న్యూయార్క్ : అమెరికా లోని కాలిఫోర్నియా శాన్ మాటెయోలో ఓ భారతీయ కుటుంబం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అలమెడ లాస్ పులగాస్ అనే ప్రాంతం లోని బ్లాక్ నంబర్ 4100 లో ఈ సంఘటన చోటు చేసుకుంది. మృతులు కేరళకు చెందిన ఆనంద్ సుజాత్ హెన్నీ(42), భార్య అలియస్ బెంజిగర్ (40), నాలుగేళ్ల వయసున్న ఇద్దరు పిల్లలుగా గుర్తించారు. కుటుంబ కలహాలే ఈ మరణాలకు కారణం కావచ్చని అనుమానిస్తున్నారు.
వెల్ఫేర్ చెక్ సమయంలో ఈ ఇంటి నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. ఆ ఇంటి తలుపులు అన్నీ మూసే ఉన్నా ఒక కిటికీ మాత్రం తెరిచి ఉండటంతో అధికారులు అందులో నుంచి లోపలకు ప్రవేశించ గలిగారు. బాత్‌రూమ్‌లో ఈ దంపతుల మృతదేహాలు కనిపించాయి. వీరి శరీరంపై తుపాకీ కాల్పుల గాయాలున్నాయి. సమీపంలో ఒక 9 ఎంఎం తుపాకీ , తూటాలను స్వాధీనం చేసుకున్నారు. ఇంటి పడక గదిలో ఇద్దరు బాలుర మృతదేహాలను కనుగొన్నారు. వారిపై ఎలాంటి గాయాలు లేవు.
దీంతో ఆ చిన్నారులపై విషప్రయోగం చేసి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. కోర్టు రికార్డుల ప్రకారం ఆనంద్ సుజాత్ 2016లో విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేశారు. కానీ ప్రొసీడింగ్స్ పూర్తి కాలేదు. గతంలో ఇదే ఇంటి నుంచి పోలీస్‌లకు ఫోన్‌కాల్ వెళ్లింది. దానికి కారణమేమిటో మాత్రం అధికారులు వెల్లడించలేదు. ఈ నేపథ్యంలో వీరి మరణాలకు కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఆనంద్ సుజాత్ హెన్రీ తొమ్మిదేళ్ల నుంచి అమెరికాలో ఉంటున్నారు. మెటా, గూగుల్ వంటి ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో పనిచేశారు. మెటాలో రాజీనామా చేశాక, లాగిట్స్ అనే కృత్రిమ మేథ కంపెనీని సొంతంగా ప్రారంభించారు. కొన్నాళ్ల క్రితం ఈయన 2.1 మిలియన్ డాలర్ల విలువైన ఇంటిని కొనుగోలు చేశారు.