న్యూఢిల్లీ: కొవిడ్ మహమ్మారి కాలం.. జూన్ 2020 నుంచి డిసెంబర్ 2021 మధ్యలో మొత్తం 4,23,559 మంది భారతీయ వలస కార్మికులు ఇసిఆర్ దేశాల నుంచి వలస వచ్చారని, వీరిలో సగానికి పైగా కార్మికులు యుఎఇ, పౌదీ అరేబియా నుంచి వచ్చారని ప్రభుత్వం గురువారం రాజ్యసభలో తెలిపింది. 1983 ఎమిగ్రేషన్ చట్టం ప్రకారం.. భారతీయ పాస్‌పోర్టు కలిగిన ఎమిగ్రేషన్ చెక్ రిక్వయిర్డ్(ఇసిఆర్) క్యాటగిరీల వారు 18 దేశాలకు వెళ్లడానికి ఆఫీస్ ఆఫ్ ప్రొటెక్టర్ ఆఫ్ ఎమిగ్రంట్స్(పిఓఇ) నుంచి ఎమిగ్రేషన్ క్లియరన్స్ పొందవలసి ఉంటుంది. ఈ దేశాలలో అత్యధికం గల్ఫ్ ప్రాంతంలో ఉన్నాయి. ఇసిఆర్ దేశాల నుంచి తిరిగివచ్చిన భారత వలస కార్మికులలో యుఎఇ నుంచి 1,52,126 మంది, సౌదీ అరేబియా నుంచి 1,18,064 మంది, కువైట్ నుంచి 51,208 మంది, ఓమన్ నుంచి 46,003 మంది, ఖతర్ నుంచి 32,361మంది ఉన్నారని విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వి మురళీధరన్ రాజ్యసభలో ఒక లిఖితపూర్వక సమాధానంలో పేర్కొన్నారు.
Indian Migrant Workers returned from ECR Countries