రాజస్థాన్‌కు చెందిన శైతాన్ సింగ్‌కు నాలుగు సంవత్సరాల క్రితం పాకిస్తాన్ సింధ్ రాష్ట్రానికి చెందిన కేసర్ కన్వర్‌తో నిశ్చితార్థం జరిగింది. వీసాలు సంపాదించేందుకు నాలుగు సంవత్సరాలు తంటాలు పడిన వరుని కుటుంబానికి ఇప్పుడు సరికొత్త సమస్య ఎదురైంది. కేంద్ర ప్రభుత్వం గురువారం అట్టారి సరిహద్దును మూసివేయడంతో వారి సీమాంతర వివాహానికి అంతరాయం ఏర్పడింది. పాకిస్తాన్‌లోని అమర్‌కోట్‌లో ఈ నెల 30న జరగవలసి ఉన్న వివాహం కోసం వరుని కుటుంబం బార్మర్ జిల్లా నుంచి ఊరేగింపుగా మంగళవారం అట్టారి సరిహద్దు వద్దకు బయలుదేరింది. కాని వారు అక్కడికి చేరేసరికి అధికారులు వారిని సరిహద్దు దాటేందుకు అనుమతించలేదు. పహల్‌గామ్ ఉగ్ర దాడి నేపథ్యంలో భారత్ వరుస ప్రతీకార చర్యల్లో భాగంలో అట్టారి వాఘా సరిహద్దును వెంటనే మూసివేయాలని బుధవారమే ఆదేశించింది. ప్రస్తుత అవాంతర పరిస్థితి రెండు కుటుంబాలను కుంగదీసిందని వరుని బంధువు సురేంద్ర సింగ్ చెప్పాడు.
‘పాకిస్తాన్ నుంచి మా బంధువులు ఇక్కడికి వచ్చారు. కానీ వారు తిరిగి వెళ్లవలసి వచ్చింది. వారు నిరుత్సాహం చెందారు, ఉగ్ర దాడులు చాలా నష్టం కలిగించాయి. బంధుత్వాలు దెబ్బ తిన్నాయి. సరిహద్దులో కదలికలు ఆగిపోయాయి’ అని అతను చెప్పాడు. సీమాంతర వివాహానికి అంతరాయం కలిగింది. అయితే, బార్మర్ జిల్లా ఇంద్రోయి గ్రామ వాసి అయిన శైతాన్ సింగ్ వీసా మే 12 వరకు చెల్లుతుంది. ఆ లోగా సరిహద్దు తిరిగి తెరచుకున్నట్లయితే వివాహం జరగవచ్చునని రెండు కుటుంబాలు ఆశిస్తున్నాయి. సోధా రాజపుత్రుల సమాజం సంప్రదాయం ప్రకారం కుటుంబ బంధాల ద్వారా సీమాంతర వివాహం కుదిరింది. పాకిస్తాన్ సింధ్ రాష్ట్రంలో ఆ సమాజం జనాభా గణనీయంగా ఉంది. వారిలో చాలా మంది సమాజంలోని వారినే వివాహం చేసుకోవడానికి ఇష్టపడతారు. తరచు తమ సాంస్కృతిక సంప్రదాయాల పరిరక్షణకు సీమాంతర వివాహ సంబంధాలను కోరుకుంటుంటారు. ఆర్థిక రంగంలో పని చేసే శైతాన్‌సింగ్‌కు పాకిస్తాన్‌లో బంధువులు ఉన్నారు.