ఉప్పొంగిన భారత్.. హాకీలో నయా చరిత్ర
దశాబ్దాల నిరీక్షణకు తెర, మన్‌ప్రీత్ సేనకు కాంస్యం
సంబరాల్లో మునిగిన దేశం, హాకీ వీరులకు నీరాజనం
టోక్యో: భారత పురుషుల హాకీ జట్టు సాధించిన ఒకే ఒక చారిత్రక విజయంతో కోట్లాది మంది భారతీయుల హృదయాలు పులకించి పోయాయి. అఖండ భారతావని మురిసిపోయింది. భారత హాకీలో సరికొత్త చరిత్ర ఆవిష్క్రతమైంది. టోక్యో ఒలింపిక్స్‌లో త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. దేశ వ్యాప్తంగా చెక్‌దే ఇండియా నినాదాలు మార్మోగి పోయాయి. గురువారం కాంస్యం కోసం జరిగిన పోరులో భారత్ 54 గోల్స్ తేడాతో జర్మనీపై విజయం సాధించింది. ఈ విజయంతో 41 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ ఒలింపిక్ హాకీలో భారత్ పతకం సొంతం చేసుకుంది. గెలిచింది కాంస్యమే అయినా ఈ విజయంతో 130 కోట్ల మంది భారతీయులు ఉప్పొంగి పోయారు. భారత హాకీ చరిత్రలోనే అత్యంత అరుదైన విజయాన్ని మన్‌ప్రీత్ సేన సొంతం చేసుకుంది.
హోరాహోరీ పోరులో..
కాంస్యం కోసం జర్మనీ-భారత్‌ల మధ్య జరిగిన పోరు యుద్ధాన్ని తలపించింది. తొలి నిమిషం నుంచే ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. నువ్వానేనా అన్నట్టు సాగిన సమరంలో భారత్ 54 తేడాతో జర్మనీని చిత్తు చేసి కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. ఆట రెండో నిమిషంలోనే జర్మనీ ఆటగాడు టిముర్ ఒరుజ్ అద్భుత గోల్‌తో తన జట్టుకు ఆధిక్యాన్ని సాధించి పెట్టాడు. ఆ తర్వాత స్కోరును సమం చేసేందుకు భారత్ తీవ్రంగా ప్రయత్నించింది. 17వ నిమిషంలో సిమ్రన్ జీత్ సింగ్ చిరస్మరణీయ గోల్‌తో స్కోరును సమం చేశాడు. మరోవైపు 24వ నిమిషంలో నిక్లాస్ వెలెన్, ఆ వెంటనే బెనెడిక్స్ ఫర్క్ గోల్స్ సాధించడంతో జర్మనీ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అయితే భారత ఆటగాళ్లు కూడా దూకుడుగా ఆడుతూ కొద్ది సేపటికే స్కోరును సమం చేశారు. 27వ నిమిషంలో హార్దిక్ సింగ్, 29వ నిమిషంలో హర్మన్‌ప్రీత్ సింగ్ గోల్స్ చేయడంతో మొదటి హాఫ్ 33తో సమంగా ముగిసింది. ఇక ద్వితీయార్ధం ఆరంభంలోనే రూపిందర్ పాల్ సింగ్ అద్భుత గోల్ చేశాడు. దీంతో భారత్ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. మరో మూడు నిమిషాల తర్వాత సిమ్రన్ జీత్ సాధించి గోల్‌తో భారత్ ఆధిక్యం 53కి చేరింది. తర్వాత స్కోరును సమం చేసేదుకు జర్మనీ తీవ్రంగా శ్రమించింది. అయితే భారత ఆటగాళ్లు వారి దాడులను సమర్థంగా తిప్పికొట్టారు. కానీ 48వ నిమిషంలో లుకాస్ విండ్దెవర్ జర్మనీకి నాలుగో గోల్‌ను అందించాడు. దీంతో మ్యాచ్‌లో ఉత్కంఠ నెలకొంది. కానీ చివరి వరకు ఆధిక్యాన్ని కాపాడుకోవడంలో సఫలమైన భారత్ విజయాన్ని సొంతం చేసుకుంది.
దేశ వ్యాప్తంగా సంబరాలు
దశాబ్దాల నిరీక్షణ తర్వాత ఒలింపిక్ హాకీలో భారత్ పతకం సాధించడంతో దేశ వ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి. ముఖ్యంగా పంజాబ్, హర్యాన తదితర రాష్ట్రాల్లో ప్రజలు పెద్ద ఎత్తున సంబురాలు చేసుకున్నారు. టపాసులు కాల్చి, మిఠాయిలు పంచి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇక చారిత్రక విజయం సాధించిన హాకీ వీరులకు దేశ వ్యాప్తంగా ప్రజలు నీరాజనం పలికారు. ఫైనల్ కానీ ఫైనల్ మ్యాచ్ కోసం కోట్లాది మంది అభిమానులు టివిల ముందు అతుక్కు పోయారు. ఇక భారత్ గెలిచిన వెంటనే వీధుల్లోకి వచ్చి సంబరాల్లో మునిగి పోయారు. ఇక భారత ఆటగాళ్ల ఇళ్ల వద్ద కూడా పండగ వాతావరణం కనిపించింది.
పంజాబ్ ఆటగాళ్లకు భారీ నజరానా
ఇక ఒలింపిక్‌లో భారత్‌కు ప్రాతినిథ్యం వహించిన పంజాబ్‌కు ప్రాతినిథ్యం వహించిన ఆటగాళ్లపై ఆ రాష్ట్ర ప్రభుత్వం కనక వర్షం కురిపించింది. పంజాబ్‌కు చెందిన ఆటగాళ్లకు ఒక్కొక్కరికి కోటి రూపాయల చొప్పున నగదు బహుమతిని పంజాబ్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రీడల్లో పంజాబ్‌కు చెందిన 8 మంది ఆటగాళ్లు భారత్‌కు ప్రాతినిథ్యం వహించారు.
ప్రశంసలే..ప్రశంసలు
మరోవైపు హాకీలో చారిత్రక విజయాన్ని సొంతం చేసుకున్న భారత జట్టుపై దేశ వ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధాన మంత్రి, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు, కేంద్ర మంత్రులు, ప్రతిపక్ష పార్టీల నేతలు, వాణిజ్య, సినీ, క్రీడా ప్రముఖులు తదితరులు హాకీ వీరులపై ప్రశంసలు కురిపించారు. కాంస్య పతకంతో భారత హాకీలో కొత్త ఆధ్యాయానికి తెరలేచిందని వారు ప్రశంసించారు. ఈ స్ఫూర్తితో భారత హాకీ పూర్వవైభవం సాధించడం ఖాయమని వారు జోస్యం చెప్పారు.
Indian men hockey gets Olympics bronze medal