న్న నిజ్జార్, నేడు పన్నున్ ఇద్దరూ సిక్కు వేర్పాటువాద ఖలిస్థానీ ఉగ్రవాదులే. నిజ్జార్ కెనడాలో హత్యకు గురయ్యాడు. పన్నున్‌పై అమెరికాలో హత్యా యత్నం జరిగిందని అభియోగం. ఈ రెండు ఘటనల వెనుక భారత గూఢచారుల హస్తం వున్నదని ఆరోపణ. నిజ్జార్ ఉదంతంపై భారత కెనడా మధ్య వివాదం తీవ్రస్థాయిలోనే నడిచింది. తమ దేశంలో వుండగా నిజ్జార్‌ను భారత శక్తులే హతమార్చినట్టు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో అక్కడి పార్లమెంటులోనే ప్రకటించడం అసాధారణ ప్రకంపనలను సృష్టించింది. దానిని ఇండియా తీవ్రంగా ఖండించింది. 40 మందికి పైగా కెనడా దౌత్య ఉద్యోగులను వెలివేసింది. పరస్పరం వీసాల మంజూరును కూడా ఆపివేశాయి. కాని కెనడా ఇంత వరకు రుజువులు చూపలేదు. ఇందుకు విరుద్ధంగా పన్నున్ విషయంలో భారత అమెరికా సంబంధాలు దెబ్బతినకపోడం గమనార్హం. గుర్‌పత్వంత్ సింగ్ పన్నున్‌కు అమెరికా, కెనడా రెండు దేశాల పౌరసత్వమూ వుంది. ఇతడు పంజాబ్‌లో పుట్టి దశాబ్దాల క్రితం స్వదేశం విడిచిపెట్టాడు. న్యూయార్క్‌లోని ‘ఆర్గనైజేషన్ సిక్స్ ఫర్ జస్టిస్’ సంస్థ అధ్యక్షుడుగా పని చేస్తున్నాడు.
సిక్కు ప్రాంతాలను ఇండియా నుంచి విడదీసి ప్రత్యేక ఖలిస్థాన్‌ను ఏర్పాటు చేసే లక్షంతో 2007లో ఈ సంస్థను పన్నున్ నెలకొల్పాడు. భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడనే కారణం మీద ఈ సంస్థను 2019లో మన ప్రభుత్వం నిషేధించింది. పన్నున్‌ను టెర్రరిస్టుల జాబితాలో చేర్చింది. భారత దేశం వెళొద్దని సిక్కులందరికీ పన్నున్ పిలుపు ఇచ్చాడనే కారణం చూపి భారత దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) ఇతడి మీద ఇటీవల కొత్త కేసు దాఖలు చేసింది. ఇండియా వెళితే మీ ప్రాణాలకు ముప్పు కలుగుతుంది అని పన్నున్ సిక్కులందరినీ హెచ్చరించినట్లు ఒక వీడియో బయటపడింది. ఎందుకు వెళ్లకూడదో కారణాలను అందులో వివరించలేదు. పన్నున్‌పై అమెరికాలో హత్యాయత్నం జరగగా దానిని తమ అధికారులు భగ్నం చేశారని, ఈ హత్యాయత్నం వెనుక భారతీయ శక్తుల హస్తం వున్నదని అనుమానిస్తున్నట్టు భావించడానికి తగిన సమాచారం లభించిందని ఇండియాకు అమెరికా తెలియజేసింది. హత్యాయత్నం జరిగిందా, అటువంటి దానికి సన్నాహాలు జరుగుతున్నట్టు అమెరికా అధికారులకు తెలిసిందా అనేది స్పష్టపడలేదు.
