Monday, December 23, 2024

డ్రగ్స్ ఇచ్చి మృగ వాంఛ తీర్చుకున్నాడు.. భారతీయుడిని దోషిగా తేల్చిన సిడ్నీ కోర్టు

- Advertisement -
- Advertisement -

డ్రగ్స్ ఇచ్చి మృగ వాంఛ తీర్చుకున్నాడు
ఐదుగురు కొరియన్ యువతులపై అత్యాచారం
ఆ దృశ్యాలను రికార్డు చేశాడు
భారతీయుడు భలేశ్ ధన్‌కర్‌ను దోషిగా తేల్చిన సిడ్నీ కోర్టు

సిడ్నీ: అతను విదేశంలో మంచి పేరు, హోదా సంపాదించిన భారతీయ సంతతి వ్యక్తి. అయినా తెరవెనుక దారుణాలకు ఒడిగట్టాడు. అవసరంలో ఉన్న అమ్మాయిల బలహీనతలను పసిగట్టి, వారికి డ్రగ్స్ ఇచ్చి మరీ లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఇలా ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా ఐదుగురు కొరియన్ యువతులపై దారుణంగా మృగంలా ప్రవర్తించాడు. ఇప్పుడు పాపం పండి పోలీసుల చేతికి చిక్కి దోషిగా తేలాడు. స్థానిక మీడియా కథనాల ప్రకారం..ఆస్ట్రేలియాలోని భారతీయ కమ్యూనిటీలో భలేశ్ ధన్‌కర్ పేరున్న వ్యక్తి . గతంలో అతను అక్కడ భారత్‌కు చెందిన ఓ రాజకీయ పార్టీకి పని చేశాడు కూడా.

కొరియన్ సినిమాలు, భాష, అమ్మాయిల పట్ల ఆకర్షితుడయ్యాడు.ఆ క్రమంలోనే 2017లో కొరియన్ అనువాదకులు కావాలంటూ ఓ నకిలీ ఉద్యోగ ప్రకటన ఇచ్చాడు. అక్కడి నుంచి అతని దారుణాలు మొదలైనాయి. ఒంటరిగా, కొత్తగా సిడ్నీకి వచ్చిన వారిని, ఉద్యోగం అవసరమున్న యువతులను మాయమాటలు చెప్పి గాలం వేసేవాడు. మొదట వారిని ఓ హోటల్‌లో ఉత్తుత్తి ఇంటర్వూ చేసేవాడు. వారితో జరిగిన ప్రతి సంభాషణనూ రికార్డు చేసేవాడు. ఆ తర్వాత డిన్నర్‌కు రావాలని బలవంతం చేసేవాడు. అలా వచ్చిన యువతులకు డ్రగ్స్ కలిపిన వైన్, ఐస్‌క్రీమ్ ఇచ్చేవాడు.

Also Read: యువతి ప్రైవేటు వీడియోలు వైరల్… మనస్తాపంతో భర్త ఆత్మహత్య

ఆ మత్తులో వారు అపస్మారక స్థితిలో వెళ్లగా వారిపై మృగంలాగా పడి తన పశువాంఛను తీర్చుకునే వాడు. అత్యాచార దృశ్యాలను రికార్డు కూడా చేసేవాడు. బెడ్‌ పక్కన ఉండే అలారం క్లాక్, ఫోన్ కెమెరాల్లో అవన్నీ రికార్డయ్యేవి. ఇలా ఒకరు కాదు..ఇద్దరు కాదు.. ఏకంగా ఐదుగురు కొరియన్ యువతులపై భలేశ్ అత్యాచారానికి పాల్పడ్డాడు. అతని బారిన పడిన యువతుల్లో ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతని పాపం పండింది. అతని అపార్ట్‌మెంట్‌ను సోదా చేసిన పోలీసులకు పదుల సంఖ్యలో ఇలాంటి వీడియోలు కనిపించాయి.

Also Read: ఈనెల 29న మోడీ అధ్యక్షతన కాశీ తెలుగు సంగమం

వాటిలో కొందరు యువతులు అపస్మారక స్థితిలో ఉండడం కనిపించింది. అలాగే ఈ వీడియోలను దాచిపెట్టిన ఫోల్డర్లకు కొరియన్ యువతుల పేర్లు పెట్టాడు. అలా ఐదుగురు కొరియన్ యువతులపై అత్యాచారానికి పాల్పడినట్లు సిడ్నీలోని జిల్లా కోర్టు సోమవారం దోషిగా నిర్ధారించింది. అతనిపై కేసు నమోదు చేయాల్సిందిగా పోలీసులను ఆదేశించింది. కాగా విచారణ సందర్భంగా భలేశ్ మొదట తాను నిర్దోషినని వాదించాడు. అయితే సాక్షాధారాలన్నీ అతనికి వ్యతిరేకంగా ఉండడంతో చివరికి నేరాన్ని అంగీకరించాడు.

జీవితంలో ఒంటరితనం తాను ఈ నేరాలకు పాల్పడడానికి కారణంగా చెప్పుకొన్నాడు. వివాహేతర సంబంధాల కారణంగా తన పెళ్లి పెటాకులయిందని, భార్య తనను వదిలేసిందని అతను కోర్టు గదిలోనే ఏడ్చేశాడు. అంతేకాదు, ఈ కేసులో చట్టపరమైన ఖర్చుల కోసం తన ఆస్తులన్నీ అమ్ముకున్నట్లు కూడా వాపోయాడు. అయితే విచారణ సందర్భంగా కోర్టు హాలులో ఉన్న అతని మాజీ భార్య కూడా కన్నీళ్లు పెట్టుకోవడం కొసమెరుపు. కాగా రాజకీయ బలం ఉన్న మానవమృగంగా కోర్టు, సిడ్నీచరిత్రలోనే నీచమైన రేపిస్టుగా అక్కడి మీడియా భలేశ్‌ను వర్ణించడం విశేషం. కాగా మే నెలలో భలేశ్‌పై కేసు విచారణ ప్రారంభం కానుంది. ఈ ఏడాదిలోనే అతనికి జైలుశిక్ష కూడా ఖరారయ్యే అవకాశం ఉంది.

బిజెపి మాజీ సభ్యుడు
కాగా భలేశ్ బిజెపి మాజీ సభ్యుడు. ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బిజెకి గతంలో చీఫ్‌గా పని చేశాడు. అతని వెబ్‌సైట్‌లో భారత ప్రధాని నరేంద్ర మోడీతో కలిసి ఉన్న ఫోటోలు, న్యూ సౌత్‌వేల్ ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొన్న ఫోటోలు ఉండడం విశేషం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News