Wednesday, January 22, 2025

ఈ ఎన్నికల్లో కనిపించని ‘ఇండియా’

- Advertisement -
- Advertisement -

కేంద్రంలోని నరేంద్ర మోడీ నేతృత్వంలో గల ఎన్‌డిఎ ప్రభుత్వాన్ని ఉమ్మడిగా ఎదుర్కొనేందుకు ‘ఇండియా’ పేరుతో ఏర్పడిన ప్రతిపక్షాల కూటమి ఉనికి ఆ తర్వాత మొదటిసారిగా ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు జరుగుతున్న ఎన్నికలతోనే ఉనికి కనిపించడం లేదు. ఏ ఎన్నిక, ఎక్కడ జరిగినా భాగస్వామ్య పక్షాలు అన్నీ కలిసి ఒకే అభ్యర్థిని నిలబెట్టాలని ముంబై భేటీలో నిర్ణయించి సుమారు రెండు నెలలవుతున్నా ఆ దిశలో కనీసం ప్రాథమిక చర్చలు కూడా జరపలేదు. పైగా మధ్యప్రదేశ్ ఎన్నికల్లో పొత్తుకు సై అని, చర్చలు అంటూ తమ చుట్టూ ఎస్‌పి నేతలను తిప్పించుకొని, ఆ తర్వాత ఏకపక్షంగా అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ నేతల వైఖరిపై సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. చివరకు గత ఎన్నికల్లో తమ పార్టీ గెలుచుకున్న రెండు సీట్లలో కూడా కాంగ్రెస్ అభ్యర్థులను నిలబెట్టడం పట్ల ఆగ్రహం చెందుతున్నారు.

‘ఇండియా’ కూటమి లోక్‌సభ ఎన్నికలకే పరిమితమా? అని ప్రశ్నిస్తూ కాంగ్రెస్ ‘పెద్దన్న’ పాత్ర వహిస్తున్నట్లు విమర్శలు గుప్పించారు. మధ్యప్రదేశ్‌లో తమకు సీట్లు ఇవ్వకుండా ఉత్తర ప్రదేశ్‌లో ఏ విధంగా అడుగుతారు అంటూ నిలదీశారు. పైగా వచ్చే లోక్‌సభ ఎన్నికలలో పిడిఎ (వెనుకబడిన వర్గాలు, దళితులు, అల్పసంఖ్యాక వర్గాలు) విజయం సాధిస్తుందని ప్రకటించడం ద్వారా వచ్చే లోక్‌సభ ఎన్నికలలో ‘ఇండియా’ కూటమి ఉండదన్నట్టుగా అఖిలేశ్ పరోక్ష సంకేతాలు ఇచ్చిన్నట్లయింది. వాస్తవానికి ఈ కూటమి ఏర్పాటుకు ప్రయత్నాలు కాంగ్రెసేతర పక్షాల నుండి ప్రారంభం అయ్యాయి. నితీశ్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్, శరద్ పవార్ వంటివారు చొరవ తీసుకున్నారు. వారి కృషి ఫలితంగానే కాంగ్రెస్‌తో వేదిక పంచుకోవడానికి ఏమాత్రం సిద్ధంగా లేని అరవింద్ కేజ్రీవాల్, మమతా బెనర్జీ, అఖిలేశ్ యాదవ్ వంటి వారు సహితం చేతులు కలిపారు.

అయితే కూటమి బలోపేతం అయ్యే అవకాశాలు గమనించిన కాంగ్రెస్ దాని నేతృత్వం కోసం ఆరాటపడటం ప్రారంభమైంది. అందుకనే ఇప్పటి వరకు కన్వీనర్‌ను కూడా నియమించే ప్రయత్నం చేయడం లేదు. ఆగస్టు 31, సెప్టెంబర్ 1 తేదీలలో ముంబైలో 28 పార్టీలతో జరిగిన కూటమి సమావేశంలో సీట్ల సర్దుబాటు ప్రయత్నం వెంటనే ప్రారంభించాలని కూడా నిర్ణయానికి వచ్చారు. అందుకోసం ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. సీట్ల సర్దుబాటు ప్రక్రియను నెల రోజుల లోపుగా పూర్తి చేస్తామని ప్రకటించారు.అయితే ఈ నిర్ణయం తీసుకొని సుమారు రెండు నెలలు అవుతున్నా ఇప్పటి వరకు ఆ దిశలో ప్రయత్నాలు జరగడం లేదు. ఆ తర్వాత కూటమి సమావేశం జరగనే లేదు. పైగా, అక్టోబర్ ప్రారంభంలో భోపాల్ తో ప్రారంభించి పలు రాష్ట్రాల రాజధానులలో ఉమ్మడి బహిరంగ సభలు జరపాలని నిర్ణయించుకున్నారు. కానీ ఆ దిశలో ఎటువంటి ముందడుగు లేదు. అందుకు కూడా ప్రధాన కారణం కాంగ్రెస్ ఆసక్తి చూపకపోవడమే.

