న్యూఢిల్లీ: భారతీయ ప్రైవేట్ వ్యాపారులు చైనా ఉత్పత్తిదారుల నుంచి కొనుగోలు చేస్తున్న అత్యవసర వైద్య సరఫరాల ధరల పెంపును అరికటి భారత దేశంలో కొవిడ్-19 విజృంభణను ఎదుర్కొందేందుకు సాగిస్తున్న పోరాటానికి సహాయపడవలసిందిగా చైనాకు భారత ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. అంతేగాక, వైద్య సరఫరాలు నిరాటంకంగా కొనసాగేందుకు సరకు రవాణా విమానాల సంఖ్యను కూడా పునరుద్ధరించాలని చైనాను భారత్ కోరింది.
ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లు వంటి వైద్య సరఫరాల ధరల పెరుగుదల, భారత్‌కు సరకు రవాణా విమాన సర్వీసులకు అవరోధం ఏర్పడడం వల్ల భారత్‌లో వైద్యానికి సంబంధించిన సరకులు చాలా ఆలస్యంగా చేరుకుంటున్నాయని హాంకాంగ్‌లో భారతీయ కాన్సల్ జనరల్ ప్రియాంక చౌహాన్ గురువారం తెలిపారు. భారత్‌కు వైద్య సరఫరాలు నిరంతరాయంగా కొనసాగాలని, వాటి ధరలు స్థిరంగా ఉండాలని తాము కోరుతున్నామని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్‌కు బుధవారం ఇచ్చిన ఒక ఇంటర్వూలో ఆయన తెలిపారు. సరఫరా-డిమాండ్ మధ్య కొద్దిగా ఒత్తిడి ఉన్నప్పటికీ ధరలు మాత్రం స్థిరంగా ఉండాలని ఆమె చెప్పారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వ స్థాయిలో కొంత సహకారం అవసరమని, అయితే ఈ విషయంలో చైనా ప్రభుత్వం ఏ మేరకు ఒత్తిడి తీసుకురాగలదో తాను చెప్పలేనని ఆమె అభిప్రాయపడ్డారు.