ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు సాగిస్తున్న పోరాటం ముందు ప్రధాని మోడీ ప్రభుత్వం ప్రతిష్ఠ రోజురోజుకీ పలచబడిపోతున్నది. రైతుల దీక్ష దేదీప్యమానంగా వెలుగుతూ, ప్రభుత్వం మొండితనం వల్ల దాని పరువు నీరుగారిపోతున్నదనడం ఉన్నాయనడం అతిశయోక్తి కాదు. కేంద్రం తీసుకు వచ్చిన మూడు కొత్త వ్యవసాయ చట్టాలకు, ప్రతిపాదిత విద్యుత్తు బిల్లుకు వ్యతిరేకంగా రైతులు ముఖ్యంగా పంజాబ్, హర్యానా, యుపి రాష్ట్రాలకు చెందిన వారు నవంబర్ 26 నుంచి ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్యమం చేస్తున్నారు. వారికి దేశ వ్యాప్తంగా గల రైతుల మద్దతు కూడా ఉన్నట్టు స్పష్టపడుతున్నది. దాదాపు 40 రైతు సంఘాల నాయకత్వంలో సాగుతున్న ఉద్యమం 70 రోజులు కావస్తున్నా మసకబారుతున్న సూచనలు కనిపించడం లేదు. మొన్న గణతంత్ర ఉత్సవం నాడు జరిగిన ఘటనలు, ఆ తర్వాత ప్రభుత్వం వైపు నుంచి పెరిగిన అణచివేత కూడా ఉద్యమాన్ని నీరుగార్పించలేదు. గణతంత్ర దినాన ఎర్రకోటపై సిక్కు మత జెండా ఎగురవేసిన ఉదంతంతో రైతు ఉద్యమానికి ముడిపెట్టి దానిని అప్రతిష్ఠ పాలు చేసి వారు వెంటనే తోక ముడిచి ఇళ్లకు వెళ్లిపోయేలా చేయాలని ప్రభుత్వం వేసుకున్న పథకం పారలేదు. ఎర్రకోట ఘటనలతో తమకు సంబంధం లేదని అవి విద్రోహ శక్తులు జరిపించినవేనని రైతులు స్పష్టం చేశారు.
అదే సమయంలో తమ డిమాండ్ నెరవేరే వరకు ఉద్యమ స్థలం నుంచి కదలబోమని ప్రకటించారు. దీనితో యుపి సరిహద్దుల్లోనూ, సింఘు వద్ద రైతు ఉద్యమకారులపై పోలీసుల అణచివేత చోటు చేసుకుంది. స్థానికులు అనే పేరుతో కొందరు రంగప్రవేశం చేసి రైతు శిబిరాలను తొలగించి వారిపై భౌతిక దాడులకు కూడా పాల్పడ్డారు. ఈ పరిస్థితుల్లో యుపి రైతు నాయకుడు నరేశ్ టికాయత్ కంటతడి పెట్టిన దృశ్యం ఆ రాష్ట్రంలోని రైతాంగాన్ని కదిపివేసింది. వేల సంఖ్యలో అదనపు ఉద్యమకారులు ఢిల్లీ సరిహద్దులకు వచ్చి చేరడంతో ఉద్యమం మరింత ఊపందుకుంది. రిపబ్లిక్ డే నాడు వంద మంది రైతు కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని వారిని విడుదల చేయాలని ఉద్యమ నేతలు డిమాండ్ చేశారు. ఆ డిమాండ్‌ను పోలీసులు పట్టించుకున్న జాడ లేదు. పైపెచ్చు పలువురు ఉద్యమ నాయకులపై కేసులు పెట్టినట్టు వార్తలు చెబుతున్నాయి. ఉద్యమ ప్రాంతంలో ఇంటర్‌నెట్‌ను తొలగించారు. ఉద్యమం తగ్గుముఖం పట్టకపోగా మరింత ఉధృతం కావడంతో ప్రధాని మోడీ స్వయంగా చర్చల ప్రస్తావన తెచ్చారు.
