చెన్నై: పాక్ జలసంధిలో శుక్రవారం ఒక అనుమానాస్పద పడవను భారత నౌకాదళం అడ్డుకున్నట్లు అధికారులు తెలిపారు. భారత్ శ్రీలంక అంతర్జాతీయ సముద్రయాన సరిహద్దు రేఖ(ఐఎంబిఎల్) సమీపాన పాక్ జలసంధలో గస్తీ తిరుగుతున్న భారత నౌకాదళానికి చెందిన నౌక ఈ అనుమానాస్పద పడవను శుక్రవారం తెల్లవారుజామున గుర్తించినట్లు నౌకాదళం ఒక ప్రకటనలో తెలిపింది. కొడియాక్కరై వద్ద చేపలు పడుతున్న ఒక జాలరిపై నౌకాదలం కాల్పులు జరపగా అతను గాయపడినట్లు పాట్టాలి మక్కల్ కట్చి వ్యవస్థాపకుడు డాక్టర్ ఎస్ రామదాస్ ఆరోపించిన నేపథ్యంలో భారత నౌకాదళం ఒక ప్రకటన విడుదల చేస్తూ పదేపదే హెచ్చరికలు జారీచేసినప్పటికీ ఆ పడవ ఆగకపోవడంతో నిబంధనల ప్రకారం ఆ పడవను నిలువరించడానికి కాల్పులు జరిపినట్లు తెలిపింది. ఆ పడవలో ఉన్న ఒక వ్యక్తి ఈ కాల్పులలో గాయపడినట్లు తెలియడంతో ఆ వ్యక్తికి తమ నౌకలో ప్రథమ చికిత్స నిర్వహించి భారత నౌకాదళానికి చెందిన చేతక్ హెలికాప్టర్‌లో రామనాథపురం వద్ద ఉన్న ఎఎన్‌ఎస్ పరండు వద్దకు తరలించి అక్కడ నుంచి ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చామని నౌకాదళం పిఆర్‌ఓ ట్వీట్ చేశారు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉన్నట్లు ఆయన చెప్పారు.