సెప్టెంబర్ 14న శరద్ పవార్ ఇంట్లో 14 మంది సభ్యుల సమన్వయ కమిటీ ఈ విషయమై సమావేశమైనా ఎటువంటి పురోగతి సాధించలేకపోయారు. సీట్ల సర్దుబాటుకు అన్ని రాష్ట్రాలకు ఒకే విధమైన ఫార్ములా పనికి రాదని, ప్రతి రాష్ట్రంలో స్థానికంగా నెలకొన్న పరిస్థితులను బట్టి సర్దుబాట్లు చేసుకోవాలని నిర్ణయించారు. వాస్తవానికి ఈ కూటమి 400 సీట్లలో ఒకే అభ్యర్థిని నిలబెట్టే అవకాశం ఉందని గ్రహించిన బిజెపి కంగారు పడి, ఎన్నెన్నో ఆత్మరక్షణ ప్రయత్నాలు ప్రారంభించింది. 2019 ఎన్నికల తర్వాత మొదటిసారిగా ఎన్‌డిఎ సమావేశం ఏర్పాటు చేసింది. ఎన్‌డిఎలోకి కొత్త పక్షాలను ఆకట్టుకునే ప్రయత్నం ప్రారంభించింది. మహిళా బిల్లు, జమిలి ఎన్నికలు, ఉమ్మడి పౌరసత్వం వంటి పలు కొత్త అంశాలను తెరపైకి తెచ్చింది. కానీ, కేవలం కాంగ్రెస్ ముభావంగా ఉంటుండడంతో ప్రతిపక్షాల సీట్ల సర్దుబాటు ప్రయత్నాలు ముందుకు సాగడం లేదు.

ఏ ఎన్నికలు వచ్చినా కలిసి పని చేయాలని ‘ఇండియా’ కూటమిలోని కాంగ్రెస్‌కు, ఇతర పార్టీలకు మధ్య ప్రాథమిక అవగాహన కుదిరినా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాల్లో ఎక్కడా అటువంటి ప్రయత్నాలు జరగడం లేదు. మధ్యప్రదేశ్‌లో ఎస్‌పి 18 చోట్ల అభ్యర్థులను నిలబెడుతుండగా, మిజోరాంలో ఆప్ పోటీ చేస్తున్నది. తెలంగాణలో కాంగ్రెస్, వామపక్షాల మధ్య సయోధ్య ప్రశ్నార్ధకంగా మారింది. సీట్ల సర్దుబాట్ల గురించి కాంగ్రెస్ దాటవేసే ప్రయత్నం చేసేందుకు బలమైన కారణాలు కనిపిస్తున్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత ఆ దిశలో చర్చలు జరిపేందుకు దాటవేస్తున్నట్లు స్పష్టం అవుతుంది.
ప్రస్తుతం జరుగుతున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో 3 నుండి 4 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తుందని, ఆ తర్వాత సీట్ల సర్దుబాట్ల గురించి మాట్లాడుకుంటే తాము బలమైన స్థానంలో ఉంటామని, ఇప్పుడే చర్చలు జరిపితే ప్రాంతీయ పార్టీలు చెప్పినట్లు వినాల్సి వస్తుందని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తున్నది. ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లో మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నాయి.

కానీ, కాంగ్రెస్ తిరిగి రెండు రాష్ట్రాలకు మించి ప్రభుత్వాలు ఏర్పాటు చేయలేని పక్షంలో సీట్ల కోసం జరిగే బేరసారాలలో వెనుకడుగు వేసే ప్రమాదం లేకపోలేదు. మొదటి నుండి అటు బిజెపి గాని, ఇటు కాంగ్రెస్ గాని ఎన్నికల పొత్తు విషయంలో ‘ఇచ్చి పుచ్చుకొనే’ ధోరణి అవలంబించడం లేదని ప్రాంతీయ పార్టీలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. జాతీయ స్థాయిలో తమకు గల ప్రాబల్యాన్ని అదనుగా చేసుకొని ప్రాంతీయ పార్టీలను మరింతగా బలహీనం కావించి తమ ప్రాబల్యం పెంచుకునేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. జాతీయ పార్టీల అహంకార ధోరణుల కారణంగానే పలు రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలు బలం పుంజుకున్నాయి. అందుకనే బిజెపి, కాంగ్రెస్ పార్టీల పట్ల ప్రాంతీయ పార్టీలు అనుమానంగా చూస్తున్నాయి. శివసేన, అకాలీదళ్, అన్నాడిఎంకే వంటి పార్టీలు బిజెపి నుంచి ఆ కారణంతోనే విడిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు ‘ఇండియా కూటమి’ లో సీట్ల సర్దుబాట్ల గురించి మొత్తం రాష్ట్రాలను ఎ, బి, సి అంటూ మూడు గ్రూపులుగా విభజించారు. ఇప్పటికే సీట్ల సర్దుబాట్లు అమలులో ఉన్న రాష్ట్రాలు ‘ఏ’ గ్రూప్ లోకి వస్తాయి.

