Sunday, January 5, 2025

ప్రేమ, పెళ్లి కోసం పాకిస్థాన్‌లోకి చొరబడి అరెస్టయిన భారతీయుడు

- Advertisement -
- Advertisement -

తన ఫేస్‌బుక్ ఫ్రెండ్ అయిన ఓ యువతిని కలుసుకుని, పెళ్లి చేసుకుందామని పాకిస్థాన్‌లోకి అక్రమంగా చొరబడిన ఓ భారతీయుడు చివరికి జైలు పాలయ్యాడు. విశేషమేమిటంటే ఆ యువతి అతడిని పెళ్లిచేసుకోవాలని అనుకోవడం లేదని అక్కడి స్థానిక పోలీసులకు తెలిపింది. వివరాల్లోకి వెళితే ఉత్తర్‌ప్రదేశ్‌లోని అలీగఢ్ జిల్లాకు చెందిన బాదల్ బాబు పాకిస్థాన్ పంజాబ్ ప్రాంతంలోని మండీ బహావుద్దీన్ జిల్లాలోకి చెందిన మౌంగ్ గ్రామంలోకి గత వారం చొరబడ్డాడు. అతడు అక్రమంగా పాకిస్థాన్‌లోకి ప్రేమ, పెళ్లి కోసం చొరబడ్డాడు. దాంతో అక్కడ పోలీసులు అతడిని అరెస్టు చేశారు. బాదల్ బాబు స్టేట్‌మెంట్‌ను అక్కడి పోలీసులు రికార్డు చేశారు. తాను తన ఫేస్‌బుక్ స్నేహితురాలు సనా రాణి(21)ని కలుసుకోడానికి పాకిస్థాన్‌లోకి చొరబడ్డానని, తనను ఆమె పెళ్లి చేసుకుంటానని వాగ్దానం చేసిందని తెలిపాడు. కానీ సనా రాణి మాత్రం తాము రెండేన్నర ఏళ్లుగా ఫేస్‌బుక్ స్నేహితులమని, కానీ తనకు అతడిని పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం లేదని స్పష్టం చేసింది.

ఈ వివరాలను పాకిస్థాన్‌లోని పంజాబ్ పోలీస్ అధికారి నశీర్ షా పిటిఐ వార్తా సంస్థకు తెలిపారు. కాగా బాబు, రాణిని కలిశాడా? అని అడిగినప్పుడు ఆ విషయం ధ్రువీకరించుకుని చెబుతామని ఆ పోలీసు అధికారి వివరించారు. పోలీసుల బలవంతంపైన సనా రాణి తాను అతడిని పెళ్లి చేసుకోదలచుకోలేదని చెప్పిందా? అన్నది స్పష్టం కావలసి ఉంది. అయితే పాకిస్థాన్ విదేశీ చట్టం సెక్షన్లు 13, 14 కింద తగిన ట్రావెలింగ్ డాక్యుమెంట్లు లేకుండా పాకిస్థాన్‌లోకి వచ్చినందుకు బాబును అక్కడ అరెస్టు చేశారు. తర్వాత అతడిని కోర్టు ముందు హాజరు పరిచారు. కాగా కోర్టు అతడికి 14 రోజుల జుడీషియల్ కస్టడీ విధించింది. తదుపరి విచారణ జనవరి 10న జరుగనున్నది. ఇదివరలో అంజు అనే ఓ భారతీయురాలు పాకిస్థాన్‌లోకి వెళ్లి ఇస్లాం మతం స్వీకరించి, పాకిస్థానీని పెళ్లిచేసుకుంది. గత ఏడాది సీమా హైదర్ అనే ఓ పాకిస్థానీ యువతి పబ్‌జి గేమ్ ద్వారా ఓ భారతీయుడితో స్నేహం చేసి తన నలుగురు పిల్లల ద్వారా నేపాల్ గుండా ఇండియాలోకి వచ్చి అతడిని పెళ్లి చేసుకుంది. ఇదేవిధంగా ఇఖ్రా జివానీ ఆన్‌లైన్ గేమ్ ద్వారా ములాయం సింగ్ యాదవ్ అనే 25 ఏళ్ల యువకుడితో స్నేహం చేసుకుని తర్వాత నేపాల్‌లో పెళ్లి చేసుకుంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News