ప్రముఖ రచయిత్రి, బుకర్ ప్రైజ్ అవార్డు గ్రహీత అరుంధతీరాయ్ జర్మనీ వెళ్ళడానికి భారత ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. జర్మనీలో ఈ నెల 15వ తేదీ నుంచి డిసెంబర్ 3వ తేదీ వరకు జరిగే ‘మ్యూనిచ్ లిటరరీ ఫెస్టివల్’ లో ఆమె పాల్గొనవలసి ఉంది. ఈ లిటరరీ ఫెస్టివల్‌లో తొలిరోజు అరుంధతీరాయ్ ప్రారంభోపన్యాసంతో పాటు, మర్నాడు జరిగే చర్చా గోష్ఠిలో ఆమె పాల్గొనవలసి ఉంది. పదమూడేళ్ళ క్రితం వచ్చిన ఫిర్యాదును ఆధారం చేసుకుని గత నెలలో అరుంధతీరాయ్‌పై కేసు నమోదు చేసి ఆమె విదేశీయానాన్ని కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంది.
బ్యాంకులకు లక్షల కోట్ల రూపాయలు ఎగవేసిన వారు విదేశాలకు పారిపోకుండా ఈ ప్రభుత్వం ఎందుకు అడ్డుకోలేకపోయిందనే ప్రశ్న ఈ సందర్భంగా ఉదయిస్తోంది. ‘రిపోర్టర్స్ విథౌట్ బార్డర్స్ ప్రెస్ ఫ్రీడం’ ఇండెక్స్‌లోని 180 దేశాల్లో భారత దేశం 161వ స్థానానికి చేరడం మన దేశంలో జర్నలిస్టులు, రచయితల భావ ప్రకటనా స్వేచ్ఛ ఏ స్థాయిలో ఉందో తెలియచేస్తోంది. అరుంధతీరాయ్‌పై పదమూడేళ్ళ నాటి ఫిర్యాదుననుసరించి ఇప్పుడే ఎందుకు కేసు పెట్టారు? అన్నది చర్చనీయాంశమైంది. కశ్మీర్ సమస్యపై అరుంధతీరాయ్ చేసిన ప్రసంగంపై అభ్యంతరం తెలుపుతూ సుషీల్ పండిట్ అనే కశ్మీరి పండిట్ 2010లో పోలీసులకు ఫిర్యాదు చేశాడు.ఈ ఫిర్యాదు చేసిన పదమూడేళ్ళ తరువాత ఇప్పుడు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా ఇచ్చిన ఆదేశాల మేరకు గత నెలలో ఆమెపై కేసు నమోదైంది.‘అరుంధతీరాయ్ రెచ్చగొట్టే విధంగా ఉపన్యసించి, భిన్నవర్గాల మధ్య శత్రుభావాన్ని పెంచార’ని ఆమెపై 153ఎ, 153బి సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసు రుజువైనట్టయితే గరిష్ఠంగా ఏడేళ్ళు శిక్షపడే అవకాశం ఉంది.
అరుంధతీరాయ్ కశ్మీర్‌పై మాట్లాడినందుకు 2010లో ప్రభుత్వం తొలిసారిగా ఆమెను అప్పుడే అరెస్టు చేసింది. పదమూడేళ్ళ క్రితం వచ్చిన ఫిర్యాదుపై ఆమెను విచారించాలన్న భారత ప్రభుత్వ నిర్ణయాన్ని ఈ ఏడాది జరిగిన ఫ్రాంక్‌ఫర్ట్ బుక్ పెయిర్‌లో ప్రముఖ రచయిత సల్మాన్ రష్దీ తీవ్ర స్థాయిలో విమర్శించారు. కశ్మీర్‌కు చెందిన సనాఇర్షాద్ మట్టూ అనే ఫోటో జర్నలిస్టు గత ఏడాది పులిడ్జర్ అవార్డుకు ఎంపికైంది. కోవిడ్ 19 రెండవ దశలో ఆక్సిజన్ అందక, ఆస్పత్రులలో బెడ్లు లేక ప్రజలు ఎదుర్కొంటున్న తీవ్ర సమస్యలపై, కనీస సదుపాయాలందక అనేక మంది మృతి చెందడంపై అమిత్ దేవ్, అడ్‌సన్ అబిది, డానిష్ సిద్ధికితో కలిసి ఫోటో ఫీచర్ రంగంలో ఆమె చేసిన కృషికిగాను ఈ అవార్డుకు ఆమెను ఎంపిక చేశారు.