రైతులు ఒక్క ఫోన్ కాల్ చేస్తే ప్రభుత్వం చర్చలకు సిద్ధంగా ఉందని ఆయన ప్రకటించారు. తమ కార్యకర్తలను విడుదల చేసి తమపై వేధింపులకు స్వస్తి చెప్పేంత వరకు చర్చల్లో పాల్గొనే ప్రసక్తే లేదని రైతులు స్పష్టం చేశారు. ప్రభుత్వం ఒకవైపు చర్చలకు సిద్ధమంటూనే ఉద్యమం జరుగుతున్న ప్రాంతంలో జాతీయ రహదారిపై కందకాలు తవ్వించి, మేకులు కొట్టించి, బలమైన ఇనుప కంచెలను ఏర్పాటు చేయించి పోలీసు కవాతులు జరిపించడంతో దాని నిజాయితీపై రైతుల్లో అనుమానాలు ఇంకా బలపడ్డాయి. వాస్తవానికి చట్టాలను రద్దు చేసే ప్రసక్తి లేదని చెబుతూనే చర్చల పేరిట కాలయాపన వ్యూహాన్ని ప్రభుత్వం ఆశ్రయించిందని ప్రపంచానికంతటికీ తెలిసిపోయింది. రైతు ఉద్యమకారులకూ ఆ విషయం అర్ధమైపోయింది. రిపబ్లిక్ డే నాటి అవాంఛనీయ ఘటనల మాటున దమనకాండను పెంచి రైతు ఉద్యమాన్ని తుదముట్టించడం సాధ్యమనుకున్న ప్రభుత్వం ఆ విషయంలో ఘోరంగా విఫలమైన సంగతి సందేహాతీతంగా రుజువైపోయింది.
మంగళ, బుధవారాల్లో పార్లమెంటులో కూడా ఈ సమస్య బాగా ముందుకు వచ్చింది. రైతు ఉద్యమంపై చర్చకు ఉభయ సభల్లోని ప్రతిపక్షాలు పట్టుపట్టడంతో కార్యక్రమాలు స్తంభించిపోయాయి. ఇదే సమయంలో రైతు ఉద్యమానికి అంతర్జాతీయ మద్దతు కూడా పెరుగుతున్నది. ప్రసిద్ధ పాప్ గాయకురాలు రిహన్నా, విశ్వవిఖ్యాత పర్యావరణ ఉద్యమకారిణి గ్రెటా థన్‌బర్గ్, అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారీస్ దగ్గరి బంధువు మీనా హారీస్ వంటి వారు ట్వీట్ల ద్వారా రైతు ఉద్యమానికి మద్దతు తెలపడం ప్రధాని మోడీ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడవేసింది. వారికి మన విదేశాంగ శాఖ ఇచ్చిన సమాధానం విచిత్రంగా ఉంది.
రైతు ఉద్యమం భారత దేశ ఆంతరంగిక వ్యవహారమని, కొన్ని స్వప్రయోజక బృందాలు పనికట్టుకొని దానిని పెద్దగా చూపిస్తూ అంతర్జాతీయ మద్దతు కూడగడుతున్నాయని, ఉద్యమం చేస్తున్న రైతులు దేశంలోని రైతాంగంలో కొద్ది భాగమేనని చెబుతూ విదేశాంగ శాఖ విడుదల చేసిన ప్రకటన గమనించదగినది. సరిహద్దుల్లో ఒక సముద్రాన్ని తలపిస్తూ సాగుతున్న రైతు ఉద్యమాన్ని స్వార్థపరుల కుట్రగా పేర్కొనడం ప్రభుత్వం ఆత్మవంచన చేసుకోడమే అవుతుంది. ఇప్పటికైనా మొండిపట్టు వదిలిపెట్టి రైతులతో నిజాయితీతో కూడిన చర్చలకు అది సిద్ధపడవలసి ఉంది. వారిపై అక్రమ కేసులను ఎత్తివేసి అణచివేతకు స్వస్తి చెప్పవలసి ఉంది.