Monday, December 23, 2024

సమరయోధుల త్యాగఫలం

- Advertisement -
- Advertisement -

వలస పాలన నుంచి మనకు విముక్తి కలిగించి స్వాతంత్య్రం సంపాదించిపెట్టేందుకు ఎన్నో కష్టనష్టాలకు వోర్చి వీరోచిత పోరాటాలు, త్యాగాలు చేసిన అసంఖ్యాక సమరయోధులను, విప్లవవీరులను ఈ సందర్భంగా స్మరించుకుందాం. బ్రిటిష్ పాలన నుండి భారత దేశాన్ని విడిపించడానికి, దేశం స్వేచ్ఛా వాయువులను పీల్చుకోవడం కోసం తమ ప్రాణాలను ధారపోసిన మహనీయులు చేసిన త్యాగాలను ఈ రోజు మనకు గుర్తు చేస్తుంది.

మన జాతి స్వేచ్ఛా వాయువులు పీల్చేందుకు సాగిన ఉద్యమం విజయవంతం కావడానికి, సమాజంలోని అసమానతలు తొలగించేందుకు జరిగిన వీరోచిత పోరాటం. సుదీర్ఘమైన కాలంతో పాటు ప్రజల అనేక పోరాట రూపాల ద్వారా ఉద్యమించడంతో 1947 ఆగస్టు 15 వ తేదీన భారతావనికి స్వాతంత్య్రోదయమయింది. పరాయి పాలన అంతమయింది. దేశమంతా సంకెళ్ళను తెంచుకుని స్వేచ్ఛా భారతం ఆవిర్భవించింది. భారత దేశం దాని చరిత్రలో మౌర్య సామ్రాజ్యం, మొఘల్ సామ్రాజ్యం వంటి అనేక సామ్రాజ్యాల క్రింద ఏకీకృతమైంది. భారత దేశంలో కేంద్రీకృత పరిపాలన చాలా కాలం పాటు కొనసాగినప్పటికీ, యుగయుగాలుగా ఏకత్వ భావన ఉంది. మొఘల్ పాలన ముగింపుతో, భారత దేశం వందలాది రాచరిక రాష్ట్రాలుగా విడిపోయాయి.

మొఘల్ సామ్రాజ్యం పతనంలో కీలక పాత్ర పోషించిన బ్రిటిష్ వారు రాచరిక రాష్ట్రాలపై నియంత్రణను కలిగి ఉన్నారు. బ్రిటిష్ ఇండియన్ సామ్రాజ్యాన్ని సృష్టించారు. అయినప్పటికీ చాలా మంది భారతీయులు దోపిడీ, విదేశీ పాలన పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. బ్రిటిష్ వారు తమ వలస ప్రయోజనాలకే ఎప్పుడూ ప్రాధాన్యత ఇస్తారని, ప్రపంచంలోని ధనిక దేశాల్లో ఒకటిగా ఉండాల్సిన భారత దేశ సంపదను విచ్చలవిడిగా దోచుకొని దేశాన్ని ఆర్థికంగా దెబ్బతీశారు. మన దేశంలోనే మనల్ని బానిసలుగా చేసుకొని అరాచకం సాగించారు. భారత దేశాన్ని కేవలం మార్కెట్‌గా మాత్రమే పరిగణిస్తున్నారని విద్యావంతులైన భారతీయులు గ్రహించారు. వారు భారతదేశ రాజకీయ స్వాతంత్య్రం కోసం వాదించారు.

భారత దేశాన్ని బ్రిటిష్ వారు క్రమక్రమంగా ఆక్రమించుకుంటూ 18వ శతాబ్ది చివరకు దేశంలోని చాలా భాగాన్ని తమ పరిపాలన క్రిందకు, కొన్ని రాజ్యాలను తమ ప్రభావం క్రిందకు తీసుకు వచ్చారు. 19వ శతాబ్ది తొలి నాటికి వారి ఆధిపత్యం పూర్తిగా స్థిరపడిపోయింది. చివరకు 1857లో మొదటి సారిగా విదేశీ పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసింది.
బ్రిటిష్ అధికారానికి వ్యతిరేకంగా దేశం మొత్తం ఏకమైంది. ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం జరిగి భారత సిపాయిలు, రాజులు అందులో ఓడిపోయారు. ఇది ఒక దురదృష్టకర సంఘటన. మన దేశం స్వాతంత్య్రం కోసం సుదీర్ఘ పోరాటాన్ని సాగించింది.
1858 వరకు భారత దేశ సార్వభౌమునిగా మొఘల్ పరిపాలకులే ఉన్నా 19వ శతాబ్ది తొలినాళ్ళ నుండి వారి గౌరవాన్ని తగ్గిస్తూ వచ్చారు. 1858లో బ్రిటిష్ రాణి భారత సామ్రాజ్యధి నేత్రి అయ్యాక దేశం బ్రిటిష్ పాలన కిందకి వచ్చింది. భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చే వరకు మన దేశాన్ని పాలించిన బ్రిటిష్ వారికి భారతీయ పాలన అప్పగించబడింది.