ఈ అవార్డు తీసుకోవడానికి అమెరికా వెళ్ళడానికి సిద్ధమవగా న్యూఢీల్లీ ఎయిర్ పోర్టులో ఇమిగ్రేషన్ అధికారులు ఆమెను నిలిపివేశారు. ఏ కారణం చేత ఆమె విదేశాలకు వెళ్ళకుండా నిలిపివేస్తున్నదీ చెప్పకుండా ఆమె ఎయిర్‌లైన్ టికెట్టు పైన స్టాంప్ వేసేసి వెనక్కి పంపించేశారు. కోవిడ్ రెండవ దశలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వెలికితీసినందుకే ఈ అవార్డు అందుకోనీయకుండా ప్రభుత్వం అడ్డుకుందని స్పష్టమవుతోంది. భారత ప్రభుత్వ చర్యను తీవ్రంగా ఖండించిన ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ అనేక మంది కశ్మీరీ ప్రముఖులను కూడా విదేశాలకు వెళ్ళకుండా ఇలాగే అడ్డుకుందని ఆరోపించింది.
అరుంధతీరాయ్ 1997లో రాసిన ‘ద గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్’ అన్న నవలకు ప్రతిష్ఠాత్మకమైన బుకర్ ప్రైజ్ రావడంతో అంతర్జాతీయంగా ఆమెకు పేరు ప్రఖ్యాతులు వచ్చాయి.
ఈశాన్య ప్రాంతంలోని షిల్లాంగ్‌లో జన్మించిన అరుంధతీరాయ్ తల్లి కేరళకు చెందిన క్రిస్టియన్, తండ్రి బెంగాల్‌కు చెందిన హిందువు. వారిరువురూ విడిపోవడంతో తల్లితోపాటు ఆమె కేరళకు వచ్చేశారు. ఢిల్లీలో ఆర్కిటెక్చర్ చదివారు. సామాజిక, రాజకీయ అంశాలపై నిర్మొహమాటంగా తన అభిప్రాయాలను వ్యక్తం చేయడమే కాకుండా, అనేక రచనలు చేస్తున్నారు. అవి ప్రవాహంలా వచ్చి దేశవిదేశీ పాఠకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. నర్మదా బచావ్ వంటి సామాజిక ఉద్యమంలో మేధాపట్కర్‌తో కలిసి పాల్గొన్నారు. ఆ ఉద్యమ సమయంలోనే మేధాపట్కర్ గుజరాత్‌లోని సబర్మతి ఆశ్రమం వద్ద వున్నప్పుడు బిజెపి నేత, ప్రస్తుత ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా ఆమెపై చేయి చేసుకున్నారని మేధాపట్కర్ ఆయనపై కేసు పెట్టారు.
సక్సేనా హైకోర్టుకు కెళ్ళి ఆ కేసుపై స్టే తెచ్చుకున్నారు. సక్సేనా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌గా నియమితులైనప్పుడు మేధాపట్కర్‌పై ఆయన చేసిన దాడి కేసు గురించి పలువురు ప్రస్తావించారు. మేధాపట్కర్‌తో కలిసి నర్మదా బచోవో ఆందోళనలోను, పత్రికా స్వేచ్ఛపై జరిగిన దాడులకు, అరెస్టులకు నిరసనగా చేపట్టిన ఆందోళనల్లోనూ, ముఖ్యంగా న్యూస్‌క్లిక్ ఎడిటర్ ప్రబీర్ పురకాయస్థ, దాని హెచ్‌ఆర్ డైరెక్టర్ చక్రవర్తిలను అరెస్టు చేసినప్పుడు, దానికి నిరసనగా చేపట్టిన ఆందోళనలోనూ పాలు పంచుకోవడం కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి, ఢిల్లీ లెఫ్టి నెంట్ గవర్నర్‌కు మింగుడుపడలేదు. న్యూస్‌క్లిక్‌పై దాడి చేసిన వారం రోజుల కల్లా అరుంధతీరాయ్‌పై కేసు నమోదైంది.
