సాధారణంగా భారీ వర్షాలు కురిస్తే (వారంలో 150 మి.మీ కంటే ఎక్కువ) వరదల ప్రభావంతో దోమల గుడ్లు, లార్వా కొట్టుకుపోయి డెంగ్యూ కారక వ్యాప్తి తగ్గిపోవడం సహజం. అయితే వానపడడం, విరామం ఇవ్వడం, మళ్లీ కురవడం, తిరిగి ఆగిపోవడం ఈ రుతుపవన మార్పులు డెంగీ దోమల వృద్ధికి దోహదపడుతున్నాయని తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. 27 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు, మధ్యస్థ వర్షాలు, తేమ 60 నుంచి 78 శాతం నమోదవడం డెంగీ కేసులు అధికం కావడానికి కారణమవుతున్నాయి. జూన్ సెప్టెంబర్ మధ్య ఇలాంటి వాతావరణం ఏర్పడుతుండడంతో డెంగీ కేసులు భారీగా పెరిగే పరిస్థితి ఏర్పడుతోందని అధ్యయనాలు చెబుతున్నాయి.
వాతావరణ మార్పులకు, డెంగీ కేసుల పెరుగుదలకు మధ్య దగ్గరి సంబంధం ఉందని పుణెలోని భారత ఉష్ణమండల వాతావరణ పరిశోధన సంస్థ (ఐఐటిఎం) వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న డెంగీ కేసుల్లో మూడోవంతు భారత్‌లోనే ఉండడం ఆందోళన కలిగిస్తోంది. పుణెలో ఉష్ణోగ్రతల ఆధారంగా నిర్వహించిన అధ్యయనంలో అనేక విశేషాలు వెలువడ్డాయి. ఒక వారంలో 150 మి.మీ వరకు మితంగా వర్షాలు కురిసినప్పుడు డెంగీ కేసులు పెరుగుతుండడాన్ని పరిశోధకులు గుర్తించారు. పుణెలో వర్షాకాలంలో సగటు ఉష్ణోగ్రత 27 నుంచి 35 డిగ్రీల సెల్సియస్ వరకు ఉండటం డెంగీ దోమల వ్యాప్తికి అనుకూలమవుతోంది.
దేశంలో ప్రజారోగ్య విభాగాలు నివేదించే కేసుల కన్నా వాస్తవ కేసుల సంఖ్య 282 రెట్లు అధికంగా ఉందని పరిశోధకులు తెలుసుకున్నారు. అందుకని డెంగీ ప్రాబల్యాన్ని రెండు నెలల ముందుగా గుర్తించడానికి కేసులను, మరణాలను తగ్గించడానికి స్థానిక సంస్థలు, ఆరోగ్యశాఖ ముందస్తుగా సన్నద్ధం కావడానికి, ఆ మేరకు ప్రణాళికలు రూపకల్పనకు ఈ అధ్యయనం దోహదపడుతుందని పరిశోధకులు చెబుతున్నారు. గత రెండు దశాబ్దాలుగా ప్రపంచ వ్యాప్తంగా డెంగ్యూ వ్యాప్తి ఎక్కువగానే పెరిగింది. 2000 నుంచి 2019 వరకు 5,00,000 నుంచి 50,00,000 వరకు కేసుల సంఖ్యలో పది రెట్లు పెరుగుదల కనిపించిందని ప్రపంచ ఆరోగ్యసంస్థ వెల్లడించింది.
2019 సంవత్సరంలో 129 దేశాల్లో డెంగ్యూ కేసులు వ్యాపించాయి. కొవిడ్ మహమ్మారి వ్యాపించిన సమయంలో ఈ కేసుల నమోదు సరిగ్గా కాకపోయినప్పటికీ, 2023 నుంచి ఈ కేసులు అనూహ్యంగా పెరుగుతూనే ఉన్నాయి. 80 కి పైగా దేశాల్లో 5 మిలియన్ల కన్నా ఎక్కువ కేసులు నమోదై, 5000 కంటే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయారు. 2023 లో డెంగ్యూ కేసులకు అత్యంత ప్రభావితమైన దేశాల్లో బుర్కినాపానో ఒకటి. అమెరికాలో 2023 జనవరి 1 నుంచి 2023 డిసెంబర్ 11 వరకు మొత్తం 4.1 మిలియన్ డెంగ్యూ కేసులు నమోదు కాగా, 2049 మంది చనిపోయారు.