అవి మహారాష్ట్ర, బీహార్, తమిళనాడు, జార్ఖండ్, జమ్మూ అండ్ కశ్మీర్. కాంగ్రెస్ మాత్రమే బలమైన పార్టీగా ఉన్న రాష్ట్రాలు ‘బి’ గ్రూపులోకి వస్తాయి. అవి మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, కర్ణాటక, చత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్. ఇక పొత్తుల గురించి ఒక అవగాహనకు రావాల్సిన రాష్ట్రాలు ‘సి’ గ్రూపులో ఉన్నాయి. అవి, ఢిల్లీ, పంజాబ్, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్. ఈ వర్గీకరణను గమనిస్తే సీట్ల సర్దుబాట్లకు పెద్దగా ఇబ్బందులు కనిపించవు. కేవలం కొంచెం ఉదారంగా వ్యవహరించి బిజెపిని బలహీనం చేయడం పట్ల దృష్టి సారించడమే అవసరమవుతుంది.ముంబైలో జరిగిన కూటమి సమావేశంలో మనం ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో సీట్ల సర్దుబాటు చేసుకుని, ఒకొక్క సీటులో ఒకే అభ్యర్థిని నిలబెట్టలేని పక్షంలో మన అనైక్యత ప్రధాని మోడీకి ఒక వరంగా మారే ప్రమాదం ఉందని లాలూ ప్రసాద్ యాదవ్ హెచ్చరించారు. ‘ఇండియా కూటమి’లో భాగస్వామ్య పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు 2024 లోక్‌సభ ఎన్నికలకు పరిమితం చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది. కానీ ఇటువంటి ధోరణి ఇతర పార్టీలకు ఆమోదయోగ్యంగా కనిపించడం లేదు.

అందుకనే, కాంగ్రెస్ అవకాశవాద ధోరణి అవలంబిస్తున్నట్లు విమర్శలు చెలరేగుతున్నాయి. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బిజెపిని గద్దె దించడమే లక్ష్యంగా ఏర్పడిన ‘ఇండియా’ కూటమిలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బయటపడుతున్న విభేదాలు కూటమి మనుగడను ప్రశ్నార్ధకం చేస్తున్నాయి. కూటమి ఏర్పాటు సమయంలో కనిపించిన ఐక్యత ఎన్నికల సమయం వచ్చేసరికి లేదనే దానికి కాంగ్రెస్, -ఎస్‌పిల మధ్య తలెత్తిన విభేదాలే స్పష్టం చేస్తున్నాయి. మరోవంక, నాయకత్వం అంశం సహితం ‘ఇండియా’ కూటమిలో సమస్యలు తలెత్తేందుకు దారితీస్తుంది. కాంగ్రెసేతర నేత కన్వీనర్‌గా ఉండాలని ఒక అవగాహనకు వచ్చారు. కూటమి ఏర్పాటుకు చొరవ తీసుకున్న నితీశ్ కుమార్ పేరును ముంబైలో ప్రకటిస్తారని అందరూ అనుకున్నారు. అయితే పేరుకు కన్వీనర్ కాకపోయినా మొత్తం వ్యవహారాలు తన కనుసన్నలలో జరగాలని రాహుల్ గాంధీ భావించడం సహితం మిగిలిన నేతలకు మింగుడు పడటం లేదు. అందరినీ సమన్వయ పరచడంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే లేదా సోనియా గాంధీ కీలక పాత్ర వహించేందుకు భాగస్వామ్య పక్షాలకు అభ్యంతరం ఉండదు.

కానీ రాహుల్ గాంధీ విషయంలోనే నితీశ్ కుమార్, శరద్ పవర్, మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్ వంటి నేతలకు అభ్యంతరాలు ఉండే అవకాశం ఉంది. ఏదేమైనా అసెంబ్లీ ఎన్నికలు ముగిసే వరకు ‘ఇండియా’ కూటమిని పక్కకు నెట్టినట్లయింది. అందుకు కాంగ్రెస్ ‘పెద్దన్న’ ధోరణి కారణం అవుతుంది. 2024 ఎన్నికల్లో అవసరమైన సన్నాహాలకు కీలకమైన ఈ మూడు నెలలు వృథా చేయడం ప్రతిపక్షాల ఐక్యతకు విఘాతం కలిగించేందుకు దారితీసే అవకాశం ఉంది. ఐదు రాష్ట్రాల ఎన్నికలలో కాంగ్రెస్ తీరిక లేకుండా వున్నప్పటికీ కన్వీనర్‌ను నియమించినట్లయితే మిగిలిన రాష్ట్రాల్లో పరిస్థితులను చక్కదిద్దుకొనేందుకు అవకాశం ఏర్పడి ఉండెడిది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News