Saturday, November 16, 2024

గ్లోబల్ మార్కెట్‌లో భారత ఐటి కంపెనీలే మిన్న

- Advertisement -
- Advertisement -

బీజింగ్ : గ్లోబల్ మార్కెట్‌లో భారతీయ ఐటి కంపెనీలు చైనా ఐటి కంపెనీల కన్నా బాగా ముందున్నాయని చైనాకు చెందిన ప్రముఖ ఐటి నిపుణులు మైక్ లియూ తెలిపారు. మైక్ ది రైజ్ ఆఫ్ ఇండియన్ ఐటి అనే పుస్తకం రాశారు. ఆయన గతంలో చైనాలో ఇన్ఫోసిస్ హెడ్‌గా పనిచేశారు. ఐటి మార్కెట్‌లో భారతీయ కంపెనీలదే మొత్తం మీద చూస్తే పై చేయిగా ఉన్నా, చైనా కంపెనీలు కృత్రిమ మేధ, ఆటోనోమస్ డ్రైవింగ్, ఇ కామర్స్, క్లౌడ్ సర్వీసు వంటి రంగాలలో తమ ఆధిపత్యం చూపుతున్నాయని, ఇవి మార్కెట్ విస్తరణ దిశలోని రంగాలని తెలిపారు. భారతీయ ఐటి కంపెనీలు ఎక్కువగా ఔట్‌సోర్సింగ్ ద్వారా ఆదాయాలు పొందుతున్నాయి, అయితే చైనా ఐటి కంపెనీలు ఎక్కువగా గృహ సంబంధిత ఐటి అవసరాలపై దృష్టి కేంద్రీకరిస్తున్నాయి.

చైనా ఐటి కంపెనీల ఆదాయంలో 95 శాతానికి పైగా ఈ గృహ, వ్యక్తిగత ఐటి డిమాండ్స్‌ను తీర్చడంతోనే సమకూరుతోంది. అయితే ఇండియన్ సాఫ్ట్‌వేర్ కంపెనీలు చైనా సంస్థలతో పోలిస్తే గ్లోబల్ ఐటి మార్కెట్‌లో చాలా ముందుకు వెళ్లాయని ఈ ఐటి నిపుణులు తమ పుస్తకంలో పేర్కొన్నారు. ఇన్ఫోసిస్‌లో ఏళ్ల తరబడి పనిచేసిన అనుభవం ఉన్న మైక్ తమ పుస్తకం ఆవిష్కరణకు ముందు ఇందులోని కీలక విషయాలను సూచనప్రాయంగా వివరించారు. ఇటీవలే ఈ పుస్తకం చైనా భాషలో వెలువడింది. కాగా ఇప్పుడు దీని ఆంగ్ల తర్జుమా త్వరలో అంతర్జాతీయ స్థాయిలో ముందుకు రానుంది.

చైనా ఐటి కంపెనీలు మరింతగా రాణించాలంటే ఇవి ఎక్కువగా వాటి దృక్పధం గురించి విశ్లేషించుకోవల్సి ఉంటుంది. యాజమాన్య నిర్వహణ, ఉద్యోగులతో వ్యవహారశైలి వంటి వాటిలో ఎంతో నేర్చుకోవల్సి ఉందని తెలిపారు. ఐటి టెక్నాలజీ, ఇన్నోవేషన్‌లో చైనాదే పై చేయిగా ఉందని ఈ పుస్తకంలో తెలిపినట్లు పుస్తక రచయిత అయిన ఈ ఐటి నిపుణుడు తెలిపారు. గ్లోబల్ మార్కెట్‌లో భారత్ ఐటి కంపెనీలను దాటాలంటే చైనా కంపెనీలకు చాలా కాలం పడుతుందని విశ్లేషించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News