లాస్ ఎంజెలిస్ : సంగీత ప్రపంచంలో సమున్నత ప్రతిభ కనబర్చిన వారికి గౌరవం కల్పించే గ్రామీ పురస్కారాలలో భారతీయ స్వరశక్తి వెల్లివిరిసింది. ఈసారి భారత్‌కు ఐదు అవార్డులు వచ్చాయి. అమెరికాలోని విఖ్యాత లాస్‌ఎంజెలిస్‌లో జరిగిన 66వ గ్రామీ అవార్డుల పోటీలో ఐదుగురు భారతీయ సంగీతకారులకు అవార్డులు దక్కాయి. ఈ ఏటి ఈ అవార్డులలో తబలా విద్వాంసులు జాకీర్‌హుస్సేన్ , ఫ్లూట్ సంగీతకర్త రాకేష్ చౌరాసియా , గాయకుడు శంకర్ మహాదేవన్, వయోలిన్ వాయిద్యకారులు గణేష్ రాజగోపాలన్, ఆర్కెస్ట్రా సంగీతకారుడు సెల్వగణేష్ వినాయక్రమ్ వ్యక్తిగత అవార్డులు పొందారు. వీరిలో చౌరాసియాకు రెండు అవార్డులు అందాయి. హుస్సేన్‌కు వివిధ కేటగిరిల్లో కలిపి మూడు గ్రామీలు అందాయి. ఇక భారత్‌కు చెందిన ఫ్యూజన్ బ్యాండ్ శక్తికి ఉత్తమ గ్లోబల్ మ్యూజిక్ అవార్డు అందింది. దిస్ మూవ్‌మెంట్ అనే ఆల్బం రూపకర్తలుగా నలుగురు భారతీయులు, ఈ బ్యాండ్ వ్యవస్థాపకులు దిగ్గజ బ్రిటిష్ గిటారిస్టు మెక్‌లాగ్లిన్ వ్యవహరించారు. గ్రామీ అవార్డుల చరిత్రలో 45 ఏండ్ల తరువాత తొలిసారిగా స్టూడియోలో రూపొందించిన ఆల్బమ్ విజేతగా నిలిచింది.
శక్తితో పాటు జాకీర్ హుస్సేన్‌కు పష్తో, ఎస్ వి స్పీక్ ఆల్బంలలో తబలిస్టుగా పాల్గొనేందుకు పురస్కారాలు అందాయి. గ్రామీ పురస్కారాలలో భారతీయ ప్రతిష్టను , సంగీతంలో వారసత్వ సంపదను ఇనుమడింపచేసిన ఐదుగురు కళాకారులను ప్రధాని నరేంద్ర మోడీ ఓ ప్రకటనలో అభినందించారు. అంకిత భావం, అంతకు మించి అసాధారణ సంగీతసృజన వారిని ప్రపంచవ్యాప్తంగా సంగీత అభిమానుల మన్ననలు పొందేలా చేసిందని పేర్కొన్నారు. మూడు అవార్డులు పొందిన తరువాత జాకీర్‌హుస్సేన్ స్పందిస్తూ ప్రేమ ఆదరణ, సంగీతం లయాత్మకత లోపిస్తే మనిషే లేడని స్పష్టం చేశారు. ఈ సంగీత పురస్కారాల కార్యక్రమానికి ప్రముఖ సంగీత దర్శకులు ఏఆర్ రెహమాన్ కూడా హాజరయ్యారు . అవార్డుల ప్రకటన తరువాత విజేతలు జాకీర్ హుస్సేన్, మహాదేవన్ ఇతరులతో కలిసి సెల్ఫీలకు దిగారు. ఇప్పుడు భారత్ గ్రామీ సంగీత వర్షంలో తడిసిందని వ్యాఖ్యానించారు.
పాప్‌సింగర్ టేలర్ రికార్డు
గ్రామీలో పాప్‌సింగర్ టేలర్ స్విఫ్ట్ చరిత్ర సృష్టించింది. బెస్ట్ ఆల్బం అవార్డును ఆమె నాలుగోసారి దక్కించుకుంది. ఆమె రూపొందించిన మిడ్‌నైట్ ఆల్బం విజేత పతాకను సాధించింది. నాలుగుసార్లు అవార్డులు పొందిన సింగర్‌గా రికార్డులు తిరగరాసింది.