Sunday, January 19, 2025

తెలంగాణ ఉద్యమ సాధనలో” కలం” వీరులు: ఎంఎల్ సి కవిత

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : తెలంగాణ ఉద్యమ సాధనలో ప్రతి అడుగులో కలం వీరులు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావుతో నడిచారని బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత అన్నారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు.ఆదివారం పటాన్‌చెరులోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన టియుడబ్ల్యూజె రాష్ట్ర ద్వితీయ మహాసభలు, ఇండియన్ జర్నలిస్టు యూనియన్ (ఐజెయు) 10వ ప్లీనరీలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్బంగా కవిత మాట్లాడుతూ, మీడియా సంస్థల విశ్వసనీయతతో పాటు, ప్రసారం చేస్తున్న వ్యక్తులకు సైతం నిబద్దత ఉండాలన్నారు. అప్పుడే ప్రసారం చేసే వార్తల పట్ల ప్రజల్లో విశ్వాసం కలుగుతుందన్నారు.అనేక కొందరు వ్యక్తుల కారణంగా సమాజంలో వార్తల మీద విశ్వాసం కోల్పోయే పరిస్థితి వచ్చిందని చెప్పుకోవడం బాధాకరమన్నారు.

కొన్ని సంస్థలు కావాలనే తెలంగాణకు వ్యతిరేకంగా వార్తలు రాస్తూ, ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని ప్రయత్నిస్తున్నాయని ఆమె ఆరోపించారు. ఇలాంటి కుట్రల పట్ల జర్నలిస్టులు సైతం ఆలోచించాలని కవిత పేర్కొన్నారు. గత తొమ్మిదేండ్లలో ప్రధాని నరేంద్ర మోడీ ఒక్కసారి కూడా మీడియా సమావేశం నిర్వహించలేదన్న ఆమె… దీనిపై ఒక్క జర్నలిస్టు యూనియన్ కూడా ఎందుకు ప్రశ్నించలేదన్నారు. కాగా సిఎం కెసిఆర్ వందలాది మంది జర్నలిస్టులతో మీడియా సమావేశం నిర్వహించి, విలేఖరులు అడిగిన ప్రతి ప్రశ్నకూ సమాధానం చెబుతున్నారన్నారు. అలాగే ఆ సమస్యలకు పరిష్కారం కూడా చూపిస్తారని కవిత వ్యాఖ్యానించారు.నేటి ప్రస్తుత తరుణంలో రాజకీయ నేతలకు పారదర్శకత, నిబద్దత మరింతగా ఉండాలని కవిత అన్నారు.

తెలంగాణ రాష్ట్రం జర్నలిస్టులకు రూ.100 కోట్ల నిధులు కేటాయించినట్లుగానే, కేంద్ర ప్రభుత్వం సైతం జర్నలిస్టులకు నిధులు కేటాయించేలా ఇండియన్ జర్నలిస్టు యూనియన్ (ఐజేయూ) కేంద్రాన్ని డిమాండ్ చేయాలన్నారు. ఇందుకు బిఆర్‌ఎస్ పార్టీ సైతం మద్దతుగా నిలుస్తుందని కవిత తెలిపారు. జర్నలిస్టుకు ఇండ్ల స్థలాల కేటాయింపు అంశాన్ని సిఎం కెసిఆర్ దృష్టికి తీసుకెళ్తానని కవిత పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్, ప్రెస్ అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణతో పాటు అన్ని జిల్లాల నుండి జర్నలిస్టులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News