దశాబ్దాల నిరీక్షణతో మరో ఏడాది పడిగాపులు
లక్ష గ్రీన్‌కార్డులు మురిగిపొయ్యే ముప్పు
వేలాది భారతీయ ఐటిలలో కలవరం
బైడెన్ వీసా విభాగం తీరుతో తిప్పలు
ప్రక్రియ జాప్యంతో జారీకి బ్రేక్
వాషింగ్టన్: దాదాపు లక్ష గ్రీన్‌కార్డులు వచ్చే రెండు నెలలోపే మురిగిపొయ్యే ప్రమాదం ఉంది. అమెరికాలో శాశ్వత నివాస హోదా అనుబంధంగా ఉద్యోగ కల్పనకు గ్రీన్‌కార్డులతో అర్హత ఏర్పడుతుంది. అమెరికా కలలు కంటూ గ్రీన్‌కార్డుల కోసం దశాబ్దాలుగా వేచి చూస్తూ ఉన్న భారత ఐటి నిపుణులలో గ్రీన్‌కార్డులు వృధా అయిపోయే పరిస్థితి తీవ్రస్థాయి అసహనం, ఆందోళన కల్గిస్తోంది. ఉద్యోగ ప్రాతిపదికన వచ్చే ఇమిగ్రేంట్లకు ఈ ఏటి గ్రీన్‌కార్డుల కోటా 2,61,500. సాధారణంగా ఉండే 1,40,000తో పోలిస్తే ఇది అత్యధికం. అయితే చట్ట ప్రకారం, నియమ నిబంధనల మేరకు ఈ గ్రీన్‌కార్డు వీసాలు ఈ ఏడాది సెప్టెంబర్ 30 లోగా జారీ కాకపోతే ఇవి శాశ్వతంగా చెల్లకుండా పోతాయని భారతీయ ఐటి వృత్తి నిపుణులు సందీప్ పవార్ వార్తాసంస్థలకు తెలిపారు. గ్రీన్‌కార్డు ఆశావహులుగా ఉన్న వేలాది మంది భారతీయ యువతకు ఇది దురదృష్టకర పరిణామం అవుతుందని వివరించారు.
ట్రంప్ నుంచి బైడెన్‌కు అధికార పగ్గాలు చేతులు మారిన దశలో ఇప్పటికీ ఇమిగ్రేషన్ , వీసాల వ్యవహారాలు అమెరికాలో నెమ్మదిగా సాగుతున్నాయి. ఇంతకు ముందటి ఆంక్షల పూర్తి స్థాయి ఉపసంహరణ లేకపోవడం, లెక్కకు మించి గ్రీన్‌కార్డులు, హెచ్ 1 వీసాలకు దరఖాస్తులు రావడం, అన్నింటికి మించి వీటి పరిశీలన జారీ వంటి విషయాలపై స్పష్టమైన మార్గదర్శకాలు లేకపోవడం వంటి పరిణామాలు మొత్తం ప్రక్రియకు చేటుగా మారుతున్నాయి. ఇప్పుడు యుఎస్ సిటిజన్‌షిప్, అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ (యుఎస్‌సిఐఎస్) వీసాలపై జరుపుతోన్న నిర్వహణ పద్ధతిలోని మందకొడితనంతో ఆమోదిత కోటాకు చెందిన వాటిలో దాదాపు లక్ష వరకూ గ్రీన్‌కార్డులు వృధా కానున్నాయి. దీనితో గ్రీన్‌కార్డుల దశకు దాదాపుగా చేరువ అయిన వేలాది మంది వచ్చే సెప్టెంబర్ చివరి నాటికి తమకు గ్రీన్‌కార్డులు దొరుకుతాయా? లేక ఈ ఏడాదికి కూడా ఇంతకు ముందటి లాగానే నిరీక్షణతోనే కాలంగడపాల్సి ఉంటుందా? అనే ఆందోళనతో ఉన్నారు.
ఇప్పటి అంచనాల మేరకు సెప్టెంబర్ చివరి నాటికి లక్ష గ్రీన్‌కార్డులు కాలం చెల్లిపోవడం ఖాయమనే విషయం స్పష్టం అవుతోంది. ఈ విషయాన్ని ఇటీవలే వీసా వినియోగ విషయాలకు చెందిన విదేశాంగ శాఖలోని అధికారి ఒకరు ధృవీకరించారు. వెంటనే యుఎస్‌సిఐఎస్ కానీ బైడెన్ అధికార యంత్రాంగం కానీ తగు విధంగా సర్దుబాటు చర్యలు తీసుకోకపోతే ఈ ఏడాదికి దక్కే దాదాపు లక్ష గ్రీన్‌కార్డులు అందకుండా ఎవరికి చెందకుండా పోతాయి. ఎక్కువ స్థాయిలో వస్తాయనుకున్న గ్రీన్‌కార్డుల విషయంలో ఇప్పుడు నెలకొన్న పరిస్థితి అసాధారణం అవుతుందని భారతీయ ఐటి నిపుణులు పవార్ వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించిన ప్రశ్నలకు వైట్‌హౌస్‌కు చెందిన అధికారులు ఎవరూ సరైన విధంగా సమాధానం ఇవ్వలేదు.