రెండు ప్రపంచ యుద్ధాల తర్వాత బ్రిటన్ బలహీనపడటం ప్రారంభించింది, భారత దేశం చివరకు స్వేచ్ఛను పొందింది. భారత దేశ స్వాతంత్య్ర పోరాటం ప్రపంచంలోనే అత్యంత అహింసాయుత ప్రచారం అయినందున ఇది ఎల్లప్పుడూ ప్రపంచానికి స్ఫూర్తిదాయకంగా ఉంది. స్వాతంత్య్ర దినోత్సవ చరిత్ర బ్రిటిష్ వలస పాలకులు భారత్‌కు 1947 ఆగస్టు 15న స్వాతంత్రం ఇచ్చారు. అయితే అంతకుముందే జులై 4 1947న బ్రిటిష్ పార్లమెంట్‌లో ఇండియన్ ఇండిపెండెన్స్ బిల్‌ను ప్రవేశపెట్టారు. ఆ తరువాత జులై 18 1947లో ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ రూపొందింది. తప్పనిసరి పరిస్థితుల్లో బ్రిటిష్ ప్రభుత్వం భారత్‌లో అధికారాన్ని వదులుకుంది.

ఆగస్టు 15 1947లో భారత్‌కు స్వాతంత్య్రం లభించింది. నాటి నుంచి ప్రతి సంవత్సరం ఆగస్టు 15న జెండా వందనం చేసి భారతీయులంతా స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకొంటున్నారు. భారత జాతీయ జెండాను ఆంధ్రప్రదేశ్‌కు చెందిన స్వాతంత్య్ర సమర యోధుడు పింగళి వెంకయ్య రూపొందించారు. ఆగస్టు 15 1947న పండిట్ జవహర్ లాల్ నెహ్రూ స్వాతంత్య్ర భారతంలో తొలిసారి రెడ్ ఫోర్ట్‌లోని లాహోరీ గేటు వద్ద జాతీయ జెండాను ఎగుర వేశారు. భరత మాతను ఈ రోజు బ్రిటిషర్ల కాలనీ అంతం అయిన జ్ఞాపకార్థం. 200 ఏళ్ల తర్వాత బ్రిటిష్ వారు దేశం విడిచి వెళ్లిపోయారు. ఎందరో దేశ స్వాతంత్య్రం కోసం తమ ప్రాణాలనే త్యాగం చేశారు. బ్రిటిష్ సామ్రాజ్యాధికారుల నుండి దాస్య విముక్తి గావించడం కోసం ఎందరో వీరాధివీరులు, మహనీయులు తమ ప్రాణాలొడ్డి జీవితాలను అర్పించారు.అందులో చక్రవర్తులు, సాయుధ వీరులు, యువకులు. 1947 నుండి ప్రతి సంవత్సరం, ఆగస్టు 15 భారత స్వాతంత్య్ర దినోత్సవం స్వేచ్ఛ, స్వాతంత్య్రం నిజమైన స్ఫూర్తిని నింపుతుంది.

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా నిలబడి భారత దేశాన్ని వలస పాలన నుండి విముక్తి చేయడానికి తమ జీవితాలను త్యాగం చేసిన స్వాతంత్య్ర సమరయోధులకు నివాళి. స్వాతంత్య్ర సాధించడానికి మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, జవహర్ లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఒకరు కాదు ఇద్దరు కాదు ఇలా ఎంతో మంది సమర యోధులు వారి ప్రాణాలకు సైతం తెగించి పోరాడారు. బ్రిటిష్ వారిని ఎదిరించినందుకు ఎంతో మంది జైల్లో మగ్గిపోయారు, చాలా మంది ప్రాణాలు కోల్పోయారు.

ఈ రోజు మనం అనుభవిస్తున్న ఈ స్వేచ్ఛ స్వాతంత్య్రం ఆ సమరయోధులు త్యాగ ఫలితమే. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా అలాంటి గొప్పవీరులకు వారి త్యాగాలకు కృతజ్ఞతలు తెలుపుకుందాం. భారత దేశంలోని ఇతర పౌరులలో జాతీయ భావాన్ని వ్యాప్తి చేయడానికి ఇది జాతీయ కార్యక్రమం. ఇది ప్రతి పౌరునిలో గర్వం, దేశభక్తి భావాన్ని కలిగిస్తుంది. స్వాతంత్య్రం సాధించడం ఎంత ముఖ్యమో వచ్చిన స్వాతంత్య్రాన్ని సరిగా ఉపయోగించుకోవడం కూడా అంతే ముఖ్యం. మనం వారికి ఇచ్చే ఘనమైన నివాళులు. భావి స్వర్ణ భారతానికి మన వంతుగా బాధ్యత వహిద్దాం. డా. బిఆర్ అంబేడ్కర్ అన్నట్టుగా దేశం అభివృద్ధి చెందడమంటే అద్దాల మేడలు, రంగుల గోడలు కాదు.. మనం తినే ఒక్కో మెతుకు ఎంతో మంది త్యాగ ఫలితం అని గుర్తుంచుకోవాలి. ఈ ఒక్క రోజే కాకుండా వారికి పోరాట స్ఫూర్తి నిరంతరం మన గుండెల్లో ఉండాలని ఆకాంక్షిస్తూ పౌరుని నైతికాభివృద్ధే నిజమైన దేశాభివృద్ధి. జై హింద్. జై భారత్.

తీగల అశోక్ కుమారు- 7989114086

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News