Saturday, December 21, 2024

వజ్రోత్సవ వేళ

- Advertisement -
- Advertisement -

Indian Independence Day Diamond Celebrations

భారత స్వాతంత్య్ర దిన వజ్రోత్సవాలను ఘనాతిఘనంగా జరుపుకుంటున్నాం. దేశం మువ్వన్నెల జెండాల ఉవ్వెత్తు ఉప్పెనగా మారిపోయింది. బ్రిటిష్ వలసపాలకుల నుంచి 75సంవత్సరాల క్రితం పొందిన స్వేచ్ఛను తలచుకొని మురిసిపోతున్నాం. స్వాతం త్య్రం వచ్చిన తర్వాత పుట్టిన ఆదివాసీ మహిళను దేశ అత్యున్నత రాజ్యాంగ పీఠమైన రాష్ట్రప తి పదవికి ఎన్నుకొన్నాం. యుద్దాలను, కరువు కాటకాలను, కొవిడ్ మృత్యు మహమ్మారిని ఎదుర్కొని ముందుకు సాగుతున్న జాతి స్వాతంత్య్ర అమృతోత్సవాలను జరుపుకుంటున్న ఈ క్షణాలు చరిత్రాత్మకమైనవి. ఇంత గొప్ప శుభవేళ కొట్ట వచ్చినట్టు కనిపిస్తున్న కొన్ని ప్రత్యేక తలను ప్రస్తావించుకోవలసి ఉంది. దేశాన్ని పాలిస్తున్న భారతీయ జనతా పార్టీకి స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్న చరిత్ర లేదు. ఆ ఉద్యమాన్ని అహింసాయు తంగా నడిపి ప్రపంచ ప్రసి ద్ధికెక్కిన మహాత్మా గాంధీని బలిగొన్న వ్యక్తిని మంత్రించిన శక్తులతో దాని సాన్నిహిత్యం సుస్ప ష్టం. అయినా ప్రజలు ఎన్నుకొన్న పాలకపక్షంగా స్వాతంత్య్ర దిన వజ్రోత్సవాలను జరిపించడాన్ని ఆక్షేపించలేము. అదే సమయంలో ఆ ఉద్యమ స్ఫూర్తి, దాని ఆశయాలపట్ల నిజాయితీ నిబద్ధతలు దానిలో ఎంతవరకు ఉన్నాయనేది చర్చించుకోదగిన అంశం.

ఎందుకంటే అది దేశ భవిష్యత్తుతో ముడిపడి ఉన్న ముఖ్యమైన కోణం. మన స్వాతంత్య్ర ఘట్టానికి ప్రధానంగా మూడు విశిష్ట పార్శ్వాలు కనిపిస్తాయి. అవి గాంధీజీ, అంబేడ్కర్, స్వాతంత్య్రం. ఈ మూడింటినీ సొంతం చేసుకొనే కార్యక్రమా లను బిజెపి ఘనంగా చేపట్టింది. బలప్రయోగానికి కూడా వెనుకాడకుండా పూర్వపు సంస్థానాలను స్వతంత్ర భారత దేశంలో విలీనం చేసిన ఘనతను గుజరాతీ నేత వల్లభభాయ్ పటేల్ ఖాతాలో వేసి ఆయనను వినుతించే బిజెపి అదే రాష్ట్రానికి చెందిన గాంధీజీని సొంతం చేసుకోడానికి విశేష ప్రాధాన్యమిచ్చింది. ఆయన150వ జయంతి సందర్బంగా నెలరోజులపాటు బిజెపి చేపట్టిన గాంధీ సంకల్ప యాత్రలో ఇది ప్రస్ఫుటమైంది. గాంధీ నిజమైన వారసత్వం తనదేనని ఆ సమయంలో అది ప్రకటించుకొన్నది. బిజెపిని గాంధీ నిజమైన వారసురాలుగా సుస్థిరపరచడానికి ఇదొక మంచి అవకాశమని ఆ సందర్బంగా పార్టీ ఎంపిలు, ఎంఎల్‌ఎలకు, కార్యవర్గాలకు రాసిన లేఖలో పేర్కొన్నది. గాంధీ సర్వోదయను తమ అంత్యోదయతో, ఆయన ప్రీతి పాత్రంగా చూసిన పారిశుధ్ధ్యాన్ని మోడీ స్వచ్ఛ భారత్‌తో, స్వదేశీ ఉద్యమాన్ని మేక్ ఇన్ ఇండియాతో పోల్చి ప్రచారం చేశారు.

స్వాతంత్య్ర పోరాటానికి సమాంతరంగా అంబేడ్కర్ సామాజిక న్యాయ యుద్ధం చేశారు. అంటరానితనం అగ్నికీలల్లో దహించుకుపోతున్న తన వర్గానికే కాకుండా దేశ జనాభాలో మెజారిటీగా ఉన్న అణగారిన వర్గాలకు దారిదీపమయ్యారు. అంబేడ్కర్ గొప్ప చదువరి, మహా మేధావి. ఈ జాతి ఆత్మ. ఆయననుకూడా తన వాడిగా చూపించే కార్యక్రమాన్ని బిజెపి భారీగా చేపట్టింది. రాజ్యాంగ దినోత్సవాన్ని నవంబర్ 26న అట్టహాసంగా జరిపించడం ద్వారా 2015లో ఈ పని చేసింది. అంతకు ముందే రిజర్వేషన్ల విధానాన్ని సమీక్షించాలని ఆర్‌ఎస్‌ఎస్ అధినేత మోహన్ భగవత్ తన మన సులోని కోరికను వెలిబుచ్చారు. ఆ కఠోర వాస్తవానికి వెల్ల వేసే వ్యూహంగానే రాజ్యాంగోత్సవాన్ని జరిపిం చారనే అభిప్రాయం కలిగింది. నవభారత నిర్మాతగా ప్రశంసలు అందుకున్న తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూను ఉద్దేశపూర్వకంగా పక్కన పెట్టడం ఇప్పటికీ సాగుతున్నది. ఇప్పుడు మహోన్నత స్వాతంత్య్ర సమర ఘట్టాన్నే తనదిగా బిజెపి చూపుకుంటోంది.

కేంద్ర ప్రభుత్వం అందుకు అసాధారణ ఏర్పాట్లు జరి పింది. ప్రతి ఇంటి మీద జాతీయ పతాకం ఎగిరేలా చూస్తున్నది. గతంలో ఏ స్వాతంత్య్ర దినం నాడూ చూడనంత వైభవం కళ్లు మిరుమిట్లు గొల్పుతున్నది. అయితే స్వాతంత్య్రమంటే జాతీయ పతాకం ఎగుర వేయడం, జాతీయ గీతం ఆలపించడం మాత్రమే కాదు. స్వాతంత్య్ర సమరం దేశానికి అపురూపమైన కానుకను ఇచ్చింది, ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలతో కూడిన ప్రజాస్వామిక రాజ్యాంగాన్ని ప్రసా దించింది. పౌరులకు వ్యక్తి స్వేచ్ఛ, జీవన హక్కు ఉండి తీరాలని అది నిర్దేశిస్తున్నది. ఉచ్ఛనీచాల తేడాలేని సమానత్వం నెలకొనాలని నిర్దేశించింది. ఫెడరల్ వ్యవస్థ వర్ధిల్లాలంటూ పరిపాలనకు అన్ని స్థాయిల్లో హేతుబద్ధమైన పరిమితులను విధించింది, వా స్తవంలో ఏమి జరుగుతున్నదనేదే రాజ్యాంగ ఆశయాలపట్ల దేశ ప్రస్తుత పాలకులకు గల మక్కువను చాటుతుంది.

ఇండియా టుడే పత్రిక తాజాగా నిర్వహించిన ‘మూడ్ అఫ్ ది నేషన్’ (ప్రజల అంతరంగం )లో 51 శాతం మంది మోడీ ప్రభుత్వ ఆర్ధిక విధానాలు బడావ్యాపారులకే మేలు చేస్తున్నాయని చెప్పారు. ఇదే అసలు సంగతిని బయటపెడుతున్నది. స్వాతం త్య్రం అనే గ్రంథానికి వాక్స్వాతంత్య్రం ముందుమాట వంటిది. దాని చిరునామా ఇప్పుడు గల్లంతయింది. స్వతంత్ర భారతంలో అన్ని కులాలు, మతాల వారు పరిపూర్ణ సామరస్యంతో జీవించాలని మహాత్ముడు కోరుకున్నారు. దేశ బహుళతను పెంపొందించాలని ఆశించారు. అందుకు పూర్తి వ్యతిరేకంగా సాగుతున్న వర్తమానం ఏ స్వాతంత్య్రాన్ని హామీ ఇస్తున్నది? సైద్ధాంతిక, రాజకీయ ప్రత్యర్థులపై పగ తీర్చుకోడానికే అధికార సర్వస్వాన్ని వినియోగిస్తున్న బిజెపి స్వాతంత్య్ర సాధన మౌలిక విలువలను అటకెక్కించింది. ఈ వైభవోత్సవ వేళ ఇంతకంటే చెప్పుకోవలసిందేముంటుంది?

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News