గ్రీన్‌కార్డుల వృధాపై కోర్టులో వ్యాజ్యం
గ్రీన్‌కార్డు జారీపై ఇంతకాలం ఎదురుచూస్తూ వస్తున్న తమ సంగతి పట్టించుకోకుండా వీటిని వృధాకానిచ్చే ప్రక్రియపై భారతీయులు, చీనియులు అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికార యంత్రాంగం ఈ గ్రీన్‌కార్డుల వృధాకు పోకుండా చేయాలని కోరుతూ 125 మంది భారత, చైనా దేశస్తులు కోర్టులకు ఎక్కారు. అమెరికాలో ఉద్యోగాలలో ఉంటూ గ్రీన్‌కార్డుల ద్వారా శాశ్వత నివాస యోగ్యత దక్కించుకునేందుకు ఎదురుచూస్తున్న వేలాది మంది తమ చట్టపరమైన అర్హతను అధికార యంత్రాంగపు నిర్లక్షంతో పోగొట్టుకునే పరిస్థితి వస్తోందని ఈ పిటిషన్లలో తెలిపారు. ఏళ్లు ఏళ్లుగా అమెరికాలో శాశ్వత నివాస అర్హత కోసం వేచిచూస్తూ, అన్ని విధాలుగా జాప్యంతో రాజీపడుతూ వస్తున్నామని, అయితే మరోమారు సరైన విధంగా ఈ వీసాలు చేజారే ప్రమాదం ఏర్పడటం తమకు ఎంతకూ తెగని నిరీక్షణను, ఎటూ తేల్చని ఎండమావిని మిగులుస్తోందని వీరు వాపోతున్నారు.
యుఎస్‌సిఐఎస్ నిస్తేజంతో ఈ దుర్గతి
ఈ ఏడాది అయినా ఇమ్మిగ్రేషన్ విభాగం సరిగ్గా స్పందించి ఉంటే , చిత్తశుద్దిని ప్రదర్శిస్తే పరిస్థితి వేరే విధంగా ఉండేది. వేలాది మందికి గ్రీన్‌కార్డులు దక్కి ఉండేవని , దశాబ్దాల తరబడి వేచిచూసే పరిస్థితి తప్పేదని భారతీయ విశ్లేషకులు తెలిపారు. అమెరికాలో ఏళ్ల నుంచి ఉద్యోగాలు చేసుకుంటూ గ్రీన్‌కార్డులతో శాశ్వత నివాస యోగ్యత పొందాలనుకుంటున్న వేలాది మంది భారతీయుల పక్షాన ఐటి నిపుణుడు సందీప్ పవార్ వంటి వారు ఉద్యమిస్తున్నారు. తాను తన వంటి పలువురు భారతీయులమని , ఇంతవరకూ భారత్‌కు ఇక్కడి దేశాల వారి కోటా పరిమితి, రేసిస్టు వివక్ష క్రమంలో గ్రీన్‌కార్డుల జారీలో అన్యాయం జరుగుతోందని పవార్ వాపొయ్యారు. ఇక్కడ శాశ్వత నివాస యోగ్యత దక్కితేనే తమ వారితో కలిసి ఉద్యోగాలు చేస్తూ అమెరికా జనజీవన స్రవంతిలో మమేకం కావాలనుకుంటే కుదరడం లేదని పవార్ వంటి వారు వాపోతున్నారు.
పిల్లలు తరిమివేయబడుతారు
ఇక్కడ ఉద్యోగాలు చేసుకునే వారి పిల్లలు పెద్దలు అయిన తరువాత గ్రీన్‌కార్డుల రక్షణ లేకపోతే తరిమికొట్టబడుతారు. పుట్టిన నాటి నుంచి అమెరికా తప్ప వేరే దేశం భాష తెలియని వారి పరిస్థితి మరో విధంగా మారుతుందని సందీప్ పవార్ విశ్లేషించారు. ఇటీవలే ఇంపాక్ట్ ఎక్సిక్యూటివ్ డైరెక్టర్ నియిల్ మఖీజా ప్రతినిధి బృందంతో పాటు వెళ్లి గ్రీన్‌కార్డుల పరిస్థితి గురించి ప్రెసిడెంట్ జో బైడెన్‌కు మొరపెట్టుకున్నారు. నిబంధనల సంస్కరణ అవసరం అని అభ్యర్థించారు. ఇటీవలే వాషింగ్టన్ పోస్టు పత్రికలో గ్రీన్‌కార్డుల గురించి సంపాదకీయ పేజీలో రిసర్చ్ ఫెల్లో డేవిడ్ జె బియిర్ వ్యాసం రాశారు. బైడెన్ అధికార యంత్రాంగం వైఖరి వల్లనే గ్రీన్‌కార్డులు మురిగిపోతున్నాయని ఇందులో వ్యాఖ్యానించారు.