ఈ సమాచారం తమకు ఆశ్చర్యాన్ని, ఆందోళనను కలిగిస్తున్నదని ఇటువంటి ఘాతుకాలకు పాల్పడడం తమ విధానం కాదని, దీనిపై తాము దర్యాప్తు చేస్తామని భారత అధికారులు తమకు చెప్పినట్టు అమెరికన్ అధికారులు వెల్లడించారు. ఇందుకు బాధ్యులైన వారిని వదిలిపెట్టబోమని అమెరికా ప్రభుత్వం స్పష్టం చేసినట్టు కూడా తెలుస్తున్నది. అమెరికా కెనడా మధ్య సన్నిహిత సంబంధాల గురించి ప్రత్యేకించి చెప్పుకోవలసిన పని లేదు. నిజ్జార్ హత్యలో భారత గూఢచారుల హస్తమున్నదని కెనడాకు అమెరికాయే తెలియజేసిందని కూడా గతంలో వార్తలు వచ్చాయి. అందుచేత భారత ప్రభుత్వం ఈ రెండు ఉదంతాల విషయంలోనూ జాగరూకతతో వ్యవహరించవలసి వుంది. అమెరికాతో సంబంధాలు ఊహించనంత వేగంగా పుంజుకొంటున్న నేపథ్యంలో ఇండియా మరింత అప్రమత్తంగా వుండాల్సిన అవసరం గురించి చెప్పనక్కర లేదు. పన్నున్ విషయంలో అమెరికా ఎత్తి చూపుతున్నది వాస్తవమేనా లేక దాని వెనుక వేరే ఎటువంటి వ్యూహమైనా దాగి వుందా క్షుణ్ణంగా తెలుసుకోవలసి వుంది. వాస్తవానికి భారత దేశాన్ని ఇరుకున పెట్టే వ్యూహాలకు తెర తీయడానికి అమెరికా తొందర పడదు. ఎందుకంటే తన చైనా వ్యతిరేక ఎత్తుగడల్లో ఇండియాకు అది అసాధారణ పాత్రను, ప్రాధాన్యతను ఇస్తున్నది.
ఈ విషయం అనేక సందర్భాల్లో రుజువైంది. ప్రధాని మోడీతో విశేష సాన్నిహిత్యాన్ని కాపాడుకోడంలో పూర్వపు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ ఒకే విధంగా వ్యవహరిస్తున్నారు.ఇద్దరూ ఇండియాకు దగ్గరి మిత్రులే. ముఖ్యంగా మోడీకి ఎంతో సన్నిహితంగా వుంటున్నారు. ఆయనకు అపారమైన గౌరవాన్ని ఇస్తున్నారు. ఉక్రెయిన్ యుద్ధం సందర్భంగా అమెరికా, దాని మిత్ర దేశాలు రష్యాను తీవ్రంగా ఖండించి, దానిపై సునిశితమైన ఆంక్షల బాణాలు సంధించగా అందుకు పూర్తి విరుద్ధంగా ఇండియా రష్యాతో సత్సంబంధాలను కాపాడుకొన్నది. రష్యా నుంచి చవక ధరకు, తనకు మేలైన షరతుల మీద క్రూడాయిల్‌ను దిగుమతి చేసుకోడం ప్రారంభించింది. అయినా ఇండియాను అమెరికా తప్పు పట్టలేదు. మనతో సంబంధాలను తెంచుకోలేదు.ఈ నేపథ్యంలో పన్నున్‌పై హత్యాయత్నంలో భారత హస్తం వుందని అమెరికా గట్టిగా నమ్మితే రెండు దేశాల మధ్య సంబంధాలు తాత్కాలికంగానైనా దెబ్బ తినే ప్రమాదం లేకపోలేదు.
ఒకే విషయం మీద కెనడాతో ఒక రకంగానూ, అమెరికాతో మరో విధంగానూ ఇండియా వ్యవహరించడాన్ని తప్పుపట్టడం సుళువే.కాని కెనడా పట్ల చూపిన వ్యతిరేకతను అమెరికా విషయంలో భారత ప్రదర్శించడం అనుకొన్నంత సులభం కాదు. పన్నున్‌పై హత్యాయత్నంలో భారత పాత్రకు సంబంధించి వాస్తవాలు బయటపడాలి.