఎంపిక చేసిన సేవలను పొందేలా తగిన చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఎనీ వేర్‌ఎనీ టైం సేవలను వినియోగదారులు, వాహనదారులు ఎక్కువగా వినియోగించుకోవాలని, రవాణా శాఖలో వస్తున్న సంస్కరణలకు అనుగుణంగా ప్రజలు సేవలను పొందాలని కమిషనర్ కోరారు.