తలలు అతుక్కుపోయిన యూదు కవలలకు
అరుదైన శస్త్ర చికిత్స
సక్సెస్ చేయడంలో కీలకపాత్రధారి కాశ్మీరీ ముస్లిం వైద్యుడు
ఆపరేషన్‌కు వేదికైన జెరూసలేంలోని హాస్పిటల్
తనకు చిన్నారులంతా ఒకటే అన్న వైద్యుడు నూర్‌ఉల్‌జిలానీ
జెరూసలేం: జాతి విద్వేషాలకు వేదికగా పేరున్న జెరూసలేంలో ఓ అరుదైన మానవీయ సంఘటన జరిగింది. తలలు అతుక్కుపోయి పుట్టిన యూదు కుటుంబానికి చెందిన కవలలకు ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేయడంలో కాశ్మీర్‌కు చెందిన ఓ ముస్లిం డాక్టర్ కీలక పాత్ర పోషించారు. ఇది విశ్వమానవీయతను చాటే సంఘటనగా రికార్డు కానున్నది. అత్యంత అరుదైన ఈ శస్త్ర చికిత్సను నిర్వహించడంలో కీలకపాత్రధారి ఓ భారతీయ ముస్లిం కావడం గమనార్హం. ఈ అరుదైన సంఘటన యూదులు, ముస్లింలకు మధ్య ఉద్రిక్త ప్రాంతంగా పేరున్న జెరూసలేంలో జరగడం పట్ల అన్ని మతాలవారి నుంచి హర్షం వ్యక్తమవుతోంది. లండన్‌లోని గ్రేట్ ఆర్మాండ్ స్ట్రీట్ హాస్పిటల్‌లో పని చేసే చిన్నపిల్లల డాక్టర్ నూర్ ఉల్ ఓవాసే జిలానీతోపాటు సహ వైద్యుడు డేవిడ్ డన్‌వేకు అతుక్కుపోయిన కవలల్ని విడదీయడంలో ప్రపంచస్థాయి నిపుణులుగా పేరున్నది.
ఇజ్రాయెల్‌లోని సొరోకా హాస్పిటల్ వైద్యులు తాము నిర్వహించే ఆపరేషన్‌కు సహకారం కావాలంటూ జిలానీని కోరగా వెంటనే అంగీకరించారు. బయటి దేశానికి వెళ్లి ఇలాంటి ఆపరేషన్ నిర్వహించడం జిలానీకి ఇదే మొదటిసారి. అంతేగాక తాను ఆపరేషన్ నిర్వహించింది యూదు చిన్నారులకు. వైద్యులుగా మేమంతా ఒకటే అని జిలానీ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. వైద్యం అన్ని విభేదాలనూ అధిగమిస్తుందని ఆయన అన్నారు. కాశ్మీరీ వైద్యుడు ఇజ్రాయెల్ వైద్య బృందంతో కలిసి యూదు చిన్నారులకు ఆపరేషన్ నిర్వహించడం వైద్యశాస్త్రం విశ్వమానవీయమైందిగా చాటే సంఘటన అని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. రంగు,మతంతో సంబంధం లేకుండా తనకు చిన్నారులంతా ఒకటేనని జిలానీ అనడం ఆయన మానవీయ ఆదర్శానికి అద్దం పడుతోంది. తాము నిర్వహించిన ఆపరేషన్ వల్ల ఆ కుటుంబం ఎంతో ఆనందంగా ఉన్నదని ఆయన అన్నారు. ఆ కుటుంబంలో వెల్లివిరిసిన ఆనందాన్ని తానింతవరకు ఎక్కడా చూడలేదని ఆయన అన్నారు. ఆనందం పట్టలేక చిన్నారుల తల్లి ఉబ్బితబ్బిబ్బవుతుంటే ఆమెను నిదానంగా ఓ కుర్చీలో కూర్చోబెట్టి శాంతపరిచామని ఆయన తెలిపారు.