Wednesday, November 6, 2024

పిట్ట పీక పిసికేస్తాం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: సాగు చట్టాలపై రైతుల ఆందోళనలు జరిగిన సమయంలో భారత ప్రభుత్వంనుంచి తమకు ఒత్తిడి ఎదురైందంటూ ట్విట్టర్ మాజీ సిఇఓ జాక్ డోర్సేసంచలన ఆరోపణలు చే శారు.అయితే ఈ ఆరోపణలను కేంద్రప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. డోర్సే చెబుతున్న విషయాలన్నీ పచ్చి అబద్ధాలని కేంద్ర సమాచార, సాంకేతిక వ్యవహారాల శాఖ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ కొట్టిపారేశారు. బహుశా ట్విట్టర్ చరిత్ర నుంచి చాలా సందేహాస్పద కాలాన్ని తొలగించే ప్రయత్నంలో భాగంగానే ఆ యన ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని ట్వీట్ చేశారు. సోమవారం ఓ టీవీ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న డోర్సే భారత ప్రభుత్వంపై ఈ సంచలన ఆరోపణలు చేశారు. ఏ ప్రభుత్వంనుంచైనా మీకు  ఒత్తిళ్లు ఎదురయ్యాయా? అని వ్యాఖ్యాత అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ డోర్సే భారత్‌ను ఉదహరించారు.

సాగు చట్టాలపై రైతుల ఆందోళనలు, విమర్శలు చేసే జర్నలిస్టుల విషయంలో ప్రభుత్వంనుంచి తమకు చాలా అభ్యర్థనలు వచ్చేవని డోర్సేఆరోపించారు. ఒకానొక దశలో ట్విట్టర్‌ను భారత్‌లో మూసివేస్తామని కూడా కొందరు బెదిరించినట్లు ఆయన ఆరోపించడం గమనార్హం. అలాగే ట్విట్టర్ ఉద్యోగుల ఇళ్లలో తనిఖీలు చేస్తామన్నారని కూడా ఆయన చెప్పుకొచ్చారు. అయితే ఇలాంటి బెదిరింపులు ఎవరినుంచి వచ్చాయనే దానిపై మాత్రం డోర్సే ఎలాంటి ఆధారాలను బైటపెట్టలేదు. అయితే డోర్సే ఆరోపణలను మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తీవ్రంగా ఖండించారు. డోర్సే ఆరోపణల్లో ఎంతమాత్రం నిజం లేదన్నారు. ఆయన హయాంలో ట్విట్టర్ భారత చట్టాలను అనేకసార్లు ఉల్లంఘించిందని వెల్లడించారు. 2020 22 మధ్య పదేపదే నిబంధనలను అతిక్రమించారని తెలిపారు. 2022 జూన్ తర్వాత మాత్రమే ట్విట్టర్ భారత చట్టాలకు అనుగుణంగా నడుచుకోవడం ప్రారంభించిందని తెలిపారు. డోర్సే ఆరోపించినట్లుగా ఎవరిపైనా తనిఖీలు నిర్వహించలేదని..

ట్విట్టర్‌ను మూసివేయనూ లేదని స్పష్టం చేశారు. భారత సార్వభౌమత్వాన్ని అంగీకరించడానికి డోర్సే హయాంలోని ట్విట్టర్ విముఖత వ్యక్తం చేసిందన్నారు. దేశీయంగా కార్యకలాపాలు నిర్వహించే కంపెనీలన్నీ ఇక్కడి చట్టాలను అనుసరించేలా చూసే హక్కు ఒక సార్వభౌమ దేశంగా భారత్‌కు ఉందని చంద్రశేఖర్ స్పష్టం చేశారు. 2021జనవరిలో జరిగిన రైతుల ఆందోళనల సమయంలో అనేక దుష్ప్రచారాలు చక్కర్లు కొట్టాయని, వాటిలో నరమేధం లాంటి తీవ్రమైన అసత్య ప్రచారాలు కూడా ఉన్నాయని మంత్రి తెలిపారు. అలాంటి తప్పుడు సమాచారం వ్యాప్తిచెందకుండా భారత ప్రభుత్వం బాధ్యత తీసుకుందన్నారు. లేదంటే పరిస్థితులు మరింతగా దిగజారిపోయి ఉద్రిక్తతలు పెరిగే అవకాశాలు ఉండేవని వివరించారు. ఇలాంటి ఘటనలే అమెరికాలో జరిగినప్పుడు ట్విట్టర్ వెంటనే తప్పుడు సమాచారాన్ని తొలగించిందనిమంత్రి తెలిపారు. కానీ భారత్ విషయానికి వచ్చేసరికి మాత్రం వారికి ఇబ్బందులు ఎదురయ్యాయని పేర్కొన్నారు.

