Wednesday, January 22, 2025

అరేబియాలో సత్తా చాటుకున్న భారతీయ నౌకాదళం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : మువన్నెల జెండాల రెపరెపల నడుమ భారతీయ నౌకాదళం ఇటీవలే అరేబియా సముద్రం వేదికగా తన పోరాట పటిమను చాటుకుంది. విన్యాసాలకు దిగింది. నౌకాదళానికి చెందిన రెండు యుద్ధవిమాన వాహకాలు, వీటిపై 35కు పైగా పోరాట పటిమల యుద్ధ విమానాల ప్రదర్శనతో ఇటీవలి కాలంలో ఎప్పుడూ లేని స్థాయి మెగా ఆపరేషన్ చేపట్టింది. ఈ విషయాన్ని భారతీయ నౌకదళ అధికార ప్రతినిధి కమాండర్ వివేక్ మధ్వాల్ తెలిపారు. నిర్థిష్టంగా ఈ శక్తిసామర్థ ప్రదర్శన ఎప్పుడు ? ఏ నిర్థిష్ట ప్రాంతంలో జరిగిందనేది అధికార వర్గాలు వెల్లడించలేదు. అయితే బహుళ సంఖ్యలో యుద్ధ నౌకలు. జలాంతర్గాములు, 35కు పైగా క్షేత్రస్థాయి యుద్ధ విమానాలను ప్రదర్శనలో ఉంచారు.

ఈ మధ్య కాలంలో పొరుగున ఉన్న శక్తివంతమైన చైనా తరచూ హిందూ మహాసముద్రంలో తన దూకుడును పెంచడం, పలుసార్లు ఈ దిశలో తమ అత్యంత శక్తివంతమైన యుద్ధ నౌకలను , సబ్‌మెరైన్‌లను ఈ ప్రాంతంలో తిప్పడం వంటి పరిణామాల నేపథ్యంలోనే భారతదేశ నౌకదళ ఆపరేషన్ జరిగింది. జంట సిబిజి వాహకనౌకల విన్యాసాలను ఆ మధ్యలో నిర్వహించారని వెల్లడించారు. అయితే తేదీలను ప్రకటించలేదు. భారతీయ నౌకాదళం నిరాటంకంగా ఈ ఆపరేషన్‌ను నిర్వహించిందని నౌకాదళ అధికారులు తెలిపారు. రెండు విమానవాహక నౌకలు, యుద్ధ నౌకలు ఇతరత్రా యుద్ధ సమయ పాటవాన్ని నిరాటంకంగా సాగనివ్వడం ద్వారా మన ఘనతను చాటుకున్నామని వివరించారు.

సముద్ర వేదికగా మనకు ఉన్న , మనం సంతరించుకున్న గగనతల శక్తికి ఇప్పటి మెగా ఆపరేషన్ ఓ నిలువెత్తు సాక్షం అని అధికారులు సంతోషం వ్యక్తం చేశారు. చైనా కట్టడికి సంకేతాల దిశలోనే భారతీయ నౌకాదళం అత్యంత వ్యూహాత్మకంగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు వెల్లడైంది. ఈ విన్యాసపు ప్రదర్శనల్లో అనేక రకాల విధ్వంసక శకటాలు, మెరుపుదాడుల నౌకలు , ఇతర షిప్‌లను ప్రదర్శించారు. సముద్ర జలాల భద్రత దిశలో హిందూ మహాసముద్రం ఇతరత్రా ప్రాంతాలలో మన శక్తిని చాటుకునేందుకు ఈ విధమైన చర్యను చేపట్టిన విషయాన్ని ఆయన ధృవీకరించారు.

వాహక నౌకల నుంచి ప్రత్యర్థులను దెబ్బతీయగలిగే యుద్ధ విమానాలు దూసుకువెళ్లుతాయి. జలాంతర్గాములు విద్రోహ శక్తుల కదలికలను భగ్నం చేస్తాయి. ఇక యుద్ధ నౌకలు ఎప్పటికప్పుడు సువిశాల తీర ప్రాంతాన్ని పరిరక్షిస్తూ ఉంటాయి. వీటన్నింటి సమాహార శక్తి ప్రదర్శన ఇప్పుడు కీలక అంశం అయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News