నరేంద్ర మోడీ నాయకత్వంలో కేంద్రంలో బిజెపి పాలన సాగుతున్న సమయంలోనే అనేక మంది వేల కోట్ల రూపాయలు బ్యాంకు రుణాలను ఎగవేసి విదేశాలకు పారిపోయారు. ఇలా పారిపోయిన ఎగవేతదారుల్లో నీరవ్ మోడీ, నీషల్ మోడీ, లలిత్ మోడీ, విజయ్ మాల్యా, మెహుల్ చోక్స్ తదితరులున్నారు. ఇలా 33 మంది ఎగవేతదారులు విదేశాల్లో తలదాచుకుంటున్నట్టు కేంద్ర ప్రభుత్వమే పార్లమెంటులో ప్రకటించింది. వీరిపైన సిబిఐ కేసులు నమోదు చేసింది. ఈ ఎగవేతదారుల్లో ఇరవై మంది ప్రధాని మోడీకి సన్నిహితులు. ఈ తొమ్మిదేళ్ళ బిజెపి పాలనలో ఎగవేత వల్ల బ్యాంకులకు పన్నెండున్నర లక్షల కోట్ల రూపాయలు నష్టం వాటిల్లినట్టు పార్లమెంటులో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్వయంగా ప్రకటించారు.
బ్యాంకుల నుంచి ఒక్కొక్కరూ వందల, వేల కోట్ల రూపాయల రుణాలు తీసుకున్న ఈ ఎగవేతదారులు విదేశాలకు పారిపోతే, వారిపైన కేసులున్నా అడ్డుకోని ప్రభుత్వం, ఒక రచయిత్రిపైన కేసును చూపించి విదేశాలకు వెళ్ళకుండా అడ్డుకోవడమేమిటని, ఏ కేసు లేకున్నా ఒకఫోటో జర్నలిస్టు అవార్డు తీసుకోవడానికి అమెరికా వెళ్లకుండా అడ్డుకోవడమేమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఎగవేతదారుల్లో కొందరు అధికార పార్టీలో చేరిపోతే, వారిపైన వున్న కేసులు అంగుళం కూడా ముందుకు ఎందుకు కదలవో నిజంగానే అంతుపట్టని ప్రశ్న. జర్మనీలో జరుగుతున్న మ్యూనిచ్ లిటరరీ ఫెస్టివల్‌కు వెళ్ళకుండా అరుంధతీరాయ్‌ను అడ్డుకోగలిగిన కేంద్ర ప్రభుత్వం ఆమె గొంతును అడ్డుకోలేకపోయారు. మ్యూనిచ్ లిటరరీ ఫెస్టివల్‌కు ఆన్‌లైన్‌లో ఆమె చేసిన ప్రసంగం ‘స్క్రోల్.ఇన్’ సౌజన్యంతో ఈ విధంగా ఉంది. “ప్రజా వేదికపై నుంచి నేను కనిపించలేను. జర్మనీలోనే కాదు, నిజానికి నావైన అభిప్రాయాలను నిషేధించారు. యూదులు, ముస్లింలు, క్రిస్టియన్లు, హిందువులు, కమ్యూనిస్టులు, నాస్తికులు, నిరీశ్వరవాదులు కలిసి, గాజాపై కాల్పుల విరమణ పాటించాలని నా గొంతు కలపకుండానే ప్రపంచ వ్యాప్తంగా వీధుల్లో ప్రదర్శన చేస్తూ నినదించారు.