డోర్సే హయాంలో ట్విట్టర్ అనుసరించిన పక్షపాత వైఖరికి ఇది నిదర్శనమని తెలిపారు. ట్విట్టర్ ఉద్యోగుల ఇళ్లపై తనిఖీలు నిర్వహించలేదని, ఎవరినీ జైళ్లకు పంపలేదని మంత్రి స్పష్టం చేశారు. భారత చట్టాలను తప్పనిసరిగా అమలు చేసేలా చూడడంపైనే తమ దృష్టిని కేంద్రీకరించామన్నారు. డోర్సే హయాంలో ట్విట్టర్ భారత చట్టాలను ఉల్లంఘించడమే కాకుండా రాజ్యాంగంలోని ఆర్టికల్ 14,19లను సైతం విస్మరించిందనిరాజీవ్ చంద్రశేఖర్ ఆరోపించారు. అలాగే పక్షపాత వైఖరి అవలంబిస్తూ, అసత్య ప్రచారాలను తొలగించడానికి నిరాకరించిందని ఆరోపించారు. తద్వారా తప్పుడు సమాచారం ఆయుధాలుగా మారేందుకు దోహదం చేసిందని పేర్కొన్నారు.

డోర్సే చెప్పింది నిజమే కావచ్చు:రాకేశ్ తికాయత్
సాగుచట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఉద్యమం చేపట్టిన సమయంలో భారత ప్రభుత్వం తమపై ఒత్తిడి తెచ్చినట్లు ట్విట్టర్ మాజీ సిఇఓ జాక్ డోర్సే ఆరోపించిన విషయం తెలిసిందే. దీనిపై రైతు ఉద్యమ నాయకుడు రాకేశ్ తికాయత్ స్పందించారు. ఫేస్‌బుక్, ట్విట్టర్‌లలో రైతుల ఉద్యమంగురించి ఎక్కువ ప్రచారం జరగలేదన్నారు. ఆశించిన స్థాయిలెలో సమాచార వ్యాప్తి జరగలేదన్నారు. సర్కార్ తమ స్థాయిలో రైతు ఉద్యమాన్ని అడ్డుకుందని తికాయత్ తెలిపారు. దీనిపై ట్విట్టర్ మాజీ సిఇఓ జాక్ డోర్సే స్పష్టంగా చెప్పారన్నారు. అయినా అలాంటి కంపెనీలు ఎటువంటి ఒత్తిళ్లకు లోను కావన్నారు. బహుశా ప్రభుత్వం ట్విట్టర్‌ను బెదిరించి ఉంటుందని, డోర్సే చెప్పింది నిజమే అయి ఉంటుందని అన్నారు. రైతులు, రైతు ఉద్యమానికి చెందిన వారి ఖాతాలను మూసివేసేలా ప్రభుత్వం ట్విట్టర్‌పై ఒత్తిడి తెచ్చిందా అని అడగ్గా, రైతుల ఉద్యమాన్ని హైలైట్ చేసిన చాలా ఖాతాలను బ్లాక్ చేసినట్లు తికాయత్ చెప్పారు. రైతుల ఆందోళనను హైలైట్ చేస్తే ఖాతాలను మూసివేస్తారనే విషయం చిన్నపిల్లలకు సైతం తెలుసునని ఆయన చెప్పారు. తన అధికారానికి ఏమాత్రం వ్యతిరేకత వచ్చినా బిజెపి ప్రభుత్వం సహించదని కూడా ఆయన అన్నారు.

ప్రభుత్వం సమాధానం చెప్పాలి : కాంగ్రెస్
రైతుల ఉద్యమం సమయంలో ఉద్యమాన్ని సమర్థించే వారి ఖాతాలను తొలగించకపోతే ట్విట్టర్‌ను మూసివేస్తామని ప్రభుత్వం బెదిరించిందంటూ ట్విట్టర్ మాజీ సిఇఓ జాక్ డోర్సే చెప్పిన తర్వాతనైనా ప్రభుత్వం సోషల్ మీడియాను, జర్నలిస్టులను అణచివేయడాన్ని ఆపివేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. అంతేకాదు డోర్సే వెల్లడించిన అంశాలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని కూడా ఆ పార్టీ డిమాండ్ చేసింది. వ్యవస్థలను బలహీనం చేయడం ద్వారా దేశంలో ప్రజాస్వామ్యాన్ని బలహీనం చేయడానికి ఇంతకు మించిన సాక్షం మరోటి లేదని పేర్కొంది.‘ప్రభుత్వం సోషల్ మీడియాను అణచివేయడం ఆపేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం, లొంగిపోవలసిందిగా మీడియాలోని పెద్ద వర్గాలను అణచివేయడం, బెదిరించడాన్ని నిలిపివేయాలి’ అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనాతే మంగళవారం విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ అన్నారు.

ప్రతిపక్షాల గొంతుకను ప్రభుత్వం రెగ్యులర్‌గా అణచివేస్తోందని కూడా ఆమె అన్నారు. ప్రభుత్వంనుంచి వచ్చిన ఒత్తిడి కారణంగానే ట్విట్టర్ రాహుల్ గాంధీ ఖాతాను నిషేధించిందని ఆమె అంటూ డోర్సే ప్రకటన తర్వాత వాస్తవం బైటికి వచ్చిదన్నారు. ‘తన ఇమేజిని నిర్మించుకోవడానికి కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నారు కాబట్టి, అలాంటి వాస్తవం బైటికి వస్తే అదంతా కుప్పకూలిపోతుంది కనుక ప్రధానమంత్రి భయపడుతున్నారు’ అని ఆమె అన్నారు. ఇప్పుడు నిజాలు బైటికి చెప్పడం వల్ల డోర్సేకి ఎలాంటి ప్రయోజనంఉండదని ఆమె అన్నారు. కాగా ‘రైతులను, రైతు ఉద్యమానికి మద్దతు తెలిపిన వారి ఖాతాలను మూసివేసేలా ప్రభుత్వం ట్విట్టర్‌పై ఒత్తిడి చేసింది, ప్రభుత్వాన్ని విమర్శించే జర్నలిస్టుల ఖాతాలను మూసివేయించింది లేదా ట్విట్టర్‌పైన,

దాని ఉద్యోగులపై దాడులు చేస్తానని బెదిరించింది. ట్విట్టర్ సహ వ్యవస్థాపకుడు, మాజీ సిఇఓ జాక్ డోర్సేఓ టీవీ ఇంటర్వూలో అంగీకరించిన విషయం ఇది. ప్రభుత్వం దీనికి సమాధానం చెబుతుందా?’ అని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి రణదీప్ సుర్జేవాలా ట్విట్టర్ ద్వారా ప్రశ్నించారు. జాక్ డోర్సే ఇంటర్వూలో ఈ ఆరోపణలకు సంబంధించిన క్లిప్పింగ్‌ను కూడా ఆయన తన ట్వీట్‌తో పంచుకున్నారు. రైతుల ఆందోళన సమయంలో పిరికిపంద బిజెపి ప్రభుత్వం ట్విట్టర్‌ను మూసివేస్తామని, దాని ఉద్యోగులపై దాడులు చేస్తామని బెదిరించిందని ఆ పార్టీకి చెందిన మరో సీనియర్ నేత జైరాం రమేశ్ దుయ్యబట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News