లోకేషన్ సంబంధిత జిపిఎస్ సిగ్నల్ లోపంతో తెలంగాణకు చెందిన షెహజాద్ అనే వ్యక్తి సౌదీ అరేబియాలో దుర్మరణం చెందాడు. సూడాన్ జాతీయుడు ఒక్కడితో కలిసి ప్రయాణిస్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ సూడానీ కూడా చనిపోయ్యాడు . సౌదీ అరేబియాలోని రబ్ అల్ ఖాలీ ఎడారులలో కరీంనగర్‌కు చెందిన మెహమ్మద్ షెహజాద్ సంచరిస్తూ ఉండగా సాంకేతిక లోపాలతో జిపిఎస్ నిలిచిపోవడంతో ఆయన మరో వ్యక్తితో ఎడారిలో చిక్కుపడి ఈ క్రమంలో అత్యంత ప్రమాదకర ప్రాంతంలో అలసిపోయి డిహైడ్రేషన్‌తో చనిపోయినట్లు వెల్లడైంది. సౌదీలోని ఓ టెలికమ్యూనికేషన్స్ కంపెనీలో ఈ 27 ఏండ్ల యువకుడు మూడేళ్లుగా పనిచేస్తున్నాడు.
650 కిలోమీటర్ల విస్తారిత ఈ సంక్లిష్ట ఎడారిలో దారితప్పితే ప్రాణాంతకం అవుతుంది. అత్యంత వేడి, ఈదురుగాలులు ఉండే ప్రాంతం, సౌదీ అరేబియా దక్షిణ ప్రాంతం నుంచి పొరుగుదేశాల వరకూ ఇది వ్యాపించి ఉంటుంది. జిపిఎస్ సిగ్నల్ లేకపోవడం, సెల్ ఫోన్ ఆగిపోవడంతో ఇద్దరూ ఎవరికి తమ దుస్థితి తెలియచేయలేకపొయ్యారు. ఎర్రటి ఎండలు, ఆకలిదప్పులతో డస్సిపోయిన స్థితిలో స్పృహ తప్పి చనిపోయినట్లుగా ఆ తరువాత నిర్థారణ అయింది.. వీరు ఎప్పుడు చనిపోయారనేది తెలియలేదు. అయితే వీరి మృతదేహాలను ఇసుక తెన్నెల మధ్య వీరి వాహనం సమీపంలోనే గుర్తించారు.