మన వ్యక్తిగత జీవితంలో విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు, ఈ నిర్లజ్జ హత్యాకాండ దృశ్యాలు ప్రత్యక్షమైతే, మనకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. మన నైతికతలో ఎంతో కొంత శాశ్వత మార్పు చోటు చేసుకుంటుంది. ఆస్పత్రులపైన బాంబులు వేస్తుంటే, లక్షలాది మంది ప్రజలు నివాసాలు కోల్పో యి తరలిపోతుంటే, శిథిలాల కిందపడి మరణించిన వేలాది మంది పిల్లల శవాలను బైటిక తీస్తుంటే అలా చూస్తూ ఉండిపోతామా? వాళ్ళ మరణాలు ఒక సమస్యే కాదని, మనుషులంతా మానవత్వాన్ని కోల్పోతుంటే మరొకసారి మనం మౌనంగా ఉండిపోతామా? ఇజ్రాయిల్ వెస్ట్ బ్యాంక్‌ను ఆక్రమించి, గాజాను ముట్టడించడం నిజంగా మానవత్వాన్ని మంటగలిపే నేరం. ఈ దురాక్రమణకు ఆర్థిక సహాయం చేస్తున్న అమెరికా, ఇతర దేశాలు ఈ నేరంలో భాగస్వాములే. హమాస్ లాగనే ఇజ్రాయిల్ కూడా ఏ మాత్రం స్పృహ లేకుండా గాజాను ముట్టడించి, దాన్ని అక్రమించే పరిణామాల్లో భాగంగానే ఇదంతా జరుగుతోంది.
ఈ దారుణాలకు మనం సాక్షీభూతంగా నిలిచాం. ఈ కౄరత్వంపైన ఏ స్థాయిలో వ్యాఖ్యానించినా, రెండు వైపులా చేస్తున్న దారుణాలను ఎంత ఖంచించినా, ఈ అరాచకాల స్థాయికి సమానమైనది ఏదీ కూడా పరిష్కారం కాదు. క్రూరత్వాన్ని పెంచి పోషించడం ఒక వృత్తిగా తయారైంది. ఇది హింసకు, ఇరువైపులా బాధితులను, నేరస్థులను తయారు చేయడానికి ఉపయోగపడుతుంది. బాధితులు మరణించారు. నేరస్థులు తాము చేసిన దారుణాలతో బతకబోతున్నారు. దీనికి మిలిటరీ చర్యలు పరిష్కారం కాదు. పాలస్తీనా వాసులు, ఇజ్రాయిల్ వాసులు రాజకీయంగా పక్కపక్కనే కలిసి, సమాన హక్కులతో హుందాగా జీవించడం ఒక్కటే పరిష్కారం.
ప్రపంచ దేశాలు దీనిలో జోక్యం చేసుకోవాలి. దురాక్రమణ ఆగిపోవాలి. పాలస్తీనావాసులకు తమదైన అనుకూల మాతృభూమి కావాలి. అలా జరగకపోతే, పశ్చిమ దేశాల ఉదారవాదపు నైతిక వాస్తు నిర్మాణం మనుగడ కోసం నిలపాల్సిందే. అదంతా ఒక కపటత్వం అనేది మనకు తెలుసు. అయినప్పటికీ కనీసం అది ఒక రకమైన తలదాచుకునే సదుపాయమే. ఆ సదుపాయం కూడా మన కళ్ళ ముందే అదృశ్యమైపోతోంది. దయచేసి పాలస్తీనా, ఇజ్రాయిల్ కోసం మరణించిన వారి పేరునైనా జీవించడానికి, హమాస్ చేతిలో బందీలుగా ఉన్న వారి కోసం, ఇజ్రాయిల్ చేతిలో బందీలుగా ఉన్న పాలస్తీనియన్ల కోసం, మానవత్వం కోసమైనా సరే కాల్పుల విరమణ పాటించండి”.
రాఘవశర్మ
9493226180