దక్షిణ అమెరికా, మెక్సికో, ఆగ్నేయాసియాలోని పది దేశాల్లో డెంగ్యూ స్థానికంగా పాతుకుపోయింది. 2023లో బంగ్లాదేశ్, థాయ్‌లాండ్‌తో సహా అనేక దేశాల్లో డెంగ్యూ కేసులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉష్ణమండల వాతావరణంలో పట్టణ ప్రాంతాల్లో డెంగ్యూ కేసులు వ్యాపిస్తున్నాయి. ఈ డెంగ్యూ వ్యాప్తికి కారణమైన ఈడెన్ దోమలను నాశనం చేయడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇంటెగ్రేటెడ్ వెక్టర్ మేనేజ్‌మెంట్ (ఐవిఎం)ను ప్రోత్సహిస్తోంది. తీవ్రమైన కడుపు నొప్పి, వాంతులు, ఉక్కిరిబిక్కిరిగా శ్వాసతీసుకోవడం, చిగుళ్లు లేదా ముక్కు నుంచి రక్తస్రావం, అలసట, విశ్రాంతి లేకపోవడం, వాంతి లేదా మలం లోంచి రక్తం చిమ్మడం, అధిక దాహం, శరీరం చల్లబడి రంగుమారడం ఇవన్నీ డెంగ్యూ లక్షణాలుగా వైద్యులు చెబుతున్నారు.
తీవ్రమైన డెంగ్యూ జ్వరం వల్ల అవయవాలు దెబ్బతింటాయి. అంతర్గత రక్తస్రావం కలుగుతుంది. రక్తపోటు ప్రమాదకర స్థాయికి పడిపోతుంది. కొన్ని సందర్భాల్లో తీవ్రమైన డెంగ్యూ జ్వరం మరణానికి కూడా దారి తీస్తుంది. గర్భధారణ సమయంలో మహిళలకు డెంగ్యూ జ్వరం సోకితే డెలివరీ సమయంలో శిశువుకు వైరస్ ప్రసారం అయ్యే పరిస్థితి ఏర్పడవచ్చు. ఆ శిశువులు ప్రీమెచ్యూరిటీ, తక్కువ బరువుతో లేదా పిండం బాధకు గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. డెంగ్యూ వైరస్ రక్తంలో ప్లేట్‌లెట్స్‌ను నాశనం చేయనప్పటికీ, ప్లేట్‌లెట్ కౌంట్, పనితీరును దెబ్బతీసే సమస్యలను ప్రేరేపిస్తుంది.
ఆరోగ్యవంతమైన వ్యక్తికి 1,50,000 4,50,000 ప్లేటెలెట్స్/ యుఎల్ వరకు ఉంటుందని అంచనా. అయితే డెంగ్యూ వైరస్ సోకితే ప్లేట్‌లెట్ కౌంట్ 40,000 ప్లేట్‌లెట్స్ / యుఎల్ కంటే తక్కువ స్థాయికి పడిపోవచ్చు. ఇది సాధారణంగా డెంగ్యూ జ్వరం సంక్రమించిన మూడు నాలుగు రోజుల్లో సంభవిస్తుంది. సహ అనారోగ్యాలు, రోగ నిరోధక శక్తి, వయస్సు కూడా ప్లేట్‌లెట్ నష్టాన్ని పెంచుతాయి. అవసరమైతే సాధారణ రక్తమార్పిడి ప్లేట్‌లెట్ కౌంట్‌ను పెంచుతుంది. ఈ చికిత్సలకు అదనంగా ప్లేట్‌లెట్ కౌంట్‌ను మెరుగుపర్చడానికి కావలసిన ఉత్తమ మార్గాల్లో ఆహారంలో రికవరీకి సహాయపడే ఆహార పదార్థాలను చేర్చడం. బొప్పాయి ఆకు సారం, ఆకు కూరలు, పండ్లు, ఐరన్ పుష్కలంగా లభించే ఆహార పదార్థాలు, విటమిన్ సి, విటమిన్ కె అధికంగా ఉండే ఆహారాలు, సప్లిమెంట్స్, ఆరోగ్యకరమైన ప్లేట్‌లెట్స్ కౌంట్‌ను పెంచుతాయి.
డెంగ్యూ ఇన్‌ఫెక్షన్ చికిత్సకు నిర్దిష్టమైన ఔషధం అంటూ లేదు. డెంగ్యూ జ్వరం ఉందని అనుకుంటే విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం. అలాగే పుష్కలంగా ద్రవాలు తీసుకోవాలి. మూత్రవిసర్జన తగ్గడం, నోరు లేదా పెదవులు పొడిబారడం, నీరసం లేదా గందరగోళం, జలుబు, చేతులు, కాళ్లు బిగుసుకుపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. ప్రస్తుత అధ్యయనాల ప్రకారం రానున్న జూన్ సెప్టెంబర్ మధ్య కాలంలో డెంగ్యూ వ్యాపించే అవకాశాలు ఉన్నందున ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలని, ఇంటి పరిసర ప్రాంతాల్లో నీరు నిల్చిపోకుండా పారిశుద్ధం, పరిశుభ్రత చక్కగా ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు.
– డాక్టర్ బి. రామకృష్ణ