యెమెన్‌లో ఓ హత్యానేరంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న భారతీయ నర్స్ నిమిష ప్రియాకు ఆ దేశాధ్యక్షుడు రషీద్ అల్ అలిమి మరణశిక్ష ఖరారు చేశారు. కేరళకు చెందిన ఈ నర్సును విడిపించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నట్టు కేంద్ర విదేశాంగ శాఖ వెల్లడించింది. ఓ హత్యానేరంపై దాదాపు 2017 నుంచి ఆమె యెమెన్ జైల్లో మగ్గుతోంది. కొన్ని నెలల్లోనే ఆమెకు మరణశిక్షను అమలు చేయనున్నట్టు తెలుస్తోంది. తాజాగా ఈ అంశంపై భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ స్పందించారు. “ ప్రియాను కాపాడేందుకు ఆ కుటుంబం అన్ని అవకాశాలను అన్వేషించడాన్ని అర్థం చేసుకోగలం.. ఈ విషయంలో భారత ప్రభుత్వం కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తోంది ” అని పేర్కొన్నారు.
కేసు పూర్వాపరాలు
నిమిషప్రియా నర్స్ కోర్సు పూర్తి చేసిన తరువాత 2008లో యెమెన్ వెళ్లి అక్కడే ఉద్యోగంలో చేరింది. 2011లో కేరళకు వచ్చి థామస్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. ఆ తర్వాత యెమెన్‌లో ఓ క్లినిక్ తెరవాలనుకుంది. కానీ ఆ దేశ నిబంధనల ప్రకారం స్థానిక వ్యక్తి వ్యాపార భాగస్వామ్యం తోనే అది సాధ్యమవుతుంది. దీంతో అక్కడి తలాల్అదిబ్ మెహది అనే వ్యక్తిని నిమిషథామస్ జంట తమ వ్యాపార భాగస్వామిగా చేసుకొని అల్ అమన్ మెడికల్ కౌన్సిల్ సెంటర్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత తన కుమార్తె కు సంప్రదాయ వేడుక కోసం భారత్ వచ్చిన ప్రియా అది ముగియగానే తిరిగి యెమన్ వెళ్లి పోయింది. ఆమె భర్త, కుమార్తె మాత్రం కేరళలో ఉండిపోయారు. మెహది దీనిని అదునుగా భావించి ఆమెనుంచి డబ్బు లాక్కోవడంతోపాటు వేధించినట్టు ప్రియా కుటుంబం ఆరోపిస్తోంది. ఆమెను తన భార్యగా మెహది చెప్పుకోవడం మొదలుపెట్టి , పాస్‌పోర్ట్, ఇతర పత్రాలను లాక్కొన్నాడన్న ఆరోపణలు ఉన్నాయి.
చివరికి ఆమెను కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడనీయలేదు. 2016లో అతడిపై ప్రియా పోలీస్‌లకు కూడా ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదు. దీంతో 2017లో మెహదీకి మత్తుమందు ఇచ్చి అతడి వద్ద ఉన్న తన పాస్‌పోర్టును స్వాధీనం చేసుకోవాలని భావించింది. కానీ ఆ డోస్ ఎక్కువ కావడంతో అతడు చనిపోయాడు. ఆ తర్వాత మృతదేహాన్ని ఓ వాటర్ ట్యాంక్‌లో పారేసింది. చివరికి అక్కడ నుంచి సౌదీకి వెళ్లిపోతుండగా సరిహద్దుల్లో ఆమెను అరెస్టు చేశారు. మృతుడి కుటుంబానికి కొంత మొత్తం పరిహారం చెల్లిస్తే… నిందితులను క్షమించి వదిలేసే అవకాశం యెమెన్లోఉంది. దీంతో ప్రియా కుటుంబం దాదాపు 40 వేల డాలర్లను (రూ. 34,20,000 ) మెహది కుటుంబానికి ఇచ్చేందుకు సమీకరించింది. బాధితుడి కుటుంబంతో చర్చలు జరిపేందుకే భారత దౌత్య కార్యాలయం ఏర్పాటు చేసిన న్యాయవాది అబ్దుల్ అమిర్ 20 వేల డాలర్లు డిమాండ్ చేశాడని నిమిష ప్రియా తల్లి ప్రేమకుమారీ ఆరోపించారు. దీంతో చర్చలు మధ్యలోనే ఆగిపోయాయి.