Monday, December 23, 2024

పాక్ యువకుడితో థానే యువతి ప్రేమాయణం… నకిలీ పాస్ పోర్టుతో పాక్ కు వెళ్లి ఏం చేసిందంటే?

- Advertisement -
- Advertisement -

ముంబయి: సోషల్ మీడియాలో భారత్ కు చెందిన యువతికి పాకిస్థాన్ కు చెందిన యువకుడు పరిచయం కావడంతో ప్రేమగా మారింది. నకిలీ పాస్‌పోర్టు తీసుకొని పాకిస్థాన్‌కు వెళ్లి అక్కడ ప్రేమపెళ్లి చేసుకొని తిరిగి ఆమె ఇండియాకు వచ్చిన సంఘటన మహారాష్ట్రలోని థానేలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… పాకిస్థాన్‌లోని అబోటాబాద్‌కు చెందిన బాబర్ బషీర్ అహ్మద్‌కు థానేకు చెందిన నగ్మా ఫేస్‌బుక్‌లో పరిచయమైంది. పరిచయం ప్రేమగా మారడంతో ఆన్‌లైన్‌లో వివాహం చేసుకున్నారు. నగ్మా పాకిస్థాన్ వెళ్లేందుకు ప్రయత్నం చేసింది. పాస్‌పోర్టు తిరస్కరణకు గురికావడంతో వెళ్లలేకపోయింది.

వెంటనే నగ్మా తన పేరును నూర్ మక్సూద్ అలీ సనమ్ ఖాణ్ రూక్‌గా మార్చుకొని పాస్‌పోర్ట్ సంపాదించింది. పాకిస్థాన్‌కు వెళ్లి బాబర్‌ను ప్రేమ పెళ్లి చేసుకొని మళ్లీ జులై 17న థానేకు తిరిగొచ్చింది. లోకమాన్య నగర్‌లోని ఓ కేంద్రం నుంచి ఎక్కువగా నకలీ డాక్యుమెంట్లు సృష్టించి పాస్‌పోర్ట్, వీసా పొందినట్లు అధికారులు గుర్తించారు. నగ్మా నకిలీ పాస్‌పోర్టు సహాయంతో పాక్‌కు వెళ్లి తిరిగొచ్చినట్టు గుర్తించి ఆమెను అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. ఆమెకు మధ్యవర్తులుగా ఉండి పాస్‌పోర్టు ఇప్పించిన వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఆమె పాక్‌లో పెళ్లి చేసుకున్న మ్యారేజ్ సర్టిఫికెట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నగ్మా స్వస్థలం ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం. 2015లో భర్తతో విడిపోయిన తరువాత నగ్మా పేరు మార్చుకుందని, పోలీసుల ఆరోపణలను ఆమె తల్లి తీవ్రంగా ఖండించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News