భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్, అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకన్ మధ్య ఆదివారం సుదీర్ఘ చర్చలు జరిగాయి. మూడు వారాల క్రితం భారత ప్రధాని నరేంద్రమోడీ రష్యాలో పర్యటించిన తరువాత భారత్‌అమెరికా దేశాల మధ్య సంబంధాలు ఇబ్బందికరంగా మారిన నేపథ్యంలో ఈ చర్చలు జరగడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అలాగే న్యూయార్క్‌లో సిక్కు ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూను హత్య చేయడానికి కుట్ర జరగడంపై భారత్ నుంచి సరైన సంజాయిషీని అమెరికా కాంక్షిస్తున్న నేపథ్యంలో ఈ చర్చలు జరుగుతున్నాయి. విదేశీ మంత్రుల క్వాడ్ సదస్సులో పాల్గొనడానికి జైశంకర్, ఆంటోనీ బ్లింకన్ టోక్యోకు వచ్చారు. అయితే ఆదివారం వీరిద్దరి భేటీలో మోడీ రష్యా పర్యటన, న్యూయార్క్‌లో పన్ను హత్యకు కుట్ర అంశాలు చర్చకు వచ్చాయో లేదో ఇప్పటికిప్పుడే స్పష్టంగా తెలీదు. బ్లింకన్‌తో ప్రాంతీయ, ప్రపంచ స్థాయి సమస్యలపై విస్తృతంగా చర్చించడమైందని జైశంకర్ ఎక్స్ పోస్ట్ లో పేర్కొన్నారు.
“ మా ద్వైపాక్షిక ఎజెండా నిదానంగా పురోగతి చెందుతోందని ప్రాంతీయ స్థాయి నుంచి ప్రపంచ స్థాయి సమస్యల వరకు చర్చించడమవుతోంది ” అని పేర్కొన్నారు. రష్యాఉక్రెయిన్ యుద్ధం, గాజాలో ప్రస్తుత పరిస్థితి చర్చల్లో చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. జులై 8 నుంచి 9 వరకు రెండు రోజుల పాటు మోడీ రష్యాలో పర్యటించడం , యాధృచ్ఛికంగా అదే సమయంలో వాషింగ్టన్‌లో నాటో సదస్సు జరగడంపై అమెరికాతోపాటు అగ్రరాజ్యం మిత్ర దేశాలు కూడా ఆగ్రహంగా ఉన్నాయి. సౌత్ అండ్ సెంట్రల్ ఆసియా కు ప్రాతినిధ్యం వహించే అమెరికా సహాయ మంత్రి డొనాల్డ్ లూ అమెరికా కాంగ్రెస్ స్థానిక సమావేశం కూడా మోడీ రష్యా పర్యటనపై అసంతృప్తి వ్యక్తం చేసిందని పేర్కొన్నారు. బైడెన్ పాలనా నిర్వహణ అధికార వర్గాలు కూడా మోడీ రష్యా పర్యటనపై గుర్రుగా ఉన్నాయి. అయితే లూ వ్యాఖ్యలకు భారత్ అభ్యంతరం తెలియజేసింది. బహుధ్రువ ప్రపంచంలో అన్ని దేశాలకు స్వేచ్ఛ ఉంటుందని, ఆ వాస్తవాన్ని ప్రతివారు బుద్ధిపూర్వకంగా తెలుసుకోవాలని భారత్ పేర్కొంది. ఇదిలా ఉండగా వచ్చే నెల ఉక్రెయిన్ లోని కీవ్‌ను మోడీ సందర్శించడానికి భారత్, ఉక్రెయిన్ సన్నాహాలు చేస్తున్నాయి.