న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌పై యుద్ధానికి ప్రతిగా రష్యాపై ప్రపంచ దేశాలు విధించిన ఆంక్షలు ప్రస్తుతం భారత ఆయిల్ కంపెనీలకు తలనొప్పిగా మారాయి. ఆర్థిక ఆంక్షల నుంచి గట్టెక్కడంలో భాగంగా రష్యా తన దగ్గరున్న డాలర్లను భద్రపర్చుకోవడంపై మరింతగా దృష్టి పెడుతోంది. విదేశాలకు డాలర్లను పంపడంపై ఆంక్షలు విధించింది. దీంతో రష్యాలో ఇన్వెస్ట్ చేసిన దేశీ ఆయిల్ కంపెనీలకు రావాల్సిన 8 బిలియన్ రూబుళ్ల (రూ. 1,000 కోట్ల) మేర డివిడెండ్ ఆదాయం చిక్కుబడిపోయింది.
ఓఐఎల్, ఐఒసి, ఓఎన్‌జిసి విదేశ్ తదితర దేశీ చమురు కంపెనీలు రష్యాలో నాలుగు వేర్వేరు అసెట్లలో 5.46 బిలియన్ డాలర్ల మేర ఇన్వెస్ట్ చేసాయి. వాంకోర్‌నెఫ్ట్ ఆయిల్ అండ్ గ్యాస్ క్షేత్రం లో 49.9 శాతం, టిఎఎఎస్–యూర్యాఖ్ క్షేత్రంలో 29.9 శాతం వాటాలు కొనుగోలు చేశాయి. ఆయా క్షేత్రాల గ్యాస్, చమురు విక్రయాల ద్వారా వచ్చే లాభాలపై డివిడెండ్లు అందుకుంటున